‘బలగం’ సినిమాలో క్లైమాక్స్ పాట గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘‘తోడుగా మాతోడుండి..’’ అంటూ సాగే ఆ పాట ప్రేక్షకులను కంటతడి పెట్టించింది. మానవ సంబంధాల విలువలను ఆకాశానికెత్తింది. అంతలా ఆకట్టుకున్న ఆపాట కట్టి పాడిన మొగిలయ్య ,కొమురమ్మల కోసం ఎంత చెప్పినా తక్కువే..అయితే ఇటీవల మొగిలయ్య తీవ్ర అనారోగ్యంతో నిమ్స్ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. మొగిలయ్య ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసుకునే ప్రయత్నం చేసింది ABP దేశం. నేరుగా మొగిలయ్య చికిత్స పొందుతున్న హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రికి వెళ్లింది. మొగిలయ్యను పలకరించింది. ఈ సందర్భంగా ‘బలగం’ మొగిలయ్య, కొమరమ్మలు వారి కష్టసుఖాలను ‘ABP దేశం’తో పంచుకున్నారు. వారేమన్నారో వారి మాటల్లోనే..
ఊపిరి తీసుకోవడం కష్టమైంది
ఉన్నట్లుండి ఓరోజు రాత్రి ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది. ఉలిక్కిపడి నిద్ర నుండ లేచాను. గుండెలో సమస్య తలెత్తింది. వెంటనే వరంగల్ ప్రభుత్వాసుపత్రిలో వెళ్లాము. అక్కడ ఇబ్బంది తలెత్తడంతో మంత్రి హారీష్ రావుగారు వెంటనే స్పందించి మెరుగైన వైద్యం కోసం నన్ను ఇలా హైదరాబాద్ నిమ్స్ కు తరలించారు.నా ప్రాణాలు రక్షించారన్నారు మొగిలయ్య.
నా భర్త బతికేదెట్లా అని భయపడ్డా: మొగిలయ్య భార్య కొమరమ్మ
‘‘గత ముఫై ఏళ్లుగా నా భర్త మొగిలయ్య షుగర్ వ్యాధితో బాధ పడుతున్నాడు. దానికి తోడు కిడ్నీ సమస్య తలెత్తడంతో ఇప్పటి వరకూ చికిత్స కోసం రూ.15 లక్షలు ఖర్చు చేశాం. ఇకపై ఖర్చుపెట్టే స్తోమత లేక నా భర్తను కాపాడాలంటూ వేడుకున్నాను. ప్రభుత్వ పెద్దలకు మా దుస్థితి గురించి తెలియాలనే వీడియో విడుదల చేశాం. వెంటేనే వైద్య ఆరోగ్యశాఖా మంత్రి హరిష్ రావుగారు స్పందించారు. నిమ్స్ లో చేర్పించి నా భర్తకు ఉచితంగా, మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ప్రాణాపాయ పరిస్థితిలో ఆస్పత్రిలో చేరిన నా భర్త మొగిలయ్యకు ఇప్పుడు ఆర్యోగ్యం కాస్త మెరుగురుపడింది. గుండె సంబంధిత సమస్య నుండి కోలుకున్నారు. నిమ్స్‌కు చేరినప్పుడు నా భర్త బతికేదెట్లా, ఎవరు సహాయం చేస్తారని మానసిక వేదనకు లోనయ్యాం. ఇప్పుడు నా భర్తను రక్షించుకున్నానంటే అది ప్రభుత్వ పెద్దల సహాయంతోనే’’
పాటే మా జీవనోపాధి
మూడు తరాలుగా మేము ఈ పాటకట్టే వృత్తిని నమ్ముకునే జీవిస్తున్నాం. నా భర్త , వాళ్ల తండ్రి, తాత ఇలా మాకు జీవనోపాధి ఇదే. ఎవరైనా చనిపోతే వారి జ్ఞాపకార్దం వారి కుంటుంబ సభ్యులు డబ్బులిస్తే.. చనిపోయిన వారిని గుర్తు చేస్తూ, వారి మధ్య అనుబంధాలు కళ్లకు కట్టినట్లుగా మా పాటలతో ఆకట్టుకోవడమే మాకు తెలిసిన విద్య. నా భర్త మొగిలయ్య అనారోగ్యంతో బాధపడుతుంటే గత ముఫై ఏళ్లుగా పల్లెటూళ్లలో మేము పాడే పాటలకు వచ్చే డబ్బు మందులకు సరిపోయేవి. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ జీవితాన్ని నెట్టుకొస్తున్నాం’’ అని ‘ABP దేశం’తో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమైయ్యారు మొగిలయ్య బార్య కొమురమ్మ.
‘బలగం’ సినిమాలో ఎలా అవకాశం వచ్చంటే..?
‘‘దర్మకుడు వేణుసారు ఓసారి మా వద్దకు వచ్చారు. ఓ పాట పాడమని అడిగారు. అలా రెండు పాటలు వినిపించాం. అవి బాగున్నాయి. కానీ నాకు చావుమీద పాట కట్టాలని అడిగారు. ఎవరైనా చనిపోతే వారిని గుర్తు చేసుకుంటూ కుటుంబ సభ్యులు పాట పాడితే ఎలా ఉంటుందో వారి ఆవేదన ,అనుబంధాలు ఆ పాటలో ఉండాలని చెప్పారు. అలా వచ్చిన పాటే.. తోడుగా మాతోండి. ‘బలగం’ సినిమాలో మేము పాడిన క్లైమాక్స్ పాట అది. సినిమా విడుదలైన తరువాత ఆ పాట విని ఎన్నో దూరమైన కుటుంబాలు మళ్లీ కలిశాయి. విడిపోయిన కుటుంబ సభ్యులు ఒక్కటయ్యారు’’ అని చెప్పారు.
మాకు చదువు రాదు. అక్షరం నేర్చుకోలేదు. కానీ పల్లెటూళ్లలో బంధాలు, అనుబంధాలపై అవగాహన ఉంది. తండ్రితో బిడ్డలు ఎలా నడుచుకోవాలి.. అన్నదమ్ముల మధ్య ఆప్యాయత ఎలా ఉండాలి. తోడబుట్టిన చెల్లిని అన్నలు ఎలా చూసుకోవాలి. ఇలా వారి మధ్య ఆప్యాయత పెంపొందించేలా మా పాటలుంటాయి. బంధాలు బలపడేలా ఎవరు ఎలా నడుచుకోవాలో మాకున్న అవగాహనతోనే పాటకట్టి పాడేవాళ్లం. ఆ పాటలతోనే మూడు తరాలుగా అందరి అభిమానం పొందుతున్నాం. ఇలా సందర్భాన్ని బట్టి వివిధ పాటలు కట్టి పాడుతుంటాం. నా భర్తను అనారోగ్య సమస్య నుంచి కాపాడి, కోలుకునేలా చేస్తే చాలు. అంతకు మించి పెద్ద ఆశలేవి లేవు’’ అని కొమరమ్మ అన్నారు.
పవన్ కళ్యాణ్‌పై తప్పుడు ప్రచారం చేసి మమ్మల్ని బాధపెట్టొద్దు..!
నా భర్త మొగిలయ్య అనారోగ్యంతో చికిత్స పొందుతుంటే. మా బాధల్లో మేముంటే. కొందరు సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మొగిలయ్య దంపతులు. పవన్ కళ్యాణ్ మాకు ఐదు లక్షల రూపాయలు ఇచ్చాడని, మంత్రి రోజా రెండు లక్షల రూపాయలు ఇచ్చిందనే ప్రచారం జరుగుతోంది. ఇలా సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు రాసి మమల్ని మానసికంగా కృంగదీస్తున్నారని, దయచేసి అటువంటి అసత్య ప్రచారం చేయొద్దంటూ వేడుకుంటున్నారు.
Also Read: ‘విరూపాక్ష’ డైరెక్టర్ ఎక్కువ రోజులు బతకడని డాక్టర్లు చెప్పారు: దర్శకుడు సుకుమార్