Director Tharun Bhascker Dhaassyam: టాలీవుడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దాస్యం తెరకెక్కించిన 'కీడా కోలా' సినిమా వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. లెజండరీ గాయకుడు, దివంగత ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం వాయిస్ ను ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ టెక్నాలజీ ద్వారా రీక్రియేట్ చేయడంపై ఆయన తనయుడు సింగర్ ఎస్పీ చరణ్ అభ్యంతరం తెలిపారు. ఈ మేరకు తరుణ్ భాస్కర్, మ్యూజిక్ డైరెక్ట్ వివేక్ సాగర్‌ తోపాటు సినిమా మేకర్స్ కు లీగల్ నోటీసులు పంపించారు. ఈ మధ్య కాంట్రవర్సీపై తరుణ్ భాస్కర్ తాజాగా స్పందించారు. కమ్యూనికేషన్ ఇష్యూస్ వల్లనే ఇదంతా జరిగిందని చెప్పారు. 


తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. 'మాకు, ఎస్పీ చరణ్ సార్‌కు మధ్య కొంచెం కమ్యూనికేషన్ ఇష్యూస్ వచ్చాయి. అది మా సైడ్ నుంచి.. చరణ్ సార్ సైడ్ నుంచి కూడా. ఎవరైనా సరే ఏదైనా సమ్‌థింగ్ ఎగ్జైటింగ్ కొత్తగా చేయాలని అనుకుంటారు. మన సినీ దిగ్గజాలను గౌరవించాలని అనుకుంటాం. అంతకు మించి ఏం లేదు. ఎవరినీ అగౌరవపరచాలనే ఉద్దేశం ఏం ఉండదు. మీరు చూస్తున్నారు.. నేను చేసేది చిన్న సినిమాలు. పెద్ద స్టార్స్‌తో ఏదో కమర్షియల్ గా చెయ్యాలని నేను అనుకోను. నాకు కమర్షియల్ మెంటాలిటీ లేదు. మా వరకు ఏదైనా కొత్తగా చేయాలనే ప్రయత్నం చేశాం" అని అన్నారు.


'ఏఐ వచ్చినా కూడా దానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఇవాళ నా జాబ్ గానీ, మీ జాబ్ గానీ ప్రమాదంలో ఉంది. రేపు ఏం అవుతుందో మనకు తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో మనమందరం ప్రతి ఒక్కరినీ గౌరవించుకోవాలి.. ప్రయోగాలు చెయ్యాలి. ఎందుకంటే నేను చేసినా, ఇంకెవరు చేసినా చేయకపోయినా ఎవల్యూషన్ అనేది జరుగుతుంది. కాబట్టి ఆ కొన్ని విషయాల్లో కొన్ని మిస్ కమ్యూనేషన్స్ అయి ఉండొచ్చు కానీ, అంతా క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఏ సమస్య లేదు" అని డైరెక్టర్ తరుణ్ భాస్కర్ చెప్పుకొచ్చారు.


అసలేం జరిగిందంటే... 
ఈ నగరానికి ఏమైంది' సినిమా తర్వాత దాదాపు ఐదేళ్లు గ్యాప్ తీసుకున్న డైరెక్టర్ తరుణ్‌ భాస్కర్‌.. గతేడాది ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన 'కీడాకోలా' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందులో ఓ సన్నివేశంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన 'స్వాతిలో ముత్యమంత' అనే పాట బ్యాగ్రౌండ్‌లో వినిపిస్తూ ఉంటుంది. ఇది బాలకృష్ణ నటించిన 'బంగారు బుల్లోడు' చిత్రం కోసం రాజ్-కోటి స్వరపరిచిన క్లాసిక్ సాంగ్. అయితే తరుణ్‌ భాస్కర్‌ అదే పాటను సినిమాలో పెట్టకుండా, ఏఐ సాయంతో ఎస్పీబీ గొంతును రీక్రియేట్‌ చేశారు. దీనిపైనే ఎస్పీ చరణ్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. 


తన తండ్రి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గొంతును అనైతికంగా, చట్టవిరుద్ధంగా ఉపయోగించినందుకు క్షమాపణలు చెప్పాలని కోరారు ఎస్పీ చరణ్‌. దీనికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ జనవరి 18న 'కీడా కోలా' టీమ్ కు లీగల్ నోటీసులు పంపించారు. దీనిపై ఇంతవరకూ చిత్ర బృందం తరపు నుండి ఎవరూ స్పందించలేదు. అయితే తాజాగా డైరెక్టర్ తరుణ్ భాస్కర్ 'తులసీవనం' అనే వెబ్ సిరీస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ చరణ్‌ తో వివాదం గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనికి ఆయన సమాధానమిస్తూ ఇప్పుడంతా క్లియర్ అయిపోయిందని, ఆ సమస్య ముగిసిపోయిందని తెలిపారు. దీంతో ఎస్పీ చరణ్‌ - తరుణ్ భాస్కర్ వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్లయింది. 


Also Read: ఈసారి రామ్ చరణ్ బర్త్ డే వెరీ వెరీ స్పెషల్.. ఎందుకంటే?