Srinu Vaitla About Movie With Balakrishna: ఒకప్పుడు స్టార్ హీరోలతో లవ్, యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్స్ రూపొందించి మంచి హిట్స్ అందుకున్నారు డైరెక్టర్ శ్రీనువైట్ల. రవితేజ, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ ఇలా స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. గతేడాది గోపీచంద్ 'విశ్వం'తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే, ఈ మూవీ అనుకున్నంత విజయం సాధించలేకపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు శ్రీను వైట్ల.

బాలకృష్ణతో మూవీపై...

దాదాపు అందరు స్టార్ హీరోలతో మూవీస్ చేసినా గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణతో మూవీ చేయకపోవడానికి కారణం ఏంటి? అనే ప్రశ్నకు స్పందించారు శ్రీను వైట్ల. ఒకప్పుడు ఆయనతో ఓ మూవీ చేయాల్సి ఉండేదని... కానీ సాధ్య పడలేదని తెలిపారు. 'బాలకృష్ణకు నేను వీరాభిమాని. ఆయన నటించిన 'ప్రాణానికి ప్రాణం' మూవీతోనే అప్రెంటిస్‌గా నా కెరీర్ ప్రారంభం అయ్యింది. భవిష్యత్తులో తప్పకుండా ఆయనతో ఓ మూవీ చేస్తాను.' అని వెల్లడించారు.

Also Read: సార్... ఈయన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్! - అయినా సరే మాస్క్ తీసి చూపించండి

'ఢీ' సీక్వెల్‌పై

శ్రీను వైట్ల డైరెక్షన్‌లో విష్ణు మంచు హీరోగా వచ్చిన కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఢీ' బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందని ప్రచారం జరిగినా తాజా ఇంటర్వ్యూలో దీనిపై క్లారిటీ ఇచ్చారు శ్రీను వైట్ల. 'ఢీ' సినిమాలో రియల్ స్టార్ శ్రీహరి పాత్ర చాలా కీలకమని... ఆయన లేరు కాబట్టి వేరొకరితో ఆ క్యారెక్టర్ కొనసాగించలేమని చెప్పారు. అప్పట్లో దీనికి సీక్వెల్ చేద్దామనే ఆలోచన ఉన్నా... ఆ తర్వాత ఆపేద్దామని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

ఆ బాధ ఎప్పటికీ ఉంది

సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీనువైట్ల కాంబోలో వచ్చిన దూకుడు బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అంతే అంచనాలతో ఆ తర్వాత వీరిద్దరి కాంబోలో వచ్చిన 'ఆగడు' డిజాస్టర్‌గా మిగిలింది. ఈ రిజల్ట్‌పై తాజా ఇంటర్వ్యూలో శ్రీను వైట్ల స్పందించారు. 'ఆగడు మూవీ చూసిన వారంతా దూకుడులా ఉందని చెప్పారు. అయితే, మూవీ రిలీజ్ తర్వాత చాలా విమర్శలు వచ్చాయి. నాకు కూడా చాలా సీన్స్‌లో అసంతృప్తి ఉంది. దూకుడు వచ్చిన కొన్నేళ్లకే ఆగడు రావడంతో రెండు మూవీస్‌ను కంపేర్ చేసుకున్నారు.

ఈ సినిమా స్టోరీ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందేమో. ఇప్పటికీ ఈ విషయంలో నేను బాధ పడుతూనే ఉన్నా. మహేష్ బాబుకు మరో మంచి హిట్ ఇవ్వలేదనే ఫీలింగ్ నాకు ఉంది. ఛాన్స్ వస్తే మళ్లీ మహేష్‌తో ఓ బ్లాక్ బస్టర్ మూవీ తీయాలని ఉంది.' అని తెలిపారు.

టైం తీసుకున్నా మంచి సినిమాలు తీసి తానేంటో నిరూపించుకుంటానంటూ శ్రీనువైట్ల చెప్పారు. తన మూవీస్‌లో కామెడీ సీన్స్ కచ్చితంగా ఉంటాయని స్పష్టం చేశారు. నీకోసం, సొంతం, వెంకీ, నమో వెంకటేశ, ఢీ, దుబాయ్ శీను, రెడీ, కింగ్, దూకుడు, బాద్ షా వంటి మంచి హిట్స్ అందించిన శ్రీను వైట్ల... ప్రస్తుతం ఫుల్ లెంగ్త్ కామెడీ మూవీ స్టోరీ రాస్తున్నట్లు తెలిపారు.