Indian 2 Movie: ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న మూవీ ‘భారతీయుడు 2’ (తమిళంలో ‘ఇండియన్-2’). 1996 లో విడుదలై సంచలనం సృష్టించిన ‘భారతీయుడు’ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ మూవీ మొదలై చాలా రోజులు అయింది. కొంత భాగాన్ని షూట్ చేశారు కూడా. తర్వాత అనుకోని కారణాల వల్ల ఈ మూవీ షూటింగ్ లకు బ్రేక్ పడింది. దీంతో ఈ ప్రాజెక్ట్ కు బ్రేక్ ఇచ్చి రామ్ చరణ్ తో ‘గేమ్ చేంజర్’ మూవీను పట్టాలెక్కించారు. తర్వాత ‘ఇండియన్ 2’ షూటింగ్ కు లైన్ క్లియర్ అవ్వడంతో షూటింగ్ ను మొదలుపెట్టారు. అయితే ఈ గ్యాప్ లో మూవీలో కీలక పాత్రల్లో నటించిన ఓ ఇద్దరు నటులు మరణించడంతో కంప్యూటర్ గ్రాఫిక్స్ ను ఉపయోగించి వారిని ఫుల్ మూవీలో చూపించడానికి ప్లాన్ చేస్తున్నారట. ఇప్పుడిదే ఫిల్మ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
సీజీఐలో ఆ ఇద్దరు నటులు
‘ఇండియన్ 2’ సినిమాలో ఇప్పటికే పలు కీలక సన్నివేశాలను షూట్ చేశారు దర్శకుడు శంకర్. అయితే మధ్యలో కొన్నాళ్లు షూటింగ్ కు గ్యాప్ రావడంతో ఈ సమయంలో మూవీలో కీలక పాత్రల్లో నటించిన వివేక్, నెడుముడి వేణులు మృతి చెందారు. ఇప్పుడు మళ్లీ ఆ పాత్రల్లో కొత్త వారిని పెట్టి సన్నివేశాలు రీ షూట్ చేయడానికి చాలా ఖర్చు అవుతుందట. అందుకే దర్శకుడు శంకర్ మరో కొత్త ఆలోచన చేశారు. టెక్నాలజీని వాడుకోవడంలో శంకర్ ఎప్పుడూ ముందంటారు. అయితే ఇప్పుడు ఉపయోగించే టెక్నిక్ గతంలో ఎప్పుడూ ఉపయోగించలేదట. ఇప్పుడా టెక్నాలజీని ఉపయోగించి వివేక్, వేణు పాత్రలను సినిమా మొత్తం చూపించాలని చూస్తున్నారట. అలాగే అదే కంప్యూటర్ గ్రాఫిక్స్ ను ఉపయోగించుకొని హీరో కమల్ హాసన్ ను కూడా చాలా యంగ్ గా చూపించనున్నారట శంకర్. మరి ఈ ప్రయోగం ఎంత వరకూ సక్సెస్ అవుతుందో చూడాలి.
‘ఇండియన్ 2’పై భారీ అంచనాలు
శంకర్ సినిమా వస్తుందంటే చాలు దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తారు. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలతో పాటు ఆయన సినిమాల ద్వారా సమాజానికి ఏదొక పెద్ద మేసేజ్ ఇస్తూ ఉంటారు. అందుకే ఆయన మూవీలకు అంత క్రేజ్ ఉంటుంది. అందులోనూ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతాయి ఆయన సినిమాలు. శంకర్ నుంచి గతంలో వచ్చిన ‘ఐ’, ‘రోబో 2.O’ చిత్రాలు ఆశించినంతగా విజయం సాధించలేకపోయాయి. అందుకే ఇప్పుడు రాబోతున్న ‘ఇండియన్ 2’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దానితోపాటు రామ్ చరణ్ తో తెరకెక్కిస్తున్న ‘గేమ్ చేంజర్’ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ డబుల్ రోల్ లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీను కూడా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు నిర్మాత దిల్ రాజు. మరీ ఈ రెండు సినిమాలతో శంకర్ మళ్ళీ ఫామ్ లోకి వస్తారో లేదో చూడాలి.
Also Read: మానని గాయం, సాయి తేజ్‌ను వెంటాడుతోన్న ఆ ప్రమాదం - మరో సర్జరీకి ఏర్పాట్లు?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial