ఈవారం థియేటర్లో సీనియర్ స్టార్ హీరోల సినిమాలు పోటీపడుతున్నాయి. ఆగస్ట్ 10న రజినీకాంత్ ‘జైలర్’ విడుదలయిన తరువాతి రోజే చిరంజీవి ‘భోళా శంకర్’ థియేటర్లలోకి అడుగుపెట్టనుంది. ఈ ఇద్దరి సీనియర్ హీరోలు పోటాపోటీగా సినిమాలు విడుదల చేస్తుంటే.. అసలు ఈ పోటీ ఎలా కొనసాగుతుందో చూడడానికి ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ రెండు చిత్రాలు ట్రైలర్స్‌తో అందరినీ ఆకట్టుకున్నాయి. కానీ రెండిటిలో ‘భోళా శంకర్’ ట్రైలర్‌కు మాత్రం కొంచెం నెగిటివ్ టాక్ వచ్చింది. చాలా రొటీన్‌గా ఉందంటూ కొంతమంది ఓపెన్‌గా ట్రోల్ చేశారు కూడా. కానీ అవేవి పట్టించుకోకుండా మూవీ టీమ్ మాత్రం సినిమా సక్సెస్‌పై చాలా నమ్మకంతో ఉంది. తాజాగా మెహర్ రమేశ్ కూడా మెగాస్టార్ క్లాసిక్ చిత్రాలకు ధీటుగా ‘భోళా శంకర్’ ఉంటుందని వ్యాఖ్యలు చేశాడు.


మెహర్ రమేశ్ కాన్ఫిడెన్స్..
‘భోళా శంకర్’ టీమ్ మొత్తం అసలు విరామం లేకుండా సినిమాను ప్రమోట్ చేయడంలో బిజీగా ఉన్నారు. చిరంజీవి సైతం ఒకటి కూడా మిస్ అవ్వకుండా ప్రతీ ఇంటర్వ్యూలో పాల్గొంటున్నారు. ఇక దర్శకుడు మెహర్ రమేశ్, నిర్మాత అనిల్ సుంకర కూడా ‘భోళా శంకర్’ ప్రమోషన్స్ బాధ్యతను తమ భుజంపై వేసుకున్నారు. ప్రేక్షకులు ఎంత నెగిటివిటీ చూపించినా.. ఎన్ని నెగిటివ్ కామెంట్స్ చేసినా.. మెహర్ మాత్రం తన సినిమాపై కాన్ఫిడెంట్‌గానే ఉన్నాడు. అన్ని వర్గాల ప్రేక్షకులకు సినిమా నచ్చుతుంది అని కచ్చితంగా చెప్తున్నాడు. ‘భోళా శంకర్’లో అన్నా చెల్లెలి సెంటిమెంట్ సినిమాకు ప్రాణమని అన్నాడు. దాంతో పాటు యాక్షన్, డ్రామా.. ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉంటాయని తెలిపాడు.


కమర్షియల్ మీటర్‌లో ఉంటుంది..
మళ్లీ రీమేకా అంటూ వస్తున్న కామెంట్స్‌పై కూడా మెహర్ రమేశ్ స్పందించాడు. రీమేక్ అయినా కూడా కథలో తగిన మార్పులు జరిగాయని హామీ ఇచ్చాడు. చిరంజీవి ఇమేజ్‌కు సూట్ అయ్యేటట్టు కథ మారిందని అన్నాడు. ‘భోళా శంక్రర్’ సినిమా షూటింగ్ మొత్తం ఒక పిక్నిక్‌లాగా సాగిందని, చిరంజీవి అందరితో సరదాగా ఉండేవారని తెలిపాడు. మూవీ మొత్తం చిరంజీవి మార్క్ ఎంటర్‌టైన్మెంట్ ఉంటుందని చెప్పాడు. ‘రౌడీ అల్లుడు’, ‘ఘరానా మొగుడు’, ‘గ్యాంగ్ లీడర్’ లాంటి కమర్షియల్ మీటర్ ఉన్న చిత్రాల జాబితాలో చేరే స్థాయి ‘భోళా శంకర్’కు ఉందన్నాడు. చిరంజీవి సినిమా అంటే ప్రేక్షకులు ఏం ఆశిస్తారో అవన్నీ ఈ సినిమాలో ఉంటాయన్నాడు. పవన్ కళ్యాణ్ మ్యానరిజంను చిరు ఇమిటేట్ చేయడం అయితే ఫ్యాన్స్‌కు మరింత ఊపునిస్తుందని కచ్చితంగా చెప్తున్నాడు.


కీర్తితో చిరు క్యూట్ బాండ్..
ఆగస్ట్ 11న విడుదలకు సిద్ధమవుతున్న ‘భోళా శంకర్’లో చిరంజీవికి జోడీగా తమన్నా నటిస్తుండగా.. చిరుకు చెల్లెలి పాత్రలో కీర్తి సురేశ్ కనిపించనుంది. ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు.. ఆఫ్ స్క్రీన్ కూడా కీర్తితో క్యూట్ బాండ్‌ను షేర్ చేసుకుంటున్నారు మెగాస్టార్. ఈ చిత్రంలో కీర్తి సురేశ్‌కు జోడీగా అక్కినేని హీరో సుశాంత్ కనిపించనున్నాడు. హీరోగా ఛాన్సులు తగ్గిపోతున్న సమయంలో మెగా హీరోల సినిమాలో కీలక పాత్రలు చేస్తూ.. సుశాంత్ ప్రశంసలు అందుకుంటున్నాడు. అందుకే సైడ్ క్యారెక్టర్స్‌ను ఒప్పుకోవడానికి తను కూడా ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదని అర్థమవుతోంది. 


Also Read: జస్ట్ మిస్, ఐశ్వర్యా రాజేష్‌‌పై దాడి చేయబోయిన డాల్ఫిన్ - వీడియో వైరల్


Join Us on Telegram: https://t.me/abpdesamofficial