Pawan Kalyan's Hari Hara Veera Mallu Trailer Huge Response: పవర్ స్టార్ ఫ్యాన్స్, మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన 'హరిహర వీరమల్లు' ట్రైలర్ వచ్చేసింది. పవన్ ఇమేజ్‌కు తగ్గట్లుగా డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్ అదిరిపోయాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో 'హరిహర' ట్రైలర్ ట్రెండింగ్‌గా మారింది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

ఎవ్రీ ఫ్రేమ్... పవర్ అదుర్స్

ఈ పీరియాడికల్ అడ్వెంచరస్ డ్రామాలో పవన్ చారిత్రక యోధుడిగా కనిపించనున్నారు. డైరెక్టర్ జ్యోతికృష్ణ 3 నిమిషాల నిడివి ట్రైలర్‌లో ప్రతీ ఫ్రేమ్ అద్భుతంగా తీర్చిదిద్దారు. పవర్ స్టార్ క్రేజ్ ఏ మాత్రం తగ్గకుండా జ్యోతికృష్ణ హిస్టారికల్ స్టోరీకి తగ్గట్టుగా చిత్రాన్ని భారీగా రూపొందించారు. వార్ సీన్స్, ముఖ్యంగా వీరమల్లు - మొఘలుల మధ్య యాక్షన్ సీక్వెన్స్ గూస్ బంప్స్ తెప్పించాయి.

హైదరాబాద్‌లోని విమల్ థియేటర్‌లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగ్గా... ప్రొడ్యూసర్ ఏఎం రత్నంతో పాటు డైరెక్టర్ జ్యోతికృష్ణ, హీరోయిన్ నిధి అగర్వాల్‌ మూవీ టీం పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవర్ స్టార్‌పై ప్రశంసలు కురిపించారు. 

ఇండస్ట్రీ రికార్డులు మారతాయ్

కొందరు సినిమా గురించి అసత్య ప్రచారాలు చేశారని... ఎన్ని అడ్డంకులు ఎదురైనా.. తమ పని తాము చేసుకుంటూనే ఉన్నామని జ్యోతికృష్ణ తెలిపారు. 'పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కి ఎంత బడ్జెట్ పెట్టినా తక్కువే అనిపిస్తుంది. ఇండియా మొత్తం తిరిగి చూసేలా ఈ సినిమా ఉండబోతుంది. అప్పట్లో ఖుషి సినిమా అత్యధిక వసూళ్లు రాబట్టిన మూవీ. ఆ తర్వాత తెలుగులో మొదటి రూ.100 కోట్ల సినిమా గబ్బర్ సింగ్. అది పవర్ స్టార్ అంటే. ఇప్పుడు మన సినిమాతో మరో భారీ విజయం సాధించబోతున్నాం. ఈ సారి డేట్ మారదు... ఇండస్ట్రీ రికార్డులు మారతాయి. 100 పర్సెంట్ స్టైక్ రేట్ ఇవ్వబోతున్నాం.' అని అన్నారు.

Also Read: 'రామాయణ' ఫస్ట్ గ్లింప్స్‌ రివ్యూ: రాముడిగా రణబీర్ వర్సెస్ రావణుడిగా యష్... ఇద్దరిలో హైలైట్ ఎవరు?

రియల్ స్టార్

పవన్ 'హరిహర వీరమల్లు' మూవీ మన చరిత్రను మనకు గుర్తు చేస్తుందని ప్రొడ్యూసర్ ఎఎం రత్నం అన్నారు. సినిమా ట్రైలర్‌ను మించి ఉంటుందని... ఇప్పటివరకూ పవర్ స్టార్‌ను చూశారని, సినిమాలో రియల్ స్టార్‌ను చూస్తారని తెలిపారు. పవన్ కల్యాణ్ సినీ జీవితంలోనే కాకుండా నిజ జీవితంలోనూ రియల్ హీరో అని ప్రశంసించారు. ఈ నెల 24న అసలైన పండుగ జరుపుకోబోతున్నట్లు నిర్మాత దయాకరరావు అన్నారు. మూవీ టీం ఆరేళ్ల పాటు శ్రమించిన సినిమా ఇది అని చెప్పారు. ఈ సినిమాతో కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్నట్లు హీరోయిన్ నిధి అగర్వాల్ తెలిపారు.

ఈ మూవీని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎఎం రత్నం సమర్పణలో ఎ.దయాకరరావు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. పీరియాడికల్ అడ్వెంచరస్ మూవీకి క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకులుగా వ్యవహరించారు. పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా... బాబీ డియోల్ విలన్ రోల్‌లో నటిస్తున్నారు. అనుపమ్ ఖేర్, సత్యరాజ్, జిషు సేన్ గుప్తా, నాజర్, సునీల్, రఘుబాబు, నోరా ఫతేహి, సుబ్బరాజు కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 24న పాన్ ఇండియా లెవల్‌లో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో మూవీ రిలీజ్ కానుంది.