తాజాగా మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన మరో సెన్సేషనల్ మూవీ ‘2018’. టోవినో థామస్, అపర్ణ బాలమురళి, కొంచక్కో బోబన్ ప్రధాన పాత్రలో ఈ సినిమా తెరకెక్కగా.. జూడ్ ఆంటోనీ జోసెఫ్ ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. ‘2018’ సంవత్సరంలో కేరళ రాష్ట్రాన్ని వరదలు ఎంతలా అతలాకుతలం చేశాయో అందరికీ తెలిసిందే. ఆ వరదలు సృష్టించిన విధ్వంసంలో ఎంతో మంది కేరళ ప్రజలు తమ ప్రాణాలను సైతం కోల్పోయారు. అంతేకాదు ఆ వరదల వల్ల చాలామంది నిరాశ్రయులయ్యారు. ఇక అప్పటి పరిస్థితులను కేరళ ప్రజలు ఎలా ఎదుర్కొన్నారో ‘2018’ సినిమాలో కళ్ళకు కట్టినట్టు చూపించాడు దర్శకుడు ఆంటోనీ జోసెఫ్. దీంతో మలయాళ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ప్రస్తుతం రూ.100 కోట్ల క్లబ్ కి చేరువవుతోంది. ఇక ఈ సినిమాని ఇప్పుడు తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ట్రైలర్ కూడా విడుదల చేశారు. ఇక తెలుగులో ఈనెల 26వ తేదీన ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. యువ నిర్మాత బన్నీ వాసు ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.


కాగా ఈరోజు ఈ సినిమాకు సంబంధించి ప్రెస్ మీట్ ను నిర్వహించగా.. ఈ ప్రెస్ మీట్ లో చిత్ర యూనిట్ తో పాటు టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఓ జర్నలిస్ట్‌‌‌కు - హరిశ్ శంకర్ మధ్య ఓ చిన్న వాగ్వాదం చోటు చేసుకుంది. నిర్మాత బన్నీ వాసుని మీరు వరుసగా డబ్బింగ్ సినిమాలే రిలీజ్ చేస్తున్నారు అని ఆ జర్నలిస్ట్ ప్రశ్నించారు. అలాగే మన తెలుగు దర్శకులు, హీరోలు ఇలాంటి రియలిస్టిక్ చిత్రాలు చేయడానికి ఒప్పుకుంటారా? అని అడిగారు. ఈ ప్రశ్న కాస్త దర్శకుడు హరిశ్ శంకర్ కి ఆగ్రహాన్ని తెప్పించింది. దాంతో హరిశ్ శంకర్ ఇటీవల మీరు ఎక్కువగా వివాదాస్పద ప్రశ్నలు అడుగుతూ అటెన్షన్ కోసం ప్రయత్నిస్తున్నారు అంటూ ఆ జర్నలిస్ట్‌‌కు చురకలు అంటించారు.


‘‘మీరు అడిగిన ప్రశ్న నాకు ఏమాత్రం నచ్చలేదు. అసలు డబ్బింగ్ సినిమాలు అని అనడం ఏంటి? ఇప్పుడు టెక్నాలజీ వల్ల ప్రపంచ సినిమా మొత్తం మన అరచేతిలో ఉంది. ఇంకా డబ్బింగ్ సినిమా అని ఎందుకు వేరు చేస్తున్నారు. బాహుబలి, ఆర్ ఆర్ ఆర్, కే జి ఎఫ్ సినిమాలను నార్త్ వాళ్ళు డబ్బింగ్ సినిమాలు అని అనుకున్నారా? నీకు ఆర్గుమెంట్ కావాలనుకుంటే నేను కదలను. ఎంతసేపైనా మాట్లాడుకుందాం’’ అని హరిశ్ శంకర్ ఆ జర్నలిస్ట్‌పై ఫైర్ అయ్యాడు. డబ్బింగ్ సినిమాలు చేయడం తప్పు కాదు. అది మంచి సినిమా నా కాదా అనేది మాత్రమే చూడాలి’’ అంటూ హరిశ్ శంకర్ తాజా ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చారు. ఇక ఈ  ప్రెస్ మీట్ అనంతరం హరిశ్ శంకర్ ఇదే విషయాన్ని తన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ.. ‘‘చులకన చేసే నోరు ఉన్నప్పుడు చురకలు వేసే నోరు కూడా ఉంటుంది’’ అంటూ ట్వీట్ చేశారు. అంతేకాకుండా ‘‘మన ఇండస్ట్రీని ఇన్సల్ట్ చేయకండి. ప్రతి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఫిలిం మేకర్ ని అప్రిషియేట్ చేయాలి. అంతేగాని వారిని కించపరచకూడదు. ప్రపంచం మొత్తం ఇప్పుడు మనల్ని చూస్తుంది’’ అంటూ పేర్కొన్నాడు. దీంతో ప్రస్తుతం హరీష్ శంకర్ చేసిన ఈ ట్వీట్స్ సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతోంది.





Also Read: ఆన్ లైన్‌లో ఆదాశర్మ ఫోన్ నంబర్ లీక్ - పోలీసులకు ఫిర్యాదులు