Director Bobby About Daaku Maharaaj: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా డైరెక్టర్ బాబీ కొల్లి తెరకెక్కించిన చిత్రం ‘డాకు మహారాజ్’. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఎక్కడా ఖర్చుకు వెనుకాడకుండా భారీ బడ్జెట్‌తో నిర్మించారు. బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశీ రౌతేలా వంటి హీరోయిన్లు నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్‌గా నటిస్తున్నారు. సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలకు సిద్ధమైందీ చిత్రం. ఇక చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర దర్శకుడు బాబీ కొల్లి మీడియాకు ‘డాకు మహారాజ్’ గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. ఆయన మాట్లాడుతూ..


‘‘ఈ సినిమా అనుకున్న డే 1 నుండి బాలకృష్ణగారి ఇమేజ్‌ని, ప్రేక్షకుల్లో ఆయన సినిమాపై ఉండే అంచనాలను దృష్టిలో ఉంచుకుని పనిచేయడం జరిగింది. ఆయన గత చిత్రాలకు భిన్నంగా ఈ సినిమాలో కొత్తగా చూపించడానికి సాధ్యమైనంతగా ప్రయత్నించాము. బాలయ్య‌గారు డైలాగ్‌లు చెప్తే చాలా బాగుంటుంది. ‘నరసింహానాయుడు, సమరసింహారెడ్డి’ తర్వాత ‘సింహా’ ఎలా అయితే గుర్తుండే సినిమా అయిందో.. ఆయనకు ఈ ‘డాకు మహారాజ్’ కూడా అలాంటి సినిమానే అవుతుంది. ఇందులో చాలా నిజాయితీగా కథను చెప్పాము. బాలయ్యగారి నుంచి ఎవరైనా క్రమశిక్షణ నేర్చుకోవచ్చు. ఆయన దర్శకుడికి ఎంతో గౌరవం ఇస్తారు. అలాగే సెట్స్‌లో అందరితో సరదాగా ఉంటారు. ఒక్కటే మాట.. ఆయన దగ్గర మనం ఎంత నిజాయితీగా ఉంటామో.. అంతే స్థాయిలో ఆయన నుండి మనకు గౌరవం ఉంటుంది. అభిమానులు థియేటర్లకి వచ్చేది తన కోసమే అని.. వారికి నేనే కనిపించాలని డూప్ లేకుండా నటించడానికి ఇష్టపడతారు. మొండి గుర్రాన్ని సైతం కంట్రోల్ చేస్తూ, స్వయంగా స్వారీ చేసి మమ్మల్ని ఆశ్చర్యపరిచారు.


Also Readరామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్... శాటిలైట్ కూడా - రైట్స్ ఎవరు తీసుకున్నారో తెలుసా?


నిర్మాత నాగవంశీకి బాలకృష్ణ గారంటే చాలా అభిమానం. ఆ అభిమానంతోనే ఈ సినిమా చాలా వైవిధ్యంగా ఉండాలని అనుకున్నారు. అలాగే ఒక దర్శకుడిగా నాకెంతో ఫ్రీడమ్ ఇచ్చారు. మేమిద్దరం కలిసి ఈ సినిమాలో విజువల్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడేలా చేయాలి అనుకున్నాము. డీఓపీ విజయ్ కన్నన్‌తో నాకు ముందే పరిచయముంది. ఈ సినిమా అనుకున్నప్పుడు ఆయన ‘జైలర్’ సినిమాకి పని చేస్తున్నారు. నాగవంశీకి విజయ్ పేరు చెప్పగానే ఓకే చేసేశారు. విజయ్ ఎంతో అంకిత భావంతో పని చేస్తారు. కథను ఓన్ చేసుకుంటారు. అందుకే ‘డాకు మహారాజ్’ విజువల్స్ అంత అద్భుతంగా వచ్చాయి. హీరోకి ఆయుధం అలంకరణ. బాలయ్యగారి చేతిలో ఆయుధం అంటే ఆ ఆయుధానికి అలంకరణ. శక్తివంతమైన మనిషి చేతిలో అంతే శక్తివంతమైన ఆయుధం ఉండాలి, కానీ అది కొత్తగా ఉండాలి అనుకున్నాము. అందుకు తగ్గట్టుగానే ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ అద్భుతమైన ఆయుధాలను డిజైన్ చేశారు. ఇక సంగీత దర్శకుడు థమన్ గురించి చెప్పేదేముంది. బాలకృష్ణగారంటే చాలు ఆయన డ్యూటీ ఎక్కేస్తాడు. అద్భుతమైన సంగీతం, ఆర్ఆర్ ఇచ్చాడు.. థియేటర్లు దద్దరిల్లిపోతాయి.


ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలతో బాబీ కథాకథనాలు బాగా రాస్తాడు అనే పేరు తెచ్చుకోగలిగాను. అయితే హాలీవుడ్ స్థాయిలో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని మాట్లాడుకునేలా చేయలేకపోయాను. కానీ ‘డాకు మహారాజ్’ ఆ లోటు కూడా తీరింది. ఈ సినిమాకు దర్శకుడు, నటీనటుల కష్టం కంటే కూడా సిబ్బంది ఎక్కువ కష్టపడ్డారు. ఎందుకంటే మేము షూట్ గ్యాప్‌లో నీడలో ఉంటాము. కానీ సిబ్బంది విరామం అనేది లేకుండా ఎండలో ఎంతో కష్టపడతారు. అందుకే వారి కష్టం ముందు మా కష్టం చిన్నది అనిపిస్తుంది.


Also Readవెండితెరకు రాజకీయ రంగులు... తెలుగులో బెస్ట్ పొలిటికల్ ఫిలిమ్స్ - 'గేమ్ చేంజర్'కు ముందు... మీరెన్ని చూశారు?


చిరంజీవి, బాలకృష్ణ వంటి బిగ్ స్టార్స్‌తో పనిచేసే అదృష్టం నాకు దక్కింది. సినిమా విషయంలో చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఇద్దరూ ఒకేలా ఉంటారు. ఇద్దరిలో ఎంతో క్రమశిక్షణ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఇద్దరూ పని రాక్షసులే. నిర్మాతలకు అసలు నష్టం రానివ్వకూడదని.. సినిమా కోసం ఎంతయినా కష్టపడతారు. అవుట్ పుట్ ఇంకా బాగా రావడానికి, వారికున్న అపార అనుభవంతో పలు సూచనలు ఇస్తూ ఉంటారు. ముగ్గురు (వెంకటేష్) సీనియర్ హీరోలతో కలిసి పని చేసే అవకాశం రావడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను.


‘డాకు మహారాజ్’లో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. వారిద్దరివీ మంచి ప్రాధాన్యమున్న పాత్రలు. రెగ్యులర్ హీరోయిన్ తరహా పాత్రలు కావు. నటనకు ఆస్కారమున్న పాత్రలు. ఇద్దరూ వారి పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. అలాగే రెగ్యులర్ విలన్ పాత్రలా కాకుండా బాబీ డియోల్ పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. ఆయన నిబద్ధతగల నటుడు. పాత్రకి న్యాయం చేయడం కోసం సెట్‌లో ఎంత సమయాన్ని అయినా కేటాయిస్తారు. ఎన్టీఆర్‌గారిని, బాలకృష్ణ‌గారిని ఆయన ఎంతో గౌరవిస్తారు. సంక్రాంతికి వస్తున్న ఈ సినిమాపై మా టీమ్ అంతా ఎంతో నమ్మకంగా ఉన్నాం. ప్రేక్షకులందరూ ఈ సినిమాను, సంక్రాంతికి వస్తున్న ఇతర సినిమాలను సక్సెస్ చేయాలని కోరుతూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు..’’ అని డైరెక్టర్ బాబీ చెప్పుకొచ్చారు.