డిసెంబర్ నెలలో ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద షారుక్ ఖాన్, ప్రభాస్ తమ తమ సినిమాలతో పోటీ పడనున్న విషయం తెలిసిందే. ప్రభాస్ నటిస్తున్న 'సలార్', షారుక్ 'డంకీ' రెండు సినిమాలు కేవలం ఒక్కరోజు గ్యాప్ లో థియేటర్స్ లో సందడి చేయబోతున్నాయి. ఈ రెండు సినిమాలపై ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. 'పఠాన్', 'జవాన్' బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న షారుక్ ఖాన్ తదుపరి చిత్రంగా 'డంకీ' రాబోతుండడంతో ఈ సినిమాపై అందరి దృష్టి పడింది. రాజ్ కుమార్ హిరానీతో షారుక్ చేస్తున్న సినిమా కావడంతో బాలీవుడ్ సినీ లవర్స్ ఈ మూవీ కోసం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
ఈ మూవీకి పోటీగా టాలీవుడ్ నుంచి 'సలార్' బాక్సాఫీస్ ఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే. అయితే 'సలార్' ని ఎదుర్కొనేందుకు షారుక్ టీం రంగం సిద్ధం చేస్తుంది. నిజానికి ఈ మూవీని మొదట డిసెంబర్ 22న విడుదల చేయాలనుకున్నారు. కానీ ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్ అయితే థియేటర్స్ కొరత ఏర్పడుతుంది. అందుకే సలార్ కంటే ఒక్కరోజు ముందు డిసెంబర్ 21న 'డంకి' ని విడుదల చేయబోతున్నారు. ఇదిలా ఉంటే షారుఖ్ సినిమాను సపోర్ట్ చేసేందుకు టాలీవుడ్ నుంచి దిల్ రాజు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. 'డంకి' చిత్రానికి తెలుగులో థియేటర్స్ ఇబ్బంది రాకుండా ఉండేందుకు అగ్ర నిర్మాత దిల్ రాజు సాయం తీసుకుంటున్నారట మూవీ టీం.
అంతేకాదు డంకీ నైజాం హక్కులను దిల్ రాజు భారీ ధరకు కొనుగోలు చేసుకోబోతున్నట్లు ట్రేడ్ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. ఇప్పటికే దిల్ రాజుతో షారుక్ ఖాన్ టీమ్ మాట్లాడిందని వార్తలు వినిపిస్తున్నాయి. మరోపక్క 'సలార్' మూవీని మైత్రి నిర్మాతలు పంపిణీ చేస్తున్నారు. థియేటర్స్ పరంగా సలార్ తో తలపడాలంటే దిల్ రాజు లాంటి పెద్ద డిస్ట్రిబ్యూటర్ అయితేనే బెస్ట్ అని షారుఖ్ ఖాన్ టీమ్ భావించిందట. అయితే 'డంకి' రైట్స్ అమ్ముతున్నారా? లేక కేవలం రిలీజ్ పద్ధతిలో విడుదల చేస్తున్నారా? అనేది మాత్రం ఇంకా తెలియ రాలేదు. ఏదేమైనా 'డంకీ' నైజాం రైట్స్ ని దిల్ రాజు దక్కించుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది.
ఈ విషయం తెలిసిన పలువురు సినీ విశ్లేషకులు ప్రభాస్ లాంటి డైనోసార్ ని ఎదుర్కోవాలంటే 'డంకీ' టీమ్ ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకోక తప్పదని అంటున్నారు. సలార్ విషయానికొస్తే.. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రభాస్ మాఫియా డాన్ గా కనిపించనున్నాడు. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారుడు విలన్ గా రోల్ ప్లే చేస్తున్నాడు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ సుమారు రూ.250 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తుండగా రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.
Also Read : ఓటీటీలో దూసుకెళ్తోన్న 'ఖుషి' - ఏకంగా టాప్ 10లో స్థానం