తెలంగాణ ప్రభుత్వం వర్సెస్ టాలీవుడ్ అన్నట్లు రాజకీయ విపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) పేరును అల్లు అర్జున్ మర్చిపోవడం వల్ల అరెస్టు వరకు వెళ్లిందని కేటీఆర్ వంటి నేతలు బహిరంగంగా వ్యాఖ్యానించారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట, రేవతి మృతి, అల్లు అర్జున్ అరెస్ట్... గత కొన్ని రోజులుగా జరిగిన పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దలు సమావేశం అయ్యారు.
సీఎంతో సమావేశానికి వెళ్ళిన ప్రముఖులు వీళ్లే
తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అధ్యక్షునిగా ప్రముఖ నిర్మాత దిల్ రాజును నియమించిన సంగతి తెలిసిందే. పరిశ్రమకు ప్రభుత్వానికి మధ్య వారధిగా తాను ఉంటానని ముఖ్యమంత్రి తన మీద భరోసా ఉంచారని దాన్ని నిలబెట్టుకుంటానని ఇటీవల దిల్ రాజు వ్యాఖ్యానించారు. ఆయన నేతృత్వంలోనే టాలీవుడ్ పెద్దలు ముఖ్యమంత్రిని కలిశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖుల సమావేశం పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ (సీసీసీ)లో జరిగింది. ఈ సమావేశానికి మొత్తం 36 మంది హాజరు అయినట్లు తెలిసింది. దిల్ రాజు సహా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, భోగవల్లి ప్రసాద్, సురేష్ బాబు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, సి కళ్యాణ్, 'పుష్ప' నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అధినేతలలో ఒకరైన రవిశంకర్ యలమంచిలి, సూర్యదేవర నాగవంశీ, సీనియర్ నటులు మురళీమోహన్, దర్శకులు రాఘవేంద్రరావు, త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, బోయపాటి శ్రీను, హరీష్ శంకర్, వశిష్ట మల్లిడి, హీరోలలో కింగ్ నాగార్జున తదితరులు సీఎం దగ్గరకు వెళ్లారు. సమావేశమైన వాళ్లలో 21 మంది నిర్మాతలు 13 మంది దర్శకులు నలుగురు హీరోలు ఉన్నట్లు తెలిసింది.
సీఎంతో టాలీవుడ్ భేటీలో చర్చకు వచ్చిన అంశాలు ఇవే!
టాలీవుడ్ ప్రముఖులతో బయటికి ముందు తెలంగాణ మంత్రులు అధికారులతో ముఖ్యమంత్రి సమావేశం అయ్యారని తెలిసింది. సినీ పెద్దలతో చర్చించాల్సిన విషయాలపై సమాలోచనలు చేసినట్లు సమాచారం అందుతోంది.
Also Read: బేబీ జాన్ రివ్యూ: కీర్తి సురేష్ ఫస్ట్ హిందీ సినిమా - దళపతి విజయ్ 'తెరి' బాలీవుడ్ రీమేక్ ఎలా ఉందంటే?
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత అంశం గురించి అసెంబ్లీలో మాట్లాడిన సీఎం తాను అధికారంలో ఉన్నంత వరకు బెనిఫిట్ షోలకు ఇకపై అనుమతి ఇచ్చేది లేదని స్పష్టంగా చెప్పారు. ఆ విషయంపై పునరాలోచించాల్సిందిగా రేవంత్ రెడ్డికి టాలీవుడ్ పెద్దలు విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. మరోసారి ఇటువంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని వివరించారట. దాంతో ఆ విషయం గురించి ఆలోచించి చెబుతామని సీఎం చెప్పారట. నంది అవార్డుల స్థానంలో గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ విషయం గురించి కూడా సినీ పెద్దలతో ముఖ్యమంత్రి భేటీలో చర్చకు వచ్చిందట. సమావేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డితో చర్చించిన అంశాల గురించి దిల్ రాజు వెల్లడించే అవకాశాలు ఉన్నాయి.
Also Read: బరోజ్ రివ్యూ: మోహన్ లాల్ దర్శకుడిగా మారిన సినిమా - ఎలా ఉందంటే?