తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (Telugu Film Chamber Of Commerce)కు ఆదివారం ఎన్నికలు జరుగుతున్నాయి. ఈసారి అధ్యక్ష పదవి బరిలో అగ్ర నిర్మాత 'దిల్' రాజు ఉన్నారు. ఆయనకు పోటీగా సి. కళ్యాణ్ నిలబడ్డారు. తన ప్యానల్ సభ్యులతో కలిసి శనివారం 'దిల్' రాజు మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా రాజకీయాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏ పార్టీలో చేరినా ఎంపీగా గెలుస్తా! - 'దిల్' రాజు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ... రెండు రాష్ట్రాల రాజకీయ నాయకులతో 'దిల్' రాజుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ప్రజా ప్రతినిధులతో ఆయనకు బంధుత్వాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన రాజకీయ రంగ ప్రవేశం గురించి అప్పుడప్పుడూ వార్తలు వస్తుంటాయి. తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి (TFCC) అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న నేపథ్యంలో... ప్రత్యక్ష రాజకీయాల ప్రస్తావన వచ్చింది. అప్పుడు 'దిల్' రాజు ''నేను ఏ రాజకీయ పార్టీ తరఫున నిలబడినా ఎంపీగా గెలుస్తా. అయితే, నా ప్రాధాన్యత ఎప్పటికీ సినిమా రంగానికే ఉంటుంది'' అని చెప్పారు.
సీనియర్లు ముందుకు రాకపోవడంతో బరిలోకి...
సీనియర్ నిర్మాతలు ఎవరూ ముందుకు రాకపోవడంతోనే తాను అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్లు 'దిల్' రాజు చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ''ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా నేను ఎన్నిక అయితే నాకు కిరీటం పెట్టరు. పైగా, నాకు ఇంకా సమస్యలు పెరుగుతాయి. అయితే, పరిశ్రమ అభివృద్ధి కోసం ఎన్నికల్లో పోటీ చేయక తప్పడం లేదు'' అని వివరించారు.
'దిల్' రాజు ప్యానల్ యాక్టివ్ ప్యానల్!
తమ ప్యానల్ యాక్టివ్ ప్యానల్ అని 'దిల్' రాజు తెలిపారు. చిత్రసీమలో రెగ్యులర్ గా సినిమాలు నిర్మించే వారందరూ తమ ప్యానల్ లో ఉన్నారని చెప్పారు. వాణిజ్య మండలిని బలోపేతం చేసేందుకు తాము ముందుకు వచ్చినట్లు ఆయన తెలిపారు. ఇండస్ట్రీలో కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించడానికి సరైన టీమ్ కావాలని, అందుకు తాము ముందుకు వచ్చామని చెప్పారు.
ఓటు హక్కు ఉన్న నిర్మాతలు 1560...
అయితే సినిమాలు తీసేది 200 మందే!
ఛాంబర్ ఎన్నికల్లో అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని 'దిల్' రాజు విజ్ఞప్తి చేశారు. ఓటు హక్కు ఉన్న నిర్మాతలు 1560 మంది ఉన్నారని, అందులో రెగ్యులర్ గా సినిమాలు తీసేది 200 మంది మాత్రమేనని ఆయన తెలిపారు. తాము ఎవరినీ కించపరచడం లేదని, చిత్రసీమ బలోపేతం కావాలంటే అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన తెలిపారు.
Also Read : వరుణ్ తేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో మెలోడీ!
ప్రస్తుతం 'దిల్' రాజు నిర్మాణ సంస్థల్లో సుమారు అరడజనుకు పైగా సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. రామ్ చరణ్, శంకర్ కలయికలో పాన్ ఇండియా సినిమా 'గేమ్ చేంజర్' తీస్తున్నారు. 'గీత గోవిందం' వంటి హిట్ తర్వాత విజయ్ దేవరకొండ, పరశురామ్ కలయికలో ఓ సినిమా తీస్తున్నారు. ఇటీవల నృత్య దర్శకుడు యశ్ హీరోగా 'ఆకాశం దాటి వస్తావా' ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇవి కాకుండా మరికొన్ని సినిమాలు ఉన్నాయి.
Also Read : శ్రీ లీల 'డేంజర్ పిల్ల' అంటోన్న నితిన్
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial