కోలీవుడ్ అగ్ర హీరో చియాన్ విక్రమ్ - గౌతమ్ మీనన్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం 'ధ్రువ నక్షత్రం'. 2017లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళింది. 2018 లోనే ఈ సినిమా విడుదల కావాల్సింది. కానీ ఇప్పటివరకు రిలీజ్ కు నోచుకోలేదు. కొన్ని అనివార్య కారణాలవల్ల ఈ సినిమా విడుదల ఆలస్యం అవుతూ వస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకుని సుమారు ఐదేళ్లు దాటిన ఈ సినిమా ఇప్పటివరకు విడుదల కాలేదు. ఇదివరకే ఈ సినిమాలోని ఓ పాటను రిలీజ్ చేశారు. ఆ తర్వాత సినిమా ఊసే లేదు. కానీ ఈ సినిమా కోసం విక్రమ్ ఫాన్స్ తో పాటు తమిళ ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఎట్టకేలకు  ఈ సినిమా విడుదలకు ముస్తాబవుతోంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ ని మొదలుపెట్టారు చిత్ర యూనిట్. తాజాగా ఈ సినిమా నుంచి రెండో పాటను విడుదల చేశారు.


ఇక ఈ సినిమాలో విక్రమ్ కి జోడిగా రీతు వర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఐశ్వర్య రాజేష్, సిమ్రాన్, రాధిక తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా నుంచి ఐశ్వర్య రాజేష్ కి సంబంధించిన సన్నివేశాన్ని తొలగించినట్లు తెలుస్తోంది. లేటెస్ట్ కోలీవుడ్ రిపోర్ట్స్ ప్రకారం.. ఈ సినిమా నుంచి సుమారు మూడేళ్ల క్రితం ఓ పాటను విడుదల చేయగా, ఆ పాట విక్రమ్, ఐశ్వర్యా రాజేష్ కలయికలో చిత్రీకరించబడింది. ఇక ఇప్పటికే విడుదలైన టీజర్ లో కూడా సినిమాలో నటిస్తున్న ఇతర నటీనటులతోపాటు ఐశ్వర్య రాజేష్ పేరు కూడా కనిపించింది. అయితే తాజాగా విడుదలైన రెండవ పాట 'మై నేమ్ ఈజ్ జాన్' లో ఐశ్వర్య రాజేష్ పేరు క్రెడిట్స్ లిస్టులో లేదు. దీంతో ఈ విషయం కాస్త బయటపడింది.


అయితే సినిమా నుంచి ఐశ్వర్య రాజేష్ను తొలగించడానికి అసలు కారణమేంటో తెలియకపోయినప్పటికీ స్క్రిప్ట్ నుంచి ఆమెకు సంబంధించిన పోర్షన్ ని తొలగించినట్లు చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించి ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ఇక 'ధ్రువ నక్షత్రం' నుంచి తాజాగా విడుదలైన 'మై నేమ్ ఇస్ జాన్' అనే సాంగ్ సోషల్ మీడియాలో భారీ రెస్పాన్స్ తో దూసుకుపోతోంది. హరీష్ జయరాజ్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ లో ఫోక్ బీట్స్ తో పాటు రాప్ కలిసి ఉండడంతో తమిళ్ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక ఈ పాటను కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తన ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేయడం విశేషం.


ఇక 'ధ్రువ నక్షత్రం' విషయానికొస్తే.. స్పై అండ్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ మూవీ రూపొందింది. సినిమాలో విక్రమ్ జాన్ అనే స్పై పాత్రలో కనిపించనున్నారు. అంతేకాకుండా ఇందులో నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీలో శిక్షణ పొందిన స్పై గా కనిపిస్తారట. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాని కొండడువోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ మరియు ఎస్కేప్ ఆర్టిస్ట్స్ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించగా, ఆంథోని ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. ఇక సినిమాకు సంబంధించి మేకర్స్ ఇంకా విడుదల తేదీని ఇంకా ప్రకటించాల్సి ఉంది.


Also Read : బాలీవుడ్‌లో గుర్తింపులేనివారే సౌత్ సినిమాలు చేస్తారనేవారు, ఆ హీరోలతో టచ్‌లో లేను: జెనీలియా



Join Us on Telegram: https://t.me/abpdesamofficial