బెగ్గర్ ఫ్రీ సొసైటీ కోసం... స్ఫూర్తి విజేత పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో 'ధర్మ యుగం' రూపకల్పన
బెగ్గర్, హోం లెస్ పీపుల్ కోసం పని చేస్తున్న స్వచ్ఛంద సంస్థలకు చెందిన ప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులకు 'ధర్మ యుగం' పాట ఆవిష్కరణ కార్యక్రమంలో సన్మానం చేశారు.

బెగ్గర్ ఫ్రీ సొసైటీ (భిక్షాటన రహిత ప్రపంచాన్ని సాధించడం) కోసం, ఆ విధంగా సందేశాన్ని తెలిపేలా 'ధర్మ యుగం' పేరుతో ఒక సందేశాత్మక పాటను తాజాగా హైదరాబాద్ సిటీలో స్ఫూర్తి విజేత విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. 'ధర్మ యుగం' పాటకు 'హ్యూమానిటీ బెగ్గర్ ఫ్రీ సిటీ' అనేది ఉప శీర్షిక. ఈ పాట ఆవిష్కరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి హాజరై ప్రారంభించారు.
వందేమాతరం శ్రీనివాస్ సంగీతంలో...
సామాజిక బాధ్యతను చాటుకునేందుకు 'ధర్మ యుగం' పాటను స్ఫూర్తి విజేత సంస్థల చైర్మన్ రూపొందించారని ప్రముఖ తెలుగు సంగీత దర్శకుడు, గాయకుడు వందేమాతరం శ్రీనివాస్ (Vandemataram Srinivas) తెలిపారు. ఈ పాట ద్వారా సమాజంలో అందరూ కలిస్తే బెగ్గర్ ఫ్రీ సిటీగా హైదరాబాద్‌ను మార్చవచ్చని ఆయన అన్నారు. 'ధర్మ యుగం' పాట ఆవిష్కరణ సందర్భంగా వివిధ రంగాలలో తమ తమ సామాజిక సేవ చేస్తున్న వ్యక్తుల కృషిని గుర్తిస్తూ పురస్కారాలతో సత్కరించారు.
Also Read: టెస్లా కారుకు 'మెగాస్టార్'... టెక్సాస్‌లో చిరు వీరాభిమాని డాక్టర్ ఇస్మాయిల్ పెనుకొండ రేర్ ఫీట్
ప్రస్తుతం ఉన్న కలియుగంలో ధర్మాన్ని రక్షించినప్పుడే ఆ ధర్మం మనలను రక్షిస్తుందనే సందేశంతో 'ధర్మ యుగం' పాట రూపొందిందని విజేత పూర్వ విద్యార్థులు, ఇంకా పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అన్నారు. దేశంలోని పలు నగరాల్లో వివిధ రకాల అసమానతలకు గురైన, ఆర్థిక అవసరాల కోసం అనాథలుగా మారి చిల్డ్రన్, హోం లెస్ సీనియర్ సిటిజన్స్, ట్రాఫికింగ్ ద్వారా ఎందరో మహిళలు బిక్షాటనలోకి బలవంతంగా వస్తున్నారన్నారని వక్తలు చెప్పారు.
యాచకత్వంలో మగ్గిపోయే వారిని రక్షించేందుకు ప్రభుత్వాలు, పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు పని చేస్తున్నప్పటికీ... సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందు వచ్చి తమ వంతు సాయంతో రక్షించాలని ఆకాంక్షించారు. ఈ పాట దర్శకుడు సుధీర్ వర్మ, ప్రొడ్యూసర్ బీహెచ్‌వీ రామ కృష్ణ రాజు, పాటలో నటించిన నటుడు నందకిషోర్ ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు.