'పుష్ప 2: ది రూల్' మ్యూజిక్ డైరెక్టర్స్ పంచాయతీ ఇంకా తెగినట్టు లేదు. 'పుష్ప ది రైజ్' సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతం అందించారు. అంతే కాదు... నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు. సీక్వెల్ వచ్చేసరికి ఎక్కడ మొదలైందో? ఎప్పుడు మొదలైందో? తెలియదు కానీ దేవి శ్రీ ప్రసాద్ పని తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం అయింది. ఫలితంగా మరో ఇద్దరు సంగీత దర్శకులు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయడానికి వచ్చారు.
తమన్, సామ్ సీఎస్... 'పుష్ప 2' నేపథ్య సంగీతం అందించినట్లు ఇద్దరూ కన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇప్పుడు క్వశ్చన్ అది కాదు... సినిమాకు ఇంపార్టెంట్ అయినటువంటి క్లైమాక్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎవరు చేశారు? అని...
దేవి శ్రీ క్లైమాక్స్ మ్యూజిక్ ఇరగదీశాడని చెప్పిన సుకుమార్!
'పుష్ప 2: ది రూల్' క్లైమాక్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి ప్రీ రిలీజ్ వేడుకలో చిత్ర దర్శకుడు సుకుమార్ ప్రత్యేకంగా మాట్లాడారు. దేవి శ్రీ ప్రసాద్ చాలా అద్భుతంగా చేశాడని, ఇరగదీశాడని చెప్పారు. అయితే మరో ఇద్దరు సంగీత దర్శకులు తమన్, సామ్ గురించి ఎటువంటి కామెంట్స్ చేయలేదు. వాళ్లు చేసిన వర్క్ గురించి సుకుమార్ మాట్లాడలేదు.
సుకుమార్ చెప్పిన మాటల్లో ఎటువంటి విమర్శలు లేవు. ఆయన స్పీచ్ తర్వాత ప్రేక్షకులకు సైతం ఎటువంటి సందేహాలు రాలేదు. తన మిత్రుడు దేవి శ్రీని ప్రశంసించారని ప్రేక్షకులు అనుకున్నారే తప్ప... మిగతా ఇద్దరిని విస్మరించారని అనుకోలేదు.
సామ్ చేసిన ట్వీట్... ప్రేక్షకుల్లో కొత్త డౌట్!
'పుష్ప 2' ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగిన తర్వాత తమిళ సంగీత దర్శకుడు సామ్ సోషల్ మీడియా నెట్వర్కింగ్ సైట్ 'ఎక్స్'లో ఒక ట్వీట్ చేశారు. తనకు అవకాశం ఇచ్చినందుకు నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలితో పాటు దర్శకుడు సుకుమార్, ఎడిటర్ నవీన్ నూలికి సైతం కృతజ్ఞతలు తెలిపారు.
సామ్ చేసిన ట్వీట్ చూస్తే... థాంక్స్ విషయం పక్కన పెడితే, అందులో ఒక్క విషయం మాత్రం స్పష్టంగా అందరికీ అర్థమైంది. తాను క్లైమాక్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేశానని ఆయన చెప్పారు. ఇక్కడ క్వశ్చన్ ఏమిటంటే... క్లైమాక్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేసింది దేవిశ్రీ అని స్వయంగా దర్శకుడు సుకుమార్ చెప్పారు. మరొక సంగీత దర్శకుడు తాను చేశానని చెప్పారు. దాంతో ఇప్పుడు క్లైమాక్స్ మ్యూజిక్ ఎవరు? అనే కన్ఫ్యూజన్ నెలకొంది.
Also Read: 'పుష్ప 2' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... అప్పుడు మగధీర, ఇప్పుడు పుష్ప 2 - అల్లు అరవింద్ ఏమన్నారంటే?
ఎండ్ ఆఫ్ ది డే... దర్శకుడు ఫైనలైజ్ చేయాలి కనుక, దేవి శ్రీ నేపథ్య సంగీతానికి సుకుమార్ ఓటు వేశారా? అనేది తెలియాలి. సినిమా టైటిల్ కార్డుల్లో ఎవరికి క్రెడిట్ ఇస్తారు? ఎవరు ఎవరి పేర్లు వేస్తారు? అనేది చూడాలి. సినిమా విడుదల దగ్గర పడుతున్న కొలదీ సినిమా గురించి ఏం మాట్లాడటం లేదు తమన్. సామ్ సిఎస్ మాత్రం ట్వీట్ చేశారు.
Also Read: పుష్ప 2 సెన్సార్ బోర్డు రివ్యూ... అల్లు అర్జున్ సినిమాలో హైలైట్స్ ఏంటో తెలుసా?