పురాణ ఇతిహాసాలను ఆధారంగా చేసుకుని సినిమా తీయడం అంత సులభం కాదని 'ఆదిపురుష్' సినిమా (Adipurush Movie) చుట్టూ నెలకొంటున్న విడాకులు చూసి భారతీయ చిత్రసీమలోని దర్శక, నిర్మాతలు అనుకోవచ్చు. ఎందుకంటే... రామాయణం ఆధారంగా రూపొందుతోన్న ఆ సినిమాపై కొత్త కంప్లైంట్ నమోదు అయ్యింది. మర్యాద పురుషోత్తమ శ్రీ రాముడిని సరిగా చూపించలేదని, ఆయన వేషధారణ మార్చడం ద్వారా హిందువుల మనోభావాలను కించపరిచారని ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. అసలు వివరాల్లోకి వెళితే...


ప్రభు శ్రీరామ్ పాత్రలో ప్రభాస్ (Prabhas) నటించిన సినిమా 'ఆదిపురుష్'. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సీత దేవి పాత్రలో కృతి సనన్, లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్, హనుమంతుని పాత్రలో దేవదత్తా నాగే నటించారు. శ్రీరామ నవమి సందర్భంగా సినిమా పోస్టర్ విడుదల చేశారు. ఇప్పుడు ఆ పోస్టర్ వివాదానికి కారణం అయ్యింది. 


శ్రీరామ నవమికి విడుదల చేసిన 'ఆదిపురుష్' పోస్టర్ హిందువుల మనోభావాలను దెబ్బ తీసిందని ముంబై నివాసి సంజయ్ దీనానాథ్ తివారి ఆరోపిస్తున్నారు. సకినాక పోలీస్ స్టేషనుకు న్యాయవాదులు ఆశిష్ రాయ్, పంకజ్ మిశ్రాలతో వెళ్లి కంప్లైంట్ చేశారు. 


'ఆదిపురుష్' పోస్టర్‌లో ప్రభాస్ ధరించినట్టు శ్రీరాముడు వేషధారణ ఉండదని, ఆయన సహజ స్వరూపానికి భిన్నంగా దర్శకుడు చూపిస్తున్నారని, హిందూ సంస్కృతిలో సీతా లక్ష్మణ సమేత శ్రీ రామ చిత్రపటానికి ఎంతో ప్రాముఖ్యం ఉందని, దాన్ని తప్పుగా చూపించడం ద్వారా హిందువుల మనోభావాలను గాయపరిచారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై చిత్రబృందం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. 'ఆదిపురుష్' మీద కేసులు నమోదు కావడం ఇది ఏమీ కొత్త కాదు. గతంలో టీజర్ విడుదల చేసినప్పుడు చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు కేసులు వేశారు. 


Also Read బాలీవుడ్‌లో ఎన్టీఆర్ భారీ సినిమా - హృతిక్ రోషన్ 'వార్ 2'లో!


జూన్ 16న 'ఆదిపురుష్' విడుదల
విమర్శలు, వివాదాలు పక్కన పెడితే... జూన్ 16వ తేదీ నుంచి థియేటర్లలో ఆది పురుషునిగా ప్రభాస్ సందడి మొదలు కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఆ రోజు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున చిత్రాన్ని విడుదల చేయనున్నారు. శ్రీరాముడి అంటే హిందువులలో ఉన్న భక్తి, ప్రభాస్ క్రేజ్ దృష్టిలో పెట్టుకుని భారీ సంఖ్యలో షోస్ వేయాలని ప్లాన్ చేస్తున్నారు. అదీ సంగతి!
టీ సిరీస్ భూషణ్ కుమార్ అండ్ కృష్ణన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రెట్రోఫిల్స్ రాజేష్ నాయర్ (Rajesh Nair)తో కలిసి యూవీ క్రియేషన్స్ సంస్థ సినిమాను విడుదల చేస్తోంది.


రికార్డు స్థాయిలో రిలీజుకు సన్నాహాలు!?
వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో షోలు వేసేలా 'ఆదిపురుష్' టీమ్ ప్లాన్ చేసిందట. ఇండియా మొత్తం మీద ఎనిమిది వేల థియేటర్లలో సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట. రోజుకు సుమారు 35,000 కంటే ఎక్కువ షోస్ పడే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ ఇన్‌సైడ్‌ టాక్. అయితే, వివాదాల నేపథ్యంలో విడుదల నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. 


Also Read : పుష్ప ఎక్కడ? జైలు నుంచి ఎలా వచ్చాడు? అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చిన వీడియో