కమెడియన్ హ‌ర్ష చెముడు (వైవా హర్ష) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘సుందరం మాస్టర్’ (Sundaram Master Movie ). మాస్ మహారాజ్ రవితేజ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కళ్యాణ్ సంతోష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో తెలుగమ్మాయి దివ్య శ్రీపాద ఫిమేల్ లీడ్. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడమే కాదు, సినిమాపై ఆసక్తిని కలిగించింది. ఈ నేపథ్యంలో ఈరోజు మంగళవారం విశాఖపట్నంలో గ్రాండ్ గా నిర్వహించిన ఈవెంట్ లో టీజర్ ను లాంచ్ చేశారు. సుందరం అనే టీచర్ చుట్టూ నడిచిన ఈ టీజర్ ఆద్యంతం ఎంటర్‌టైనింగ్ గా సాగింది.


టీజర్ లోకి వెళ్తే, ఇంగ్లీష్ పాఠాలు బోధించడానికి అటవీ ప్రాంతంలో గిరిజనులు జీవించే ఒక మారుమూల పల్లెటూరికి వెళ్తాడు సుందరం మాస్టర్. అక్కడ అన్ని వ‌య‌సుల‌ వారికి తరగతులు ఏర్పాటు చేసి, తన శైలిలో ఇంగ్లీష్ నేర్పించడానికి ట్రై చేస్తాడు. అయితే పాఠాలు చెప్పడానికి వచ్చిన సుందరానికి పెద్ద షాక్ తగులుతుంది. అక్కడి ట్రైబల్స్ అందరూ తన కంటే కంటే ఇంగ్లీష్ బాగా మాటాడుతుండటంతో మాస్టర్ బిత్తరపోతాడు. ఈ క్రమంలో ట్రైబల్స్ కి సుందరానికి మధ్య వచ్చే సన్నివేశాలు నవ్వు తెప్పిస్తాయి. 


చివర్లో హర్ష కట్టెల మోపు తెచ్చి సిగరెట్ వెలిగించుకోడానికి నిప్పుందా అని ఒక పెద్దాయన్ని అడగ్గా.. ఆయన ఇంగ్లీష్ లో బూతులు తిట్టడం నవ్విస్తుంది. ఓవరాల్ గా కామెడీ ప్రధానంగా సాగే ఈ టీజర్ ఆకట్టుకుంటుందనే చెప్పాలి. అయితే అసలు ఆ గూడెంలో ఏం జరుగుతోంది? వాళ్ళందరూ ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతున్నారు? సుందరం మాస్టర్ అక్కడి నుంచి ఎలా బయటపడ్డాడు? మధ్యలో అతని లవ్ స్టోరీ ఏమైంది? అనేది తెలియాలంటే ‘సుందరం మాస్టర్’ రిలీజ్ అయ్యే వరకూ ఆగాల్సిందే. 



Also Read: మాస్ మహారాజా తగ్గేదేలే, మోస్ట్ బిజీయెస్ట్ హీరోగా రవితేజ - చేతిలో ఎన్ని సినిమాలున్నాయో తెలుసా?


ఇన్నాళ్లూ కమెడియన్ గా అందరినీ నవ్వించిన హర్ష.. ఈసారి లీడ్ రోల్ లో అలరించడానికి రెడీ అయ్యాడు. ఎప్పటిలాగే అతని గెటప్, హావభావాలతో నవ్వించాడు. అతను పుల్లల ద్వారా ట్రైబల్స్ కి ఏబీసీడీలు నేర్పించే విధానం నవ్వు తెప్పిస్తుంది. సుందరం మాస్టర్ ని ఇష్టపడే గిరిజన యువతిగా డీ గ్లామర్ లుక్ లో దివ్య శ్రీపాద ఆకట్టుకుంది. హర్ష, దివ్య మినహా ఈ టీజర్ లో తెలిసిన ముఖాలేవీ కనిపించలేదు. అయినప్పటికీ వారితోనే దర్శకుడు కావాల్సినంత ఫన్ ని జెనెరేట్ చేసినట్లు తెలుస్తుంది. 


'సుందరం మాస్టర్' చిత్రాన్ని ఆర్‌.టి.టీమ్ వ‌ర్క్స్‌, గోల్డెన్ మీడియా బ్యాన‌ర్స్‌పై ర‌వితేజ‌, సుధీర్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల ఈ సినిమాకి సంగీతం సమకూర్చగా, దీపక్ ఎంటాల సినిమాటోగ్రఫీ నిర్వహించారు. టీజర్ లో బీజీఎం కామెడీ ఎంటర్టైనర్లకు తగ్గట్టుగా ఉండగా, అటవీ ప్రాంతంలో విజువల్స్ కూడా బాగున్నాయి. ఉన్నవ కార్తీక్ ఈ చిత్రానికి ఎడిటింగ్ చేయగా, చంద్రమౌళి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో వైవిద్యమైన కంటెంట్ తో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు అందుకున్నాయి. మరి హర్షతో రవితేజ చేస్తున్న ఈ చిత్రం ఎలాంటి సక్సెస్ సాధిస్తుందో చూడాలి.


ఇదిలా ఉంటే వైజాగ్ లో జరిగిన 'సుందరం మాస్టర్' టీజర్ లాంచ్ ఈవెంట్ కి సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. అలానే దర్శకులు చందు ముండేటి, సుధీర్ వర్మ, సందీప్ రాజ్, శరణ్ కొప్పిశెట్టి తదితరులు అథిలుగా హాజరై, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేసారు. 


Also Read: తెలుగు వద్దు, తమిళం ముద్దు - టాలీవుడ్‌లో కోలీవుడ్ సంగీత దర్శకుల హవా, ఈ మూవీలకు తంబీలదే మ్యూజిక్కు!



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial