ఒక సినిమా విజయానికి పాటలు ఎంత దోహదం చేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ చిత్రమైనా ముందుగా జనాల్లోకి వెళ్ళేది సాంగ్స్ ద్వారానే. అందుకే ఫిలిం మేకర్స్ అంతా పాటల విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటుంటారు.. మ్యూజిక్ డైరెక్టర్స్ నుంచి ఎప్పటికప్పుడు ఫ్రెష్ ట్యూన్స్ రాబట్టగలగడం కోసం ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఇటీవల కాలంలో టాలీవుడ్ లో పర భాషా సంగీత దర్శకుల హవా ఎక్కువగా కనిపిస్తోంది. ఫ్రెష్ నెస్ కోసమో, క్రేజ్ కోసమో లేదా తెలుగోళ్ళు బిజీగా ఉండటం వల్లనో తెలియదు కానీ.. మన దర్శక నిర్మాతలందరూ ఇప్పుడు తమిళ మ్యూజిక్ డైరెక్టర్స్ వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏఆర్ రెహమాన్ నుంచి అనిరుధ్ వరకూ చేతినిండా తెలుగు సినిమాలతో బిజీగా గడుపుతున్నారు.
అనిరుధ్ రవిచంద్రన్:
కోలీవుడ్ మోస్ట్ డిమాండబుల్ మ్యూజిక్ కంపోజర్ అనిరుధ్ ప్రస్తుతం తెలుగులో 'దేవర' సినిమాకి సంగీతం సమకూరుస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అలానే యువ హీరో విజయ్ దేవరకొండ - డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో రూపొందే #VD12 చిత్రానికి కూడా మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. అక్కినేని నాగచైతన్య - చందు మొండేటి కాంబోలో రాబోయే సినిమా కోసం అనిరుధ్ నే పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఏఆర్ రెహమాన్:
ఆస్కార్ గ్రహీత రెహ్మాన్ చాలా గ్యాప్ తర్వాత తెలుగు సినిమాకు వర్క్ చేయనున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో తెరకెక్కనున్న #RC16 చిత్రానికి సంగీతం సమకూర్చనున్నట్లు తాజాా నివేదికలు సూచిస్తున్నాయి. అలానే నాగచైతన్య - చందు మొండేటి మూవీకి అనిరుధ్ కుదరకపోతే, రెహమాన్ వద్దకు వెళ్లాలని మేకర్స్ భావిస్తున్నారని టాక్ నడుస్తోంది.
జివి ప్రకాష్:
రెహమాన్ మేనల్లుడు జీవీ ప్రకాశ్ కుమార్.. తెలుగులో పలు క్రేజీ ప్రాజెక్ట్స్ కు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న 'టైగర్ నాగేశ్వరరావు' చిత్రంతో పాటుగా మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ 'ఆదికేశవ' సినిమాకి సంగీతం సమకూరుస్తున్నారు. అలానే యూత్ స్టార్ నితిన్ - వెంకీ కుడుముల సినిమాకి, మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ - వెంకీ అట్లూరి చిత్రానికి కూడా జీవీనే మ్యూజిక్ డైరెక్టర్.
సంతోష్ నారాయణ్:
దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న సంతోష్ నారాయణ్.. ఇప్పుడు 'ప్రాజెక్ట్ K' వంటి పాన్ వరల్డ్ మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. ఇక విక్టరీ వెంకటేష్ - శైలేష్ కొలను కాంబోలో వస్తున్న 'సైంధవ్' సినిమాకి వర్క్ చేస్తున్నారు. లేటెస్టుగా మహి వి రాఘవ్ రూపొందించే 'యాత్ర-2' చిత్రానికి కూడా ఆయనే సంగీత దర్శకుడు.
హారిస్ జయరాజ్ & యువన్ శంకర్ రాజా:
'స్పైడర్' సినిమా తర్వాత టాలీవుడ్ లో కనిపించిన హారిస్.. ఇప్పుడు రెండు తెలుగు చిత్రాలకు పని చేస్తున్నారు. నితిన్ - వక్కంతం వంశీ సినిమాతో పాటుగా, నాగశౌర్య 24వ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. మరోవైపు లిటిల్ మ్యాస్ట్రో యువన్ శంకర్ రాజా ప్రస్తుతం విశ్వక్ సేన్ - కృష్ణ చైతన్యల సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు.
ఇలా కోలీవుడ్ స్టార్ కంపోజర్స్ అందరూ ఇప్పుడు తెలుగు సినిమాలకు పని చేస్తున్నారు. సంగీతానికి భాషతో సంబంధం లేదు కాబట్టి, ఎవరిని తీసుకున్నా సినిమాకి మంచి మ్యూజిక్ ఇవ్వాలనే కోరుకుంటారు. కాకపొతే ఇప్పటి వరకూ మనం చెప్పుకున్న సంగీత దర్శకులకు టాలీవుడ్ లో సక్సెస్ రేట్ చాలా తక్కువగా వుంది. తమిళ్ లో ఎలా ఉన్నా, తెలుగులో వీళ్ళు వర్క్ చేసిన సినిమాలు చాలా వరకూ ఫ్లాప్ అయ్యాయి. మరి రాబోయే చిత్రాలకు తమ ట్రాక్ రికార్డును మార్చుకుంటారేమో చూడాలి.
Also Read: మాస్ మహారాజా తగ్గేదేలే, మోస్ట్ బిజీయెస్ట్ హీరోగా రవితేజ - చేతిలో ఎన్ని సినిమాలున్నాయో తెలుసా?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial