అభిమానులు ఎంతో మందికి మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) డేమీ గాడ్. కొంత మందికి అన్నయ్య. ఇంకొంత మందికి తమ సొంత కుటుంబ సభ్యులలో ఒకరు. అటువంటి చిరు కష్టపడితే... తట్టుకోలేని అభిమానులు చాలా మంది ఉన్నారు. వారందరికీ ఆదివారం ఓ షాక్ తగిలింది. స్టేజ్ మీదకి చిరు అతి కష్టం మీద నడవడం చూసి అభిమానుల మనసు విలవిల్లాడింది. అయ్యో మెగాస్టార్ ఆరోగ్యానికి ఏమైంది? అని ఆరాలు తీయడం మొదలైంది. అసలు విషయం ఏమిటంటే...
చిరంజీవికి చికెన్ గున్యా... అది 25 రోజులుగా!
అభిమానుల గుండెల్లో అన్నయ్యగా కొలువు దీరిన మెగాస్టార్ చిరంజీవి సుమారు పాతిక రోజులగా చికెన్ గున్యాతో ఇబ్బంది పడుతున్నారు. అయితే ఆ విషయం బయటకు రాలేదు. గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో ఆయన పేరు చేరిన సందర్భంగా ఆదివారం హైదరాబాద్ ఐటిసి కోహినూర్ హోటల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. అక్కడ స్టేజ్ మీదకు వెళ్లడానికి చిరు ఇబ్బంది పడ్డారు.
మేనల్లుడు సాయి దుర్గా తేజ్, బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమీర్ ఖాన్ సాయంతో మెట్లు ఎక్కారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ తరువాత స్టేజ్ పై యాంకర్ చిరు చికెన్ గున్యాతో ఇబ్బంది పడుతున్న విషయాన్ని తెలియజేశారు. ఆరోగ్యపరంగా ఎంత కష్టం ఉన్నప్పటికీ... గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో తన పేరు చేరిన విషయాన్ని వెల్లడించే సమావేశం కనుక ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చారు.
చిరంజీవి డాన్సులకు, నటనకు రికార్డుల్లో చోటు దక్కింది. ఇప్పటి వరకు 156 సినిమాలలో 537 పాటల్లో దాదాపు 24 వేల డాన్స్ మూమెంట్స్ చేశారు చిరంజీవి. ఈ స్థాయిలో డాన్స్ చేసిన హీరో ప్రపంచంలో మరొకరు లేరు. అందుకని అవార్డు వచ్చింది. చిరు లక్ష్యం ఒకటే... ప్రేక్షకులను ఎప్పటికీ అలరించడం! గతంలోనూ ఆయన ఆరోగ్యం బాలేనప్పటికీ చిత్రీకరణ చేసిన రోజులు ఎన్నో ఉన్నాయి. 'ఠాగూర్' సినిమాలో మన్మధ మన్మధ మామ పుత్రుడా సాంగ్ చిత్రీకరణకు కొన్ని రోజుల ముందు ఒక యాక్షన్ సీక్వెన్స్ తీసేటప్పుడు కాలికి గాయమైంది. అయినా సరే తన వల్ల షూటింగ్ క్యాన్సిల్ కాకూడదని మోకాలికి రక్తం వచ్చిన వయొలిన్ స్టెప్పు వేశారు. దటీజ్ చిరంజీవి. ఇప్పుడు మరోసారి ఆయన డెడికేషన్ గురించి ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు.
Also Read: ఆస్కార్స్‌కు 'లాపతా లేడీస్' - ప్రభాస్ 'కల్కి', 'యానిమల్'ను కాదని మరీ... అందులో ఏముందో తెలుసా?
వశిష్ట దర్శకత్వంలో 'విశ్వంభర'
Chiranjeevi Upcoming Movies: ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి భారీ ఫాంటసీ యాక్షన్ ఫిలిం 'విశ్వంభర' చేస్తున్నారు. ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ 'బింబిసార' తీసిన వశిష్ట మల్లిడి దర్శకుడు. చికెన్ గున్యా రావడానికి ముందు కొన్ని రోజుల పాటు చిత్రీకరణ చేశారు. చిరు ఆరోగ్యం బాలేదని కారణంగా ప్రస్తుతానికి విరామం ఇచ్చారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.