చిరంజీవి టాలీవుడ్ మెగాస్టార్. రాత్రికి రాత్రి సూపర్ స్టార్ అయిన హీరో కాదు. కింది స్థాయి నుంచి ఎదిగిన హీరో. తెలుగు సినిమాల్లో ఎన్టీఆర్ తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతులు, ఫ్యాన్ బేస్ ఆయన సొంతం. అలాంటి హీరో పట్ల ప్యాన్స్‌కు.. యాంటీ ఫ్యాన్స్‌కు కూడా ఓ అంచనా ఉంటుంది. ఓ ఇమేజ్ ఉంటుంది. ఆయన చేసే ప్రతీ పనిలోనూ హీరోయిజం చూస్తారు. కానీ ఆయన చేసిన ఓ పని మాత్రం ఇప్పుడు సగం మంది ఫ్యాన్స్‌కు కూడా నచ్చడం లేదు. సగం మంది అయిష్టతతో తమ హీరో ఇండస్ట్రీ కోసం తగ్గారని వాదిస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా అంతా చిరంజీవి చేసిన "ఆ" పని గురించే..!
జగన్‌ను బతిమాలుకున్న చిరంజీవి !
" ఇండస్ట్రీ వైపు చల్లని చూపు చూడండి , మిమ్మల్ని చేతులు జోడించి అడుగుతున్నాను " అంటూ చిరంజీవి సీఎం జగన్‌ను బతిమాలుకుంటున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమా పరిశ్రమకు జీవో నెం.35 వల్ల వచ్చిన కష్టాలను తీర్చాలని ప్రభాస్, మహేష్‌బాబులతో పాటు మరికొంతమందితో కలిసి చిరంజీవి సీఎం జగన్‌తో సమావేశమయ్యారు. ఆ బృందానికి నాయకుడిగా మాట్లాడిన చిరంజీవి .. సీఎం జగన్‌ను బతిమాలుకున్నారు.
వీడియో విడుదల చేసిన ప్రభుత్వం !
సినీ ప్రముఖులతో ముఖ్యమంత్రి సమావేశం ముగిసిన తర్వాత ఏపీ ప్రభుత్వ మీడియా విభాగం వీడియోలు విడుదల చేసింది. ఆ వీడియోల్లో సినీ పరిశ్రమ సమస్యలు పరిష్కరించాలంటూ చిరంజీవి వేడుకుంటున్న దృశ్యాలు కూడా ఉన్నాయి. సినీ పరిశ్రమ మెగాస్టార్ వచ్చి అలా ముఖ్యమంత్రిని వేడుకోవడం ముఖ్యమంమత్రికైనా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇలాంటి వీడియోలను పబ్లిక్ చేయరు. కానీ అనూహ్యంగా బయటకు వచ్చింది. దీంతో సహజంగానే వైరల్ అయిపోయింది.
బెగ్గింగ్ అన్న ఆర్జీవీ - జగన్‌ను మహాబలిగా ప్రశంసలు !
ఈ అంశంపై స్పందించిన రామ్ గోపాల్ వర్మ సెటైర్లు వేశారు. బాహుబలి రేంజ్ బెగ్గింగ్ అని... అందరి కంటే మహాబలి జగన్ అని నిరూపించుకున్నారని ట్వీట్ చేశారు.
ఎక్కడ తగ్గాలో తెలిసిన చిరంజీవి అని కొంత మంది ఫ్యాన్స్ సమర్థన !
సినిమా టిక్కెట్ రేట్ల తగ్గింపు వల్ల.. బెనిఫిట్ షోలు వేసే అనుమతి ఇవ్వకపోవడం వల్ల చిరంజీవికి జరిగే నష్టం స్వల్పం. చాలా స్వల్పం. అంత నష్టానికే ఆయన అంతగా తగ్గి చేతులు జోడించి వేడుకోవాల్సిన అవసరం లేదు. కానీ చిరంజీవి తన గురించి ఆలోచించలేదvf తనను మెగాస్టార్ చేసిన ఇండస్ట్రీ భవిష్యత్ గురించే ఆలోచించారని కొంత మంది ఫ్యాన్స్ చెబుతున్నారు. చిరంజీవి తన కోసం కాదు తన చుట్టూ ఉన్న వారి కోసం తనను తాను తగ్గించుకోవడానికి వెనుకాడరన్న విషయం వెల్లడయిందని ఆయన అభిమానులు సోషల్ మీడియాలో అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం జగన్‌పై విమర్శలు చేస్తున్న మరికొంత మంది అభిమానులు !
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన ఈగోను శాటిస్‌ఫై చేసుకోవడానికి ఇలా చేస్తున్నారని మరికొంత మంది చిరంజీవి అభిమనులు సోషల్ మీడియాలో మండి పడుతున్నారు. ఎంతో మంది ముఖ్యమంత్రులు చివరికి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో సహా ఎంతో గౌరవం ఇచ్చారని కానీ జగన్ మాత్రం మాటలతో అన్నా అని పిలుస్తూ చేతలతో మాత్రం దారుణంగా అవమానిస్తున్నారని మండిపడుతున్నారు. పోటీగా సీఎం జగన్‌పై సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు దిగుతున్నారు.
ఏదైనా కానీ టాలీవుడ్ ప్రముఖుల భేటీలో ఏం నిర్ణయాలు తీసుకున్నారో.. ఎలాంటి జీవోలు వస్తాయో కానీ చిరంజీవి చేసిన ఆ "బతిమాలుడు విజ్ఞప్తి" మాత్రం టాక్ ఆఫ్ ది మీట్ అయింది. ఎవరి కోణంలో వారు దీన్ని విశ్లేషించుకుటున్నారు.