నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరించిన 'అన్ స్టాపబుల్' షో ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'ఆహా' యాప్ లో ప్రసారమైన ఈ షోకి టాలీవుడ్ స్టార్స్ గెస్ట్ లుగా వచ్చి అలరించారు. ఈ షోలో ప్రతి ఒక్క ఎపిసోడ్ సూపర్ హిట్ గా నిలిచింది. ఈ షో ఏకంగా 40 కోట్ల స్ట్రీమింగ్ నిమిషాలను సొంతం చేసుకున్నట్లు నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. మహేష్ ఎపిసోడ్ తో ఫస్ట్ సీజన్ పూర్తవగా.. త్వరలోనే సెకండ్ సీజన్ ను మొదలుపెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు.
జూలై నెల నుంచి కొత్త సీజన్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇదిలా ఉండగా.. బాలయ్యతో 'ఆహా' టీమ్ ఓ ఫన్ రైడ్ ను చిత్రీకరించింది. రాపిడ్ ఫైర్ మాదిరి బాలయ్యను కొన్ని ప్రశ్నలు అడగ్గా.. వాటికి ఫన్నీ సమాధానాలు చెప్పారాయన. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు ట్రెండింగ్ అవుతోంది. బాలయ్యకి సంబంధించిన మీమ్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంటాయి.
ఆయన డైలాగ్స్, డాన్స్, ఎక్స్ ప్రెషన్స్ పై మీమ్స్ చేస్తుంటారు. ఈ మీమ్స్ పై ఎలా రియాక్ట్ అవుతారని బాలయ్యను ప్రశ్నించగా.. తనపై వచ్చే మీమ్స్ చూసి నవ్వుకుంటానని.. కరోనా వచ్చిన సమయంలో 'లెజెండ్' సినిమాలోని డైలాగ్‌తో చేసిన మీమ్స్ చూసినప్పుడు నవ్వుకున్నానని అన్నారు. అలానే 'జై బాలయ్య' సాంగ్ ను ఇమిటేట్ చేయడానికి చాలా మంది పడిన తిప్పలు చూస్తే నవ్వొచ్చిందని చెప్పుకొచ్చారు.
'ఎప్పుడైనా కాలేజ్ బంక్ కొట్టారా..?' అనే ప్రశ్నకు.. 'బంక్ కొట్టకుండా ఎవరైనా ఉంటారా చెప్పండి' అంటూ సరదాగా అన్నారు బాలయ్య. 'డాన్స్ విషయంలో హీరోయిన్లకు ఎప్పుడైనా సజెషన్స్ ఇచ్చారా..?' అని అడగ్గా.. కొరియోగ్రాఫర్ చెప్పినట్లు వింటామని.. కానీ హీరోయిన్లు ఒక్కోసారి ఓవర్ గా ప్రాక్టీస్ చేస్తుంటారని.. వాళ్లను కూర్చోబెట్టి టెన్షన్ పడకుండా సింపుల్ గా డాన్స్ మూమెంట్ చేయమని చెబుతుంటానని అన్నారు.
'ఎప్పుడైనా సెట్స్ కి లేట్ గా వెళ్లారా..?' అని ప్రశ్నించగా.. 'నెవర్' అని చెప్పారు. 'పబ్లిక్ లోకి వెళ్లాలంటే ఏం ఆలోచించకుండా వెళ్లిపోగలరా..?' అనే ప్రశ్నకు.. వెళ్తానని, తనలా పబ్లిక్ తో కలిసే ఆర్టిస్ట్, హీరోలు లేరని చెప్పారు. ఇక తన మనవళ్లు ఎప్పటికీ 'బాల' అనే పిలవాలని.. తాత అని పిలిపించుకోవడం నచ్చదని అన్నారు.
ఇక ఆయన సినిమాల విషయానికొస్తే.. ఇటీవల 'అఖండ' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న బాలయ్య ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు. ఫిబ్రవరి 16 నుంచి తెలంగాణ రాష్ట్రంలో సిరిసిల్ల జిల్లాలో ఈ సినిమా షూటింగ్ ను నిర్వహించారు. వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి దసరా కానుకగా విడుదల చేయాలనుకుంటున్నారు. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకపాత్ర పోషిస్తుంది.