చిరంజీవి ఆపద్బాంధవుడు... ఆయన చేసే దానాలు, చూపించే మానవత్వం గురించి మనకు తెలిసింది, బయటకు వచ్చింది కొంతే. ఎవరికీ తెలియని గుప్త సహాయాలు చాలానే ఉంటాయని మొన్నీ మధ్య చిరంజీవి పుట్టిన రోజు నాడు తమ్ముడు, జనసేనాని పవన్‌ కల్యాణ్‌ రాసిన లేఖలో పేర్కొన్నారు. ఆయన చెప్పినట్లుగానే చిరంజీవి చాలా సహాయాలు చేశారు. అందులో ఒకటి... ఇప్పుడు బయటకు వచ్చింది. సీనియర్‌ జర్నలిస్ట్‌కు అనారోగ్యం వస్తే చిరంజీవి పెద్ద మనసుతో చేసిన సాయం గురించి తెలిసింది. 


సీనియర్‌ సినిమా జర్నలిస్టు సుబ్బారావు నాగబీరు ఇటీవల అనారోగ్యం పాలయ్యారు. కుటుంబ సభ్యులు ఆయన్ను కొండాపూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు ద్వారా వైద్యం ప్రారంభించారు. అయితే వైద్యం జరుగుతున్న సమయంలో ఆయనకు డయాబెటిస్‌ ఉందనే విషయం బయటపడింది. మూడు నెలల క్రితం తనకు మధుమేహం వచ్చందని సుబ్బరావు చెప్పడంతో... ఆ ఆసుపత్రి వైద్యులు దానికి సంబంధించిన డాక్యుమెంట్లు తెప్పించమన్నారు. అవన్నీ పరిశీలించిన హెల్త్‌ ఇన్సూరెన్స్‌ టీమ్‌ క్లెయిమ్‌ను తిరస్కరించింది. 


డయాబెటిస్‌ ఉందనే కారణంగా ఆ క్లెయిమ్‌ను తిరస్కరించినట్లు టీమ్‌ తెలిపింది. తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఇన్సూరెన్స్‌ సంస్థ అధికారులతో మాట్లాడినా క్లెయిమ్‌ తిరస్కరించారు. ఆ సమయంలో ఏం చేయాలో తెలియక సినిమా మీడియాలో ఉన్న స్నేహితులతో సుబ్బారావు మాట్లాడారు. వాళ్లు సాయం చేయడానికి ముందుకు వచ్చారు కూడా. అయితే మెగాస్టార్‌ చిరంజీవితో సుబ్బారావుకు ఉన్న పరిచయంతో కారణంగా... ఆయనకు ఓ మెసేజ్‌ చేశారు. అందులో తన పరిస్థితిని చెప్పే ప్రయత్నం చేశారు. ఆ మెసేజ్‌ పంపిన గంటలోనే సుబ్బారావుకు చిరంజీవి నుండి ఫోన్‌ వచ్చింది. 


''ఏమైంది సుబ్బారావు... అసలు ఆ విషయాలన్నీ నువ్వు వదిలేశాయ్‌. నీ దగ్గరకు ఓ మనిషిని పంపిస్తున్నా. నువ్వు డిశ్చార్చి అయి ఇంటికి వెళ్లిపో. నేను అన్నీ చూసుకుంటాను'' అని చిరంజీవి చెప్పారు. ఆ వెంటనే సుబ్బారావు డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లిపోయారు. ఆ విషయాలను మీడియా సమావేశం పెట్టి వివరించారు. అలా చిరంజీవి చేసిన సాయం గురించి అందరికీ తెలిసింది. రెండు లక్షల రూపాయలకు పైగా అయిన హాస్పటల్ బిల్ మొత్తం చిరంజీవి పే చేశారని తెలిసింది.


Also Read: ప్రభాస్ బెస్ట్ అని అర్షద్ వార్సీ ఫస్ట్ డే ట్వీట్ చేసేలా 'కల్కి 2' తీస్తా... జోకర్ కాంట్రవర్సీపై నాగ్ అశ్విన్ రియాక్షన్



పుట్టిన రోజు వేడుకలు, తిరుమల ప్రయాణం... ఇలా బిజీ బిజీగా ఉన్నా... చిరంజీవి తన మెసేజ్‌కు వెంటనే స్పందించడం, సాయం చేయడం చాలా గ్రేట్‌ అని సుబ్బారావు చెప్పుకొచ్చారు. తన మెసేజ్‌కు ఇంత త్వరగా స్పందించడం చూస్తే... మన మనుషులు అని ఆయన అనుకుంటే ఎంత కేర్‌ తీసుకుంటారు అనేది తనకు జరిగిన విషయం చూస్తే తెలుస్తుంది అని సుబ్బారావు భావోద్వేగంతో చెప్పారు. ఆయన మంచితనానికి హ్యాట్సాఫ్‌ అంటూ తన కృతజ్ఞతను తెలిపారు సుబ్బారావు. నేటి పరిస్థితుల్లో సింగిల్‌ మెసేజ్‌ చిరంజీవి స్పందించడం ఆయన గొప్పతనానికి నిదర్శనమని సుబ్బారావు చెప్పుకొచ్చారు. 'చిరంజీవి మంచి మనసుకు ఇదిగో మరో సాక్ష్యం' అంటూ అభిమానులు, నెటిజన్లు సోషల్‌ మీడియాలో సుబ్బారావు మాటలను షేర్‌ చేస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి 'విశ్వంభర' సినిమా చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న ఆ సినిమా విడుదల కానుంది.


Also Readవిడుదలకు ముందే శాటిలైట్ డీల్ క్లోజ్... మారుతి నగర్ సుబ్రమణ్యం ఏ టీవీలో వస్తుందంటే?