Srija EX Husband: చిరంజీవి మాజీ అల్లుడు, శ్రీజ మొదటి భర్త (మాజీ) శిరీష్ భరద్వాజ తుదిశ్వాస విడిచాడు. గత కొంత కాలంగా ఆయన ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. కొద్ది రోజులుగా హాస్పిటల్ లో చేరి చికిత్స తీసుకున్నాడు. ప్రత్యేక వైద్యుల బృందం ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తోంది. అయినప్పటికీ ఆయన పరిస్థితి విషమించడంలో చనిపోయాడు. ఊపిరితిత్తుల సమస్యకు తోడుగా గుండెపోటు రావడంతో చనిపోయినట్లు తెలుస్తోంది. చిన్న వయసులోనే శిరీష్ చనిపోవడం పట్ల ఆయన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.


శిరీష్ మృతి పట్ల శ్రీరెడ్డి షాకింగ్ కామెంట్స్


శ్రీజ మాజీ భర్త చనిపోవడం పట్ల నటి శ్రీరెడ్డి స్పందించింది. ఆయన మృతిని కన్ఫామ్ చేస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది. “శిరీష్ భరద్వాజ్(చిరంజీవి మాజీ అల్లుడు) ఇక లేరు. ఇప్పటికైనా నీకు మనశ్శాంతి దొరికిందిరా శిరీష్. అందరూ కలిసి నిన్ను మోసం చేశారు” అని రాసుకొచ్చింది. శిరీష్ ఫ్రెండ్స్ కూడా ఆయన మృతిని ధృవీకరించారు. లంగ్స్ సమస్యకు గుండెపోటు తోడు కావడంతో చనిపోయినట్లు తెలిపారు. త్వరలోనే శిరీష్ మృతికి సంబంధించి అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.     


శ్రీజతో పెళ్లి.. ఆ తర్వాత విడాకులు..


శిరీష్, శ్రీజ ప్రేమ వివాహం అప్పట్లో ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. చిరంజీవి స్టార్ హీరోగా సత్తా చాటుతున్న సమయంలోనే శ్రీజ ఇంట్లో నుంచి వెళ్లిపోయి శిరీష్ ను ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకుంది. అప్పట్లో కొన్ని వార్తా సంస్థలు శ్రీజ, శిరీష్ ను రోజంతా వ్యాన్ లో కూర్చోబెట్టుకుని తిప్పుడూ ఇంటర్వ్యూలు ప్రసారం చేయడం సంచలనం కలిగించింది. కొంత కాలం పాటు ఇద్దరు సంసార జీవితాన్ని హ్యాపీగా గడిపారు. ఓ పాప కూడా జన్మించింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్దలు వచ్చాయి. 2012లో శిరీష్ మీద శ్రీజ కేసు పెట్టింది. తనను వేధిస్తున్నాడంటూ గృహహింస కేసు ఫైల్ చేసింది. రెండేళ్ల తర్వాత శ్రీజ, శిరీష్ విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత పాప శ్రీజ దగ్గరే ఉంటుంది.


విడాకుల తర్వాత మళ్లీ పెళ్లి


శ్రీజతో విడాకులు తీసుకున్న తర్వాత శిరీష్ మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. శ్రీజ కూడా కల్యాణ్ దేవ్‌ను పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంది. వీరిద్దరికి మరో పాప పుట్టింది. శ్రీజ రెండో భర్త కొన్ని సినిమాల్లోనూ నటించాడు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య గొడవలు అయ్యాయి. ప్రస్తుతం శ్రీజ, కల్యాణ్ వేర్వేరుగానే ఉంటున్నారు. తన పాపను కూడా చూడనివ్వడం లేదంటూ కల్యాణ్ దేవ్ పలుమార్లు సోషల్ మీడియా వేదికగా తన బాధను వెల్లగక్కాడు. ఈ విషయంపై శిరీష్ కూడా స్పందించాడు. శ్రీజ ఎవరితోనూ కలిసి ఉండలేదంటూ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ నడుపుతున్న శిరీష్.. అనారోగ్యంతో చనిపోవడం పట్ల సర్వత్రా ఆవేదన వ్యక్తం అవుతోంది. చిన్న వయసులోనే కన్నుమూయడం బాధాకరం అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు.


Read Also: సోనాక్షి పెళ్లిపై శత్రుఘ్న సిన్హా మనస్తాపం- పెళ్లికొడుకు తండ్రి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!