అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమగాథ, పడి పడి లేచే మనసు సహా పలు ప్రేమకథా చిత్రాలను అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు హను రాఘవపూడి. ఆయన తీసిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు భారీగా సాధించకపోయినా.. కథను చూపించే విధానం సినీ విమర్శకులను సైతం ఆకట్టుకుంది. తాజాగా ఆయన దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకుర్ నటించిన సినిమా ‘సీతారామం’. ఇప్పటికే ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకుర్ నటనకు ఫిదా అవుతున్నారు. ఈ చిత్రం మంచి వసూళ్లు సాధించడంతో పాటు పలువురు ప్రముఖల నుంచి మంచి ప్రశంసలు దక్కించుకుంది.  ప్రతీ ఒక్కరూ ఈ సినిమాను చక్కని చిత్రంగా అభినందిస్తున్నారు.


చక్కటి ప్రేమకావ్యం.. చిరంజీవి 
ఈ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి ఓ రేంజిలో పొగడ్తలు కురిపించారు. తాజాగా ఈ సినిమాను చూసిన ఆయన.. చక్కటి ప్రేమకావ్యం చూసిన ఫీలింగ్ కలిగిందన్నారు. “సీతారామం చూశాను. చక్కటి ప్రేమకావ్యం చూసిన అనుభూతి. ముఖ్యంగా ఎంతో విభిన్నమైన స్క్రీన్ ప్లేతో కథని ఆవిష్కరించిన విధానం ఎంతగానో నచ్చింది. మనసులపై చెరగని ముద్ర వేసే ఇలాంటి చిత్రాన్ని ఎంతో ఉన్నతమైన నిర్మాణ విలువలతో నిర్మించిన అశ్వినీదత్ గారికి, స్వప్నాదత్ , ప్రియాంకా దత్ లకు ఒక పేషన్ తో చిత్రీకరించిన దర్శకుడు హను రాఘవపూడికి, కలకాలం నిలిచే సంగీతాన్ని అందించిన విశాల్ చంద్రశేఖర్ కి, అన్నింటికన్నా ముఖ్యంగా సీతా-రామ్ లుగా ఆ ప్రేమకథకి ప్రాణం పోసిన మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్ లకు, సూత్రధారి పాత్రని పోషించిన రష్మిక మందన్నకి మొత్తం టీం అందరికీ నా శుభాకాంక్షలు! ప్రేక్షకుల మనసు దోచిన ఈ చిత్రం మరెన్నో అవార్డులను, రివార్డులను జాతీయ స్థాయిలో గెలవాలని మనస్ఫూర్తిగా అభిలషిస్తున్నాను” అంటూ ట్వీట్ చేశారు.






ఇప్పటికే ఈ సినిమాను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రశంసించారు. “నటీనటులు అభినయానికి, సాంకేతిక విభాగాల సమన్వయం తోడై చక్కని దృశ్యకావ్యం ఆవిష్కృతమైందన్నారు. సాధారణ ప్రేమ కథలా కాకుండా, దానికి వీర సైనికుని నేపథ్యాన్ని జోడించి, అనేక భావోద్వేగాలను ఆవిష్కరించిన ఈ చిత్రం ప్రతి ఒక్కరూ తప్పక చూడదగినది. చాలా కాలం తర్వాత ఓ చక్కని సినిమా చూసిన అనుభూతిని “సీతారామం” అందించింది. రణగొణధ్వనులు లేకుండా, కళ్ళకు హాయిగా ఉండే ప్రకృతి సౌందర్యాన్ని ఆవిష్కరించిన ఈ చిత్ర దర్శకుడు శ్రీ హను రాఘవపూడి, నిర్మాత శ్రీ అశ్వినీదత్, స్వప్న మూవీ మేకర్స్ సహా చిత్ర బృందానికి అభినందనలు.” అని వెంకయ్య ట్వీట్ చేశారు.   






కార్తికేయ 2కు చెర్రీ ఫిదా.. 
మెగాస్టార్  చిరంజీవి ‘సీతా రామం’ సినిమా యూనిట్ కు అభినందనలు చెప్తే.. ఆయన తనయుడు రామ్ చరణ్ మరోసినిమా మీద ప్రశంసలు కురిపించాడు.  కార్తికేయ-2 చిత్రాన్ని పొగడ్తల్లో ముంచెత్తారు. ఈమేరకు సినిమా యూనిట్ ను అభినందిస్తూ  చెర్రీ ట్వీట్ చేశాడు. “మంచి సినిమాలు ఎప్పుడూ థియేటర్స్ కి వైభవాన్ని తీసుకువస్తాయి. మాసివ్ సక్సెస్ సాధించిన కార్తికేయ-2 సినిమా యూనిట్ కి కంగ్రాట్స్” అంటూ రాంచరణ్ ట్వీట్ చేశాడు. 





యంగ్ హీరో నిఖిల్ హీరోగా నటించిన ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహించాడు. సూపర్ హిట్ సినిమా కార్తికేయకు సీక్వెల్ గా కార్తికేయ-2 తెరకెక్కింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాపై ఇప్పటికే బిగ్ బీ అమితాబ్ ప్రశంసలు కురిపించారు. దర్శకుడు చందును ఇంటికి పిలిపించుకుని అభినందించారు. అటు ఇస్కాన్ సంస్థ కూడా ఈ సినిమా యూనిట్ ను అభినందించింది. వారిని బృందావనానికి ఆహ్వానించింది.