హైదరాబాద్‌లొ డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌ గోపీకృష్ణను పోలీసులు అరెస్ట్‌ చేశారు. గత కొద్దిరోజులుగా గోవా నుంచి గోపీకృష్ణ డ్రగ్స్‌ తెచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నాడని పోలీసులకు పక్కా సమాచారం  అందింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. 


హఫీజ్‌పేట్‌ గోకుల్‌ ఫ్లాట్స్‌లో గోపీకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన దగ్గర నుంచి 10 గ్రాముల డ్రగ్స్‌, రూ.55 వేల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. గోపీకృష్ణతో పాటు డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న అరబిక్‌ ట్యూటర్‌ అష్రఫ్‌ బేగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అష్రఫ్ దగ్గర నుంచి 13 గ్రాముల కొకైన్‌, రూ 65 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులు గోపీకృష్ణ, అఫ్రఫ్‌ల ఫోన్లను కూడా పోలీసులు సీజ్ చేశారు.


ప్రస్తుతం డ్రగ్స్ కేసులు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. బాలీవుడ్‌తో పాటూ తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితమైన శ్రద్ధాకపూర్ సోదరుడు సిద్ధాంత్ కపూర్‌ను కూడా ఇటీవలే డ్రగ్స్ కేసులో బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. అక్కడి ఎంజీ రోడ్డులో రేవ్ పార్టీ జరుగుతోందని సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అక్కడ 35 మంది వరకు అదుపులోకి తీసుకున్నారు.  వారిలో సిద్ధాంత్ కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. వారి శాంపిల్స్‌ని పరీక్షలకు పంపగా ఆరుగురు డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణ అయినట్టు చెప్పారు. ఆ ఆరుగురిలో సిద్ధాంత్ కపూర్ కూడా ఉన్నాడు. వీరిపై నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.


గతంలో శ్రద్ధాను కూడా నార్కోటిక్స్ అధికారులు డ్రగ్స్ వాడకం విషయంలో విచారించారు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో శ్రద్ధా విచారణను ఎదుర్కొంది. సినిమా ఇండస్ట్రీపై డ్రగ్స్ నీలి నీడలు ఎప్పటికప్పుడు కమ్ముకుంటూనే ఉన్నాయి. గతేడాది షారూక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ కూడా రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నాడనే ఆరోపణలనతో అరెస్టయ్యాడు. ముంబై తీరంలో ఉన్న ఓ క్రూయిజ్ షిప్ రేవ్ పార్టీపై దాడి చేసి పోలీసులు ఆర్యన్ ఖాన్ ను పట్టుకున్నారు. అయితే చివరికి ఎన్సీబీ క్లీన్ చిట్ ఇచ్చింది ఆయన్ను జైలు నుంచి బయటకు తీసుకొచ్చింది.