విక్కీ కౌశల్, రష్మిక మందన్న, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రలు పోషించిన పీరియాడికల్ డ్రామా 'ఛావా'. ఫిబ్రవరి 14న మూవీ రిలీజ్ కాబోతోంది. అయితే రిలీజ్ కు ముందే చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ మూవీ విమర్శలకు గురైంది. నిజానికి ఇలా హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సినిమాల విషయంలో వివాదాలు రావడం మామూలే. కానీ 'ఛావా' ట్రైలర్ ఇలా రిలీజ్ అయిందో లేదో, అలా వివాదానికి దారి తీసింది. ఈ మూవీని ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా రూపొందిస్తున్నారు. అయితే ఇందులోని సన్నివేశాల పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం కావడంతో కొన్ని సీన్లను డిలీట్ చేశారు నిర్మాతలు. ఇలా రిలీజ్‌కి ముందే వివాదాల బారిన పడిన టాప్ 5 హిస్టారికల్ సినిమాలు ఏంటో చూద్దాం.

జోధా అక్బర్ 2008లో రిలీజ్ అయిన భారీ చిత్రం 'జోధా అక్బర్'. మొఘల్ చక్రవర్తి అక్బర్, రాజ్ పుత్ యువరాణి జోధా ప్రేమ కథ ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో హృతిక్ రోషన్, ఐశ్వర్యారాయ్ ప్రధాన పాత్రలు పోషించారు. అయితే జోధా అక్బర్ సినిమాలో చారిత్రక వాస్తవాలను తారుమారు చేశారని కొందరు మండిపడ్డారు. జోధా బాయ్ అక్బర్ భార్య కాదు, జహంగీర్ భార్య అని మరికొందరు అన్నారు. రాజస్థాన్లో అయితే ఈ సినిమాను నిషేధించాలని ఏకంగా రాజ్ పుత్ సంఘం నిరసనను వ్యక్తం చేసింది. 

పద్మావత్ ఇలా వివాదాల బారిన పడిన సినిమాల్లో దీపిక పదుకొనే ప్రధాన పాత్ర పోషించిన 'పద్మావత్' మూవీ కూడా ఉంది. 2018లో రిలీజ్ అయిన ఈ సినిమాకు కర్ణి సేన నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. దీంతో ఈ మూవీ పేరును మేకర్స్ 'పద్మావతి' నుంచి 'పద్మావత్' గా మార్చారు. ఇందులో మహారాణి పద్మావతి 'ఘూమర్' అనే పాటకు డాన్స్ చేసినట్టు చూపించారు. కానీ చరిత్ర ప్రకారం ఆమె అసలు ఎప్పుడూ డాన్స్ చేయలేదు అనేది వివాదం. అంతేకాకుండా అల్లావుద్దీన్ ఖిల్జీని హైలెట్ చేశారని, 'ఘూమర్' పాటకు డాన్స్ చేసిన సమయంలో దీపిక ధరించిన దుస్తులు, ఖిల్జీ, రాణి పద్మావతి మధ్య రొమాంటిక్ సీన్ వంటివి వివాదాలను క్రియేట్ చేశాయి. 

పానిపట్ అర్జున్ కపూర్, కృతి సనన్, సంజయ్ దత్ ప్రధాన పాత్రలు పోషించిన 'పానిపట్' మూవీని కూడా బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మూవీలో మహారాజా సూరజ్మల్ పాత్రను జాట్ సమాజం తీవ్రంగా వ్యతిరేకించింది. రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ మూవీని బ్యాన్ చేయాలంటూ పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. లోక్సభలో కూడా ఈ మూవీని బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. మహారాజ సూరజ్మల్ పాత్రను తప్పుగా చూపించారు అనేది ఈ మూవీపై వచ్చిన ఆరోపణ.

Also Read: ఫస్ట్ మూవీకి 10 రూపాయలే... తర్వాత ఇండియన్ సినిమా హిస్టరీలో హయ్యెస్ట్ పారితోషికం అందుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?

సామ్రాట్ పృథ్వీరాజ్ 2022లో రిలీజ్ అయిన అక్షయ్ కుమార్ 'సామ్రాట్ పృథ్వీరాజ్' కూడా ఇలాంటి వివాదంలో చిక్కుకుంది. సామ్రాట్ పృథ్వీరాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు ముందుగా 'పృథ్వీరాజ్' అనే టైటిల్ ని ఖరారు చేశారు. కానీ ఇది ఆయనను అవమానించడమే అవుతుందనే వివాదం రావడంతో 'సామ్రాట్ పృథ్వీరాజ్' అని మార్చక తప్పలేదు. ఈ వివాదానికి పృథ్వీరాజ్ గుర్జర్ కమ్యూనిటీకి చెందినవాడని, కానీ క్షత్రియ రాజుగా చూపించారని గుర్జర్ సంఘం ఫైర్ అయింది. 

పొన్నియన్ సెల్వన్ మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన 'పొన్నియన్ సెల్వన్' రిలీజ్ కు ముందు అనేక వివాదాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ మూవీలో చోళ సామ్రాజ్యంలోని శైవులను నిర్లక్ష్యం చేశారని ఫైర్ అయ్యారు. రాజరాజ చోళుడు హిందూ కాదని నిర్మాత వెట్రిమారం కామెంట్ చేయడం మరో వివాదానికి దారి తీసింది.

Also Read'దిల్' రాజుకు రామ్ చరణ్ మరో సినిమానా? సారీ... ప్రజెంట్ కమిట్మెంట్ ఏదీ లేదు