బాలీవుడ్ అగ్ర హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్న తాజా చిత్రం 'ఓ మై గాడ్ 2'. అమిత్ రాయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అక్షయ్ కుమార్ శివుడిగా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు సినిమాపై ఆసక్తిని రేకెత్తించాయి. షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమాని ఆగస్టు 11న విడుదల చేయడానికి సిద్ధమయ్యారు మేకర్స్. ఇలాంటి సమయంలో సినిమా విడుదల కి సెన్సార్ అడ్డుకట్ట వేసినట్లు తెలుస్తోంది. దీంతో చేసేదేం లేక మూవీ టీం సినిమా విడుదలను వాయిదా వేయాలని డిసైడ్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఈ సినిమా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (సెన్సార్) వద్దకు వెళ్ళగా.. సినిమాకి సెన్సార్ యూనిట్ ఏకంగా 20 కట్స్ విధించడంతోపాటు సినిమాకి 'A' సర్టిఫికెట్ జారీ చేశారు.


సినిమాలో 20కి పైగా సన్నివేశాల్లో మార్పులు చేయాలని, వాటిల్లో ఆడియో, వీడియో కి సంబంధించిన సన్నివేశాలు కూడా ఉన్నాయని సెన్సార్ యూనిట్ తెలిపినట్లు సమాచారం. అంతేకాకుండా ముఖ్యంగా సినిమాలో అక్షయ్ కుమార్ శివుడి పాత్రని పూర్తిగా మార్చి అతన్ని సినిమాలో ఓ దూతగా చూపించాలని కోరింది. గత వారమే ఈ మార్పులన్నింటినీ చేయాల్సిందిగా సెన్సార్ బోర్డు రివ్యూ కమిటీ చిత్ర యూనిట్ కి సూచనలు జారీ చేసింది. దీనికి తోడు ఇప్పటికే ఈ సినిమా కొన్ని కాంట్రవర్సీలను ఎదుర్కొంటోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్, టీజర్ లో అక్షయ్ కుమార్ శివుడిగా బ్లూ స్కిన్ తో కనిపించే సన్నివేశాలను తొలగించాలని పలువురు డిమాండ్ చేశారు. ఇక ఈ కారణాల వల్ల 'ఓ మై గాడ్ 2' రిలీజ్ చిక్కుల్లో పడింది.


ఒకవేళ మేకర్స్ కనుక సినిమాలో మార్పులు చేసేందుకు సిద్ధమైతే ముందు ప్రకటించిన రిలీజ్ డేట్ ఆగస్టు 11న సినిమా విడుదల ఉండకపోవచ్చు. అంతేకాకుండా సెన్సార్ యూనిట్ సూచనల మేరకు సినిమాలో  పలు సన్నివేశాల్లో మార్పులు, చేర్పులు చేయాలంటే అందుకు కాస్త సమయం పడుతుంది. ఈ క్రమంలోనే మేకర్స్ ఈ మార్పులు చేయాలని డిసైడ్ అవుతూ మూవీ థియేటర్ రిలీజ్ ను పోస్ట్ ఫోన్ చేయనున్నట్లు తెలుస్తోంది. లేటెస్ట్ బాలీవుడ్ రిపోర్ట్స్ ప్రకారం.. మూవీ యూనిట్  సెన్సార్ కమిటీ సూచించిన మార్పులపై ప్రత్యేకంగా దృష్టి సారించి ఆ తర్వాత సినిమాకి సంబంధించి ప్రాపర్ ప్రమోషన్స్ ని ప్లాన్ చేసి త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నట్లు సమాచారం.  


ఇక 'ఓ మై గాడ్ 2' విషయానికొస్తే..2012 లో వచ్చిన 'ఓ మై గాడ్' సినిమాకి ఇది సీక్వెల్ గా తెరకెక్కింది. అక్షయ్ కుమార్, పంకజ్ త్రిపాటి, యామి గౌతమ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సెటైరికల్ కామెడీ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాని వియాకాం 18 స్టూడియోస్ నిర్మాణ సంస్థ సుమారు రూ.150 కోట్ల భారీ బడ్జెట్లో నిర్మిస్తోంది. భారీ అంచనాలతో రాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సక్సెస్ ను అందుకుంటుందో చూడాలి.


Also Read : ఒక్కసారి మాలా బ్రతికి చూడండి అన్నయ్య - చిరంజీవిపై 'బేబీ' డైరెక్టర్ కామెంట్స్




Join Us on Telegram: https://t.me/abpdesamofficial