Theatre Strike Latest Update: థియేటర్స్ బంద్ ఇష్యూలో ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)కు టాలీవుడ్ నుంచి మద్దతు లభిస్తోంది. ఆయనను ఇరిటేట్ చేశారంటూ యువ నిర్మాత బన్నీ వాసు 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి లేఖ వచ్చిన తర్వాత స్పందించిన మొదటి సెలబ్రిటీ బన్నీ వాసు కావడం గమనార్హం. 

ఇండస్ట్రీలో యూనిటీని ప్రశ్నించాల్సిన సమయం!''సినిమా ఇండస్ట్రీలో రాజకీయాలు చాలా సైలెంట్‌గా ఉంటాయి. అలాగే చాలా లోతుగానూ ఉంటాయి. ఈ రాజకీయాల రొచ్చులో ఇండస్ట్రీ నలుగుతోందనేది ఇప్పటికైనా సరే... నిర్మాతలు గానీ... డిస్ట్రిబ్యూటర్లు కానీ... ఎగ్జిబిటర్లు కానీ గ్రహించాలి. ఇటువంటి సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్లి ఒకరు డిప్యూటీ సీఎం  (పవన్ కళ్యాణ్) అయ్యారు. వాళ్ళనే మనం ఇరిటేట్ చేశామంటే... మన యూనిటీ ఎలా ఉందని ప్రశ్నించుకునే సమయం వచ్చింది'' అని బన్నీ వాసు పోస్ట్ చేశారు. 

Also Readటాలీవుడ్ 'కింగ్‌ పిన్‌'కు పవన్ కళ్యాణ్ చెక్‌మేట్... చిన్న గూగ్లీకి హడల్... దెబ్బకు సెట్టయ్యారా?

ఇండస్ట్రీలోని కొంత మంది కావాలని పవన్ కళ్యాణ్ (AP Deputy CM)ను ఇరిటేట్ చేశారనే అర్థం బన్నీ వాసు మాటల్లో వ్యక్తం అవుతోంది. అల్లు అరవింద్, అల్లు అర్జున్ సహా మెగా ఫ్యామిలీకి ఆయన క్లోజ్. ఈ నేపథ్యంలో ఆయన ట్వీట్ గురించి చర్చ మొదలైంది. మరో యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సైతం స్పందించారు. ''పెద్ద పెద్ద సమస్యల మీద దృష్టి సారించాల్సిన సమయంలో అనవసరమైన సమస్యలు సృష్టించారు. కామన్ సెన్స్ ఉంటే దీన్ని అవాయిడ్ చేసేవారు'' అని పేర్కొన్నారు వంశీ. 

Also Readమెగా ఫ్యామిలీని దూరం చేసుకుంటున్న దిల్ రాజు?  తెర వెనక కుట్రలా... ఇండస్ట్రీలో ఏం జరుగుతోందా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఇండస్ట్రీ కి సంబంధించిన వ్యక్తులు ఎవరు వచ్చి కలవలేదని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి ఒక లేఖ విడుదల అయింది. అయితే దీని వెనుక థియేటర్స్ బంద్ వ్యవహారం ఉందనే సంగతి ఇండస్ట్రీ ప్రముఖులతో పాటు సాధారణ ప్రేక్షకులకు సైతం తెలిసిందే. పవన్ హీరోగా రూపొందిన 'హరిహర వీరమల్లు' సినిమా విడుదలకు ముందు బంద్ చేయాలని అనుకోవడం మొత్తం వివాదానికి మూల కారణం. ప్రస్తుతానికి బంద్ లేదని ఫిలిం ఛాంబర్ ప్రకటించినప్పటికీ... తెర వెనుక జరిగిన వ్యవహారాల కొన్ని పవన్ దృష్టికి వెళ్లడంతో ఆయన సీరియస్ అయినట్లు తెలిసింది.