రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) కథానాయకుడిగా తెరకెక్కుతోన్న ఫాంటసీ ఫిల్మ్ 'బ్రహ్మాస్త్ర'. ఇందులో ఆలియా భట్ (Alia Bhatt) కథానాయిక. అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), నాగార్జున, మౌనీ రాయ్ కీలక పాత్రధారులు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రోజు సినిమా ట్రైలర్ విడుదల చేశారు.
'సకల అస్త్రాలకు దేవత' - ఇదీ 'బ్రహ్మాస్త్ర' సినిమా కాప్షన్. భగవంతుడు, దుష్ట శక్తులకు మధ్య జరిగే యుద్ధమే 'బ్రహ్మాస్త్రం' చిత్ర కథాంశం అంటూ చిత్ర బృందం చెబుతూ వస్తోంది. ఈ రోజు విడుదలైన ట్రైలర్ చూస్తే... ఆ యుద్ధం భారీగా ఉండబోతుందని, ఇదొక విజువల్ వండర్ అని అర్థం అవుతోంది.
'బ్రహ్మాస్త్ర' ట్రైలర్ విషయానికి వస్తే... కథేంటి? అనేది క్లియర్‌గా చెప్పారు. అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. ''నీరు, నిప్పు, వాయువు ప్రాచీన కాలంలో మన మధ్య ఉన్న శక్తులు. అస్త్రాల్లో ఇమిడి ఉన్నాయి. ఈ కథ సకల అస్త్రాలకు దేవత 'బ్రహ్మాస్త్ర' గురించి'' అని అమితాబ్ బచ్చన్ వివరించారు. అప్పుడు వచ్చే విజువల్స్ అబ్బురపరిచేలా ఉన్నాయి.
రణ్‌బీర్ కపూర్‌ను సాధారణ యువకుడిగా పరిచయం చేశారు. ఆలియాతో అతను ప్రేమలో పడటం, ఆ తర్వాత తనకు అగ్ని శక్తి ఉందని తెలుసుకోవడం... లోకంలో చెడును అంతం చేయడం కోసం అతను ఏం చేశాడనేది సినిమా. మౌనీ రాయ్, నాగార్జున పాత్రలనూ ట్రైలర్‌లో పరిచయం చేశారు.
ట్రైలర్‌లో రణ్‌బీర్, ఆలియా మధ్య కెమిస్ట్రీ... విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. సినిమా గ్రాండ్ విజువల్ వండర్ అనే హింట్ ఇచ్చింది. తెలుగులో ఈ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చారు. దక్షిణాది భాషల్లో ఎస్.ఎస్. రాజమౌళి సమర్పణలో విడుదల కానుంది. సెప్టెంబర్ 9న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే.
Also Read: హీరోయిన్ అంజలి 'బహిష్కరణ'