హిందీ చలన చిత్ర పరిశ్రమలో కొన్ని రోజులుగా పరిస్థితులు ఏమీ బాలేదు. బాక్సాఫీస్ బరిలో సరైన సూపర్ హిట్ సినిమా చూసి చాలా రోజులు అవుతోంది. స్టార్ హీరోలు నటించిన సినిమాలు బోల్తా కొడుతున్నాయి. ఇటువంటి తరుణంలో తెలుగు హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన 'కార్తికేయ 2' ఉత్తరాదిలో భారీ విజయం సాధించింది. ఇక, బాలీవుడ్ పనైపోయిందా? బాయ్‌కాట్ ట్రెండ్ కారణంగా అక్కడి సినిమాలను ప్రేక్షకులు ఎవరూ చూడటం లేదా? వంటి సందేహాలు ఎన్నో! వరుసపెట్టి సినిమాలు ఫ్లాప్ అవుతుండటంతో బాలీవుడ్ ప్రముఖుల్లో కూడా కొంత భయం నెలకొన్న మాట వాస్తవం. ఈ భయాలు అన్నిటికీ 'బ్రహ్మాస్త్ర' చెక్ పెట్టేలా ఉంది.
బాలీవుడ్‌కు ఊపిరి పోసిన 'బ్రహ్మాస్త్ర'
హిందీలో ఈ ఏడాది విడుదలైన 'ది కశ్మీర్ ఫైల్స్', 'భూల్ బులయ్యా 2', 'గంగూబాయి కతియవాడి' మినహా మిగతా సినిమాలు భారీ విజయాలు సాధించలేదు. పైగా, బాక్సాఫీస్ బరిలో అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఆమిర్ ఖాన్ 'లాల్ సింగ్ చడ్డా', అక్షయ్ కుమార్ 'సామ్రాట్ పృథ్వీరాజ్', 'బచ్చన్ పాండే', రణ్‌బీర్ కపూర్ 'షంషేరా', విజయ్ దేవరకొండ 'లైగర్' వంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫెయిల్ అయ్యాయి. ఈ సినిమాలు అన్నిటికీ బాయ్‌కాట్ ట్రెండ్ సెగ తగిలింది. దాంతో సినిమా పరాజయాలను ఆ ఖాతాలో తీయడానికి ప్రయత్నిస్తున్న వారు కూడా ఉన్నారు. ఇటువంటి సమయంలో 'బ్రహ్మస్త్ర' అడ్వాన్స్ బుకింగ్ బాలీవుడ్‌కు ఊపిరి పోసేలా ఉంది.
Brahmastra Advance Booking : హిందూ మైథాలజీ నేపథ్యంలో రూపొందిన సినిమా కావడం వల్లనా? మరొకటా? అనేది పక్కన పెడితే... ఉత్తరాదిలో 'బ్రహ్మస్త్ర' సినిమా చూడాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ఆల్రెడీ టికెట్స్ కొంటున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ శాతం శుక్రవారం 63, శనివారం 25, ఆదివారం 12గా ఉందని ప్రముఖ ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. విడుదల రోజున టాక్ బట్టి వీకెండ్ బుకింగ్స్ ఉంటాయని ఆయన పేర్కొన్నారు. సో... ఈ సినిమాపై బాయ్ కాట్ ఎఫెక్ట్ లేదని చెప్పాలి.
'బహ్మస్త్ర' బావుంటే... జనాలు థియేటర్లకు వస్తారు. ఇప్పటివరకూ ఫ్లాప్ అయిన సినిమాలపై బాయ్ కాట్ ప్రభావం కంటే, ఆయా సినిమాల్లో కంటెంట్ ఎక్కువ ఎఫెక్ట్ చూపించిందని చెప్పాలి. మౌత్ పబ్లిసిటీ ఫ్లాప్ సినిమాలను భారీగా దెబ్బ కొట్టింది. ఆ పరాజయాలను బాయ్ కాట్ గ్యాంగ్ సెలబ్రేట్ చేసుకుంది. ఇప్పుడు 'బ్రహ్మస్త్ర' బుకింగ్స్ చూసి ఆ గ్యాంగ్ ఏమంటుందో మరి? 'కెజియఫ్ 2' తర్వాత ఆ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ 'బ్రహ్మాస్త్ర' సినిమాకు వచ్చాయని టాక్.
దక్షిణాదిలో కూడా బుకింగ్స్ బావున్నాయి!
తెలంగాణలోని హైదరాబాద్, కర్ణాటకలోని బెంగళూరు వంటి నగరాల్లో కూడా 'బ్రహ్మాస్త్ర' బుకింగ్స్ బావున్నాయి. దక్షిణాదిలో విపరీతంగా ప్రచారం చేయడం కూడా ప్లస్ అయ్యింది. హైదరాబాద్‌లోని కొన్ని మల్టీప్లెక్స్‌లలో త్రీడీ సినిమా టికెట్ రేటు 300 వందలు పెట్టినప్పటికీ... కొందరు ప్రేక్షకులు బుక్ చేసుకుంటున్నారు. సినిమా హిట్ అయితే ఫస్ట్ డే కలెక్షన్స్ భారీగా నమోదు చేసే అవకాశం ఉంది.
Also Read : ఎన్టీఆర్‌ను టార్గెట్ చేసిన కేసీఆర్? - దెబ్బకు రెండున్నర కోట్ల నష్టం
'బ్రహ్మాస్త్ర'కు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. బాలీవుడ్‌లో కొత్త పెళ్లి జంట రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన తొలి చిత్రమిది. అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీ రాయ్ కీలక పాత్రలు పోషించారు. సెప్టెంబర్ 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తెలుగులో 'బ్రహ్మాస్త్రం' పేరుతో విడుదల చేస్తున్నారు.
Also Read : రాజమౌళి గారూ, ఒక్కసారి గిచ్చరా? - సుమ కనకాల సూపర్ ఫన్