ప్రేక్షకులు ముద్దుగా కింగ్ ఆఫ్ కామెడీ, హాస్య బ్రహ్మ అని పిలుచుకునే నటుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత బ్రహ్మానందం. ఆయన ప్రధాన పాత్రలో రూపొందుతున్న సినిమా 'బ్రహ్మ ఆనందం'. ఇందులో ఆయన కుమారుడు రాజా గౌతమ్ హీరో. ఈ సినిమా స్పెషాలిటీ ఏమిటంటే... తాత మనవళ్ళుగా తండ్రి కుమారులు ఇద్దరూ అలరించబోతున్నారు. ఆర్వీఎస్ నిఖిల్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సావిత్రి, శ్రీ ఉమేష్ యాదవ్ సమర్పణలో సినిమాను స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రాహుల్ యాదవ్ నక్కా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇవాళ మూవీ గ్లింప్స్ విడుదల చేశారు.
గిఫ్ట్ ఇవ్వలేక రాఖీ తిరిగిచ్చే హీరో!
చేతిలో చిల్లిగవ్వ లేని యువకుడిగా రాజా గౌతమ్ కనిపించనున్నారు. 'బ్రహ్మ ఆనందం' గ్లింప్స్ చూస్తే... 'లాస్ట్ ఇయర్ రాఖీ కట్టి గిఫ్ట్ అడిగితే ఏం ఇచ్చాను?' అని ఓ అమ్మాయిని అడుగుతాడు హీరో. 'రాఖీ తిరిగి ఇచ్చావ్' అని చెబుతుంది ఆ అమ్మాయి. 'అదీ పరిస్థితి' అంటాడు హీరో. చిన్నప్పుడు ఎప్పుడో ఆడిన క్రికెట్ మ్యాచ్ బెట్ డబ్బుల గురించి ఇప్పుడు ఫోన్ చేసి అడిగే రకం!
హీరోకి ఓ ఫ్రెండ్ ఉన్నాడు. అతడు డాక్టర్. ఆ రోల్ 'వెన్నెల' కిశోర్ చేశారు. పేషెంట్ బీపీ చెక్ చేయడం మానేసి తన బీపీ చెక్ చేసుకునే రకం. అంటే... అతడు అమ్మాయిలతో మాట్లాడడు. 'ఒకటి చెప్తే మరొకటి అర్థం చేసుకుంటారు' అంటాడు. హీరో నిరాశలో ఉంటే, ఫ్రెండ్ ఫ్రస్ట్రేషన్ లో ఉంటాడు. వీళ్ళ సమస్యలను బ్రహ్మ... అదేనండీ బ్రహ్మానందం ఎలా తీర్చాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. డిసెంబర్ 6న థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
హ్యాట్రిక్ హిట్స్ తర్వాత స్వధర్మ్ నుంచి!
'మళ్లీ రావా', 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ', 'మసూద'... హ్యాట్రిక్ హిట్స్, 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ సొంతం. ఆ మూడు విజయాల తర్వాత రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్న సినిమా కావడంతో దీని మీద ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు ఉన్నాయి.
Also Read: వేట్టయాన్ వర్సెస్ కంగువ... దసరా బరిలో రజనీకాంత్ - సూర్య సినిమాకు పోటీగా
Brahma Anandam Movie Cast And Crew: బ్రహ్మానందంతో పాటు ఆయన తనయుడు రాజా గౌతమ్, 'వెన్నెల' కిశోర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'బ్రహ్మ ఆనందం' సినిమాలో ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్, సంపత్, రాజీవ్ కనకాల ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కూర్పు: ప్రసన్న, కళా దర్శకుడు: క్రాంతి ప్రియం, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: పి దయాకర్ రావు, ఛాయాగ్రహణం: మితేష్ పర్వతనేని, సంగీతం: శాండిల్య పీసపాటి, సమర్పణ: శ్రీమతి సావిత్రి - శ్రీ ఉమేష్ యాదవ్, నిర్మాణ సంస్థ: స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్, నిర్మాత: రాహుల్ యాదవ్ నక్కా, రచన - దర్శకత్వం: ఆర్వీఎస్ నిఖిల్.