Boney Kapoor Abput Actress Sridevi Biopic: భారతీయ సినీ పరిశ్రమలో దిగ్గజ నటిగా వెలుగొందారు దివంగత శ్రీదేవి. సౌత్, నార్త్ అనే తేడాలేకుండా ఎన్నో అద్భుత చిత్రాల్లో నటించి మెప్పించారు. దుబాయ్‌లో అనూహ్య రీతిలో ఆమె చనిపోవడంతో సినీ అభిమానులు షాక్ అయ్యారు. యావత్ సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. ఆమె మరణం తర్వాత చాలా మంది శ్రీదేవి బయోపిక్ తెరకెక్కించేందుకు ప్రయత్నించారు. తాజాగా ఇదే విషయంపై ఆమె భర్త, ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
శ్రీదేవి బయోపిక్‌కు అనుమతించను - బోనీ కపూర్
అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం ‘మైదాన్’. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు బోనీ కపూర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈనెల 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న బోనీ కపూర్ శ్రీదేవి బయోపిక్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీదేవి తన జీవితాన్ని ప్రైవేట్ గా ఉంచుకునేందుకే ఇష్టపడిందని చెప్పారు. దాన్ని ఇప్పుడు బయటపెట్టేందుకు తాను ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని ఆయన వెల్లడించారు. “నా భార్య శ్రీదేవి చాలా వరకు ప్రైవేట్ జీవితాన్ని గడిపేందుకు ఇష్టపడేది. ఆమె వ్యక్తిగత విషయాలను బయటకు చెప్పేందుకు అస్సలు ఇష్టపడేది కాదు. ఆమె చనిపోయే వరకూ అలాగే ఉంది. ఇప్పుడు ఆమె వ్యక్తిగత విషయాలను బయటకు చెప్పేందుకు ఇష్టపడను. నేను బతికి ఉన్నంత కాలం ఆమె బయోపిక్ కు అనుమతి ఇవ్వను” అని బోనీ కపూర్ తేల్చి చెప్పారు.
‘శ్రీదేవి బంగ్లా’ను అడ్డుకున్న బోనీ కపూర్
నిజానికి గతంలో శ్రీదేవి జీవితకథకు దగ్గరగా ఉన్న ఓ సినిమా తెరకెక్కింది. ‘శ్రీదేవి బంగ్లా’ పేరుతో రూపొందిన చిత్రంలో ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ట్రైలర్ అప్పట్లో సంచలనం సృష్టించింది. దీన్ని చూసిన బోనీ కపూర్ చిత్ర విడుదలను అడ్డుకున్నారు. ఈ సినిమా శ్రీదేవి జీవితానికి దగ్గరగా ఉన్న నేపథ్యంలో సినిమా విడుదలను అడ్డుకోవాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఆ సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత మరెవర్వూ ఆమె సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేయలేదు.
శ్రీదేవి బయోగ్రఫీ రాస్తున్న ప్రముఖ రచయిత ధీరజ్
కానీ, శ్రీదేవి జీవితంలో జరిగిన కొన్ని ఆసక్తికర విషయాలను బేస్ చేసుకుని ప్రముఖ రచయిత ధీరజ్, ఆమె బయోగ్రఫీని రాస్తున్నారు. ‘ది లైఫ్ ఆఫ్ ఎ లెజెండ్’ పేరుతో ఈ పుస్తకాన్ని రాయబోతున్నారు. ఇందుకోసం ఇప్పటికే శ్రీదేవి కుటుంబ సభ్యుల అంగీకారం పొందినట్లు తెలుస్తోంది. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన శ్రీదేవి, నార్త్ లో అడుగు పెట్టింది. అక్కడ కూడా ఎన్నో అద్భుత సినిమాల్లో నటించింది. ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకుంది. 2018 ఫిబ్రవరి 24న దుబాయ్ హోటల్ లో ప్రమాదవశాత్తు ఆమె కన్నుమూసింది.
Read Also: అగ్ర నిర్మాతను చేసుకోబోతున్న అంజలి? ఆలీ అంత సేఫ్ కాదా? కోపాన్ని కంట్రోల్ చేసుకున్న బాలయ్య?