యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ 'ఆదిపురుష్' రిలీజ్ కి ముందే సినీ ఆడియన్స్ ని ఎంతో ఆకర్షిస్తుంది. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ రామాయణం ఇతిహాసం ఆధారంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని తెరకెక్కించారు. అంతేకాదు మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని ఉపయోగించి ప్రేక్షకులకు ఓ సరికొత్త అనుభూతిని ఈ సినిమా ద్వారా అందించబోతున్నారు మేకర్స్. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా గ్రాండ్ గా జరిగింది. ఇదిలా ఉంటే ఈ సినిమాను ప్రతి ఒక్కరికి చూపించేలా ఆదిపురుష్ మూవీ టీంకి కొంతమంది దర్శక, నిర్మాతలు ఎంతో సపోర్ట్ గా నిలుస్తున్నారు.


ఈ క్రమంలోనే ప్రముఖ నిర్మాత అభిషేక అగర్వాల్ ఇప్పటికే 'ఆదిపురుష్'  సినిమాకు సంబంధించి 10,000 టికెట్లను తెలంగాణలోని అనాథ పిల్లలకు, వృద్ధులకు ఉచితంగా ఇస్తున్నట్లు ప్రకటించి తన మంచి మనసు చాటుకున్నారు. ఇదే విషయాన్ని మూవీ టీం ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది. ఇక ఓ బాలీవుడ్ హీరో సైతం 'ఆదిపురుష్' మూవీకి మద్దతు తెలిపేందుకు ముందుకొచ్చారు. అతను కూడా ఓ 10,000 టికెట్లను ఉచితంగా ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇంతకీ ఆ బాలీవుడ్ హీరో మరెవరో కాదు రణబీర్ కపూర్. నిరుపేద పిల్లలకు పదివేల 'ఆదిపురుష్' టికెట్లను విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించాడు రణబీర్ కపూర్. అంతేకాదు తన చిన్నతనంలో రామాయణం నుంచి తాను చాలా నేర్చుకున్నానని, నేటితరం పిల్లలు కూడా శ్రీరాముని కథ నుంచి మంచి విషయాలు చాలా నేర్చుకోవాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఇక 'ఆదిపురుష్' రిలీజ్ రోజు పదివేల టికెట్లు హిందీ బెల్ట్ లోని ఎన్జీవోలకు(NGO) పంపిణీ చేయబడతాయి.


కాగా రణబీర్ కపూర్ ప్రస్తుతం 'యానిమల్' అనే సినిమాలో నటిస్తున్నాడు. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది. రణబీర్ కపూర్ సరసన రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం రణబీర్ ఈ సినిమా షూటింగ్ తోనే బిజీగా ఉన్నాడు. ఇక 'ఆదిపురుష్' విషయానికొస్తే.. రెట్రో ఫైల్స్ సమర్పణలో టి సిరీస్ బ్యానర్ పై భూషణ కుమార్ సుమారు రూ.550 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో నిర్మిస్తున్నారు. అజయ్ - అతుల్ సంగీతం అందించిన ఈ సినిమాలో శ్రీరాముడి పాత్రలో ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవదత్త నగే నటిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన రెండు ట్రైలర్లు, సాంగ్స్ ప్రేక్షకుల నుంచి విశేష స్పందనను రాబట్టాయి. 2D వెర్షన్ తో పాటూ 3D వెర్షన్ లో విడుదల కానున్న ఈ మూవీకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ త్వరలోనే ప్రారంభం కానున్నాయి. తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.


Also Read: అభిమానుల చేతుల మీదుగా 'భగవంత్ కేసరి' టీజర్ - ఎన్ని థియేటర్లలో తెలుసా?