Bollywood Actress Tabu In Puri Jagannadh Vijay Sethupathi Movie: తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi), టాలీవుడ్ మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) కాంబోలో ఓ మూవీ రాబోతోన్న విషయం తెలిసిందే. ఈ మూవీలో నటీనటులపై ఎవరనే దానిపై ఆసక్తి నెలకొనగా తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ 'పూరీ కనెక్ట్స్' అప్ డేట్ ఇచ్చింది.

సినిమాలో బాలీవుడ్ హీరోయిన్

ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ టబు (Tabu) నటించనున్నారు. ఈ మేరకు నిర్మాణ సంస్థ సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటన ఇచ్చింది. 'షి ఈజ్ ఎలక్ట్రిక్, షి ఈజ్ ఎక్స్‌ప్లోజివ్, షి ఈజ్ ది టబు. పూరీ విజయ్ సేతుపతి సినిమాలో డైనమిక్ రోల్ కోసం ఆమెను సగర్వంగా స్వాగతిస్తున్నాం.' అని పేర్కొంది. 

స్టార్ హీరోతో పాటు హీరోయిన్ కూడా మూవీలో భాగం అవుతుండడంతో భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్‌లో ప్రారంభం కానున్నట్లు మూవీ టీం తెలిపింది. త్వరలోనే ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలు ప్రకటించనున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో సహా పలు భాషల్లో విడుదల కానుంది.

Also Read: 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ - బాబాయ్‌తో కలిసి నటించడంపై కల్యాణ్ రామ్ ఏమన్నారంటే?

అసలు స్టోరీ ఏంటి?

కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి నిజానికి 'ఉప్పెన' తర్వాత తెలుగులో ఏ మూవీ కూడా చేయలేదు. ఆ సినిమా తర్వాత ఎంతో మంది డైరెక్టర్లు చాలా స్టోరీస్‌తో ఆయన్ను సంప్రదించినా ఓకే చెయ్యలేదు. అయితే, పూరీ జగన్నాథ్ చెప్పిన కథకు విజయ్ ఒకటే సిట్టింగ్‌లో ఓకే చేశారని తెలుస్తోంది. అంతలా ఆయన్ను మెప్పించిన కథేంటి అనేది ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో విజయ్ సేతుపతిని ఇప్పటివరకూ ఎవరూ చూడని డిఫరెంట్ రోల్‌లో పూరీ చూపించనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ కథపై అంతటా ఆసక్తి నెలకొంది. అయితే, విజయ్ ఇటీవలే 'మహారాజ'తో మంచి హిట్ అందుకున్నారు. అలాగే 'విడుదల పార్ట్ 2' సినిమాలోనూ తన నటనతో మెప్పించారు.

మరోవైపు, మాస్ డైరెక్టర్‌గా పేరొందిన పూరీ జగన్నాథ్ ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోలతో సినిమాలు చేసి బాక్సాఫీస్‌కు భారీ హిట్స్ అందించారు. ఇటీవల ఆయనకు సరైన హిట్ పడలేదు. 2019లో వచ్చిన రామ్ 'ఇస్మార్ట్ శంకర్'తో హిట్ అందుకోగా ఆ ట్రెండ్ కొనసాగుతుందని అంతా భావించారు. అయితే, లైగర్ డిజాస్టర్ తర్వాత పూరీ అనుకున్న ప్రాజెక్టులేవీ పట్టాలెక్కలేదు. తాజాగా, విజయ్ సేతుపతితో సినిమా పట్టాలెక్కుతుండడంతో ఫ్యాన్స్ పూరీ మళ్లీ కమ్ బ్యాక్ కావాలని ఆకాంక్షిస్తున్నారు.