బాలీవుడ్ అగ్ర హీరో షారుక్ ఖాన్ ఈ ఏడాది 'పఠాన్' సినిమాతో సంచలన విజయం అందుకున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా వరుస అపజయాలతో డీలాపడ్డ షారుక్ కి 'పఠాన్' భారీ కం బ్యాక్ అందించింది. భాషతో సంబంధం లేకుండా విడుదలైన అన్ని చోట్ల ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టి, షారుక్ కెరియర్ లోని బిగ్గెస్ట్ గ్రాఫర్ గా నిలిచింది. ఇప్పుడు ఇదే సక్సెస్ ని కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాడు ఈ హీరో. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా సక్సెస్ తో ఇప్పుడు వరుస సినిమాలను లైన్లో పెట్టాడు. 'పఠాన్' వంటి భారీ సక్సెస్ తర్వాత షారుక్ నటిస్తున్న తాజా చిత్రం 'జవాన్'.
కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. హిందీ తో పాటు తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ఇక తాజాగా చెన్నైలో సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ కూడా గ్రాండ్ గా జరిగింది. ఇక ఇదిలా ఉంటే 'జవాన్' విడుదల సందర్భంగా షారుక్ కు సంబంధించిన పాత వార్తలు ఇప్పుడు మళ్ళీ ట్రెండింగ్ లోకి వస్తున్నాయి. ముఖ్యంగా గతంలో షారుక్ తెలుగులో మాట్లాడిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఆయన నటించిన 'జీరో' మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న సమయంలో షారుక్ మాట్లాడిన వీడియో ఇది.
2018లో 'జీరో' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చెన్నైలో జరిగిన ఓ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు షారుక్ ఖాన్. ఈ ప్రెస్ మీట్ లో హైదరాబాద్‌కు చెందిన జర్నలిస్ట్ షారుక్‌ని ఓ ప్రశ్న అడిగారు. ఆ సమయంలో హైదరాబాద్ స్లాంగ్ లో మాట్లాడిన ఆయన, తర్వాత బాగున్నారా? అని విలేకరి అడగగా.. బాగున్నాను అని తెలుగులో బదులిచ్చాడు. అలాగే 'నా పేరు షారుక్ ఖాన్' అంటూ తెలుగులో మాట్లాడి అక్కడున్న అందరినీ ఆకట్టుకున్నాడు. షారుక్ అలా వచ్చి రాని తెలుగులో మాట్లాడటంతో ప్రెస్ మీట్ లో పాల్గొన్న వాళ్లంతా ఒక్కసారిగా నవ్వేశారు. 2018లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు మళ్లీ నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది.
ఈ వీడియోని చూసిన నెటిజన్స్ ‘‘షారుక్ తెలుగులో భలే మాట్లాడుతున్నాడు’’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. షారుక్ ఖాన్‌కు హైదరాబాద్‌తో ఇంతకుముందే మంచి అనుబంధం ఉంది. హైదరాబాదులోని టోలిచౌకిలో షారుక్ నాలుగేళ్లు ఉన్నారట. అంతేకాదు చిన్నప్పుడు షారుక్ ఎక్కువగా హైదరాబాదులో వారి అమ్మమ్మ ఇంట్లోనే ఉండేవారట. షారుక్ అమ్మమ్మకు మగ పిల్లలు లేకపోవడంతో ఆమె షారుక్‌ను దత్తత తీసుకున్నారట. అలా షారుక్‌కి హైదరాబాద్‌తో ఎంతో మంచి అనుబంధం ఉంది.
ఇక షారుక్ ఖాన్‌కి మన తెలుగులోనూ భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. భాషతో సంబంధం లేకుండా అభిమానించే ఇండియన్ యాక్టర్స్ లో షారుఖ్ ఖాన్ కూడా ఒకరు. మరి షారుక్ నటించిన 'జవాన్' హిందీ తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదలవుతున్న నేపథ్యంలో ఇక్కడ కూడా మూవీ ప్రమోషన్స్ చేస్తారా? ఒకవేళ చేస్తే అందులో షారుక్ పాల్గొంటారా? లేదా అనేది చూడాలి.
Also Read : 'సలార్' కాదు - ఆ రోజు ఎన్టీఆర్ బావమరిది నితిన్ నటించిన 'మ్యాడ్'!