'భోళా శంకర్' (Bhola Shankar) రిజల్ట్ విషయంలో ఎటువంటి సందేహాలు అవసరం లేదు. సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య' సినిమాతో భారీ విజయం సాధించిన మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)కి 'భోళా శంకర్' ఫ్లాప్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో చిరంజీవి దర్శక - నిర్మాతల ఎంపిక, భోళా పాత్ర చిత్రణపై పలు విమర్శలు వస్తున్నాయి. అయితే... నిర్మాత అనిల్ సుంకర ముక్కుపిండి డబ్బులు వసూలు చేశారని కొందరు ఘాటు విమర్శలు చేస్తున్నారు. సినిమాకు ఫ్లాప్ టాక్ రావడంతో పనిగట్టుకుని మరీ చిరంజీవి ఇమేజ్ డ్యామేజ్ చేసే ప్రయత్నాలు కొంత మంది చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలే చెబుతున్నాయి. 


నిర్మాత ముక్కుపిండి రెమ్యూనరేషన్ వసూలు చేశారా?
'భోళా శంకర్'కు చిరంజీవి 60 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నారని ఫిల్మ్ నగర్ వర్గాల ఖబర్. ఎంత తీసుకున్నారని అడిగితే... ఆయన చెప్పరు. పోనీ, హీరో రెమ్యూనరేషన్ ఎంత అని అడిగితే... నిర్మాత పెదవి విప్పరు. 'వాల్తేరు వీరయ్య'కు అటు ఇటుగా చిరంజీవి రూ. 50 కోట్లు తీసుకున్నట్లు టాక్. ఆ లెక్కన వేసుకుంటే... అంత ఆఫర్ చేసి ఉండొచ్చు. హిట్ సినిమా తర్వాత వస్తున్న సినిమా కనుక పది, పదిహేను కోట్లు ఎక్కువ ఆఫర్ చేసి ఉండొచ్చు. 


'భోళా శంకర్' రిజల్ట్ వచ్చిన తర్వాత... సినిమా విడుదలకు ముందు నిర్మాత అనిల్ సుంకర (Anil Sunkara) ముక్కు పిండి మరీ చిరంజీవి తన పారితోషికం అంతా వసూలు చేశారని ఓ సెక్షన్ ఆఫ్ మీడియా, సోషల్ మీడియా ప్రచారం చేయడం మొదలు పెట్టింది. చిరంజీవి ఇమేజ్ డ్యామేజ్ చేసే ప్రయత్నమే తప్ప... ఆ వార్తల్లో నిజం లేదని మెగా క్యాంప్ సన్నిహిత వర్గాలు, ఇండస్ట్రీలో కొంత మంది జనాలు చెప్పే మాట. అసలు నిజం ఏమిటంటే... ఇంకా చిరంజీవికి ఇంకా ఫుల్ పేమెంట్ ఇవ్వలేదట. ఐదు కోట్లకు పోస్ట్ డేటెడ్ చెక్ ఇచ్చారట.


నిజంగా నిర్మాతలను చిరంజీవి ఇబ్బంది పెట్టాలని అనుకుంటే... 'ఆచార్య' ఫ్లాప్ తర్వాత పారితోషికం వెనక్కి ఎందుకు ఇస్తారు? ఆ సంగతి అప్పుడే మర్చిపోతే ఎలా? అని ప్రశ్నిస్తున్నారు. 


'ఏజెంట్'కు జరిగింది ఏమిటి?
పాన్ ఇండియా డిజాస్టర్ గొడవ ఏమిటి?
'భోళా శంకర్' విడుదలకు ముందు అనిల్ సుంకరపై 'ఏజెంట్' డిస్ట్రిబ్యూటర్ కేసు వేశారు. సుమారు 30 కోట్ల రూపాయల విషయంలో తాను మోసపోయినట్టు ఆయన పేర్కొన్నారు. డబ్బులు వెనక్కి ఇస్తానని చెప్పినప్పటికీ... అనిల్ సుంకర అసలు స్పందించడం లేదని తెలిపారు. 'భోళా శంకర్' సినిమా విడుదలపై స్టే ఇవ్వమని కోర్టును ఆశ్రయించారు. అయితే... థియేట్రికల్ రిలీజ్ మీద కోర్టు స్టే ఇవ్వలేదు కానీ... ఓటీటీ / డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ విషయంలో స్టే ఇచ్చింది. 'ఆచార్య'కు చిరంజీవి, 'ఏజెంట్'కు అనిల్ సుంకర చేసింది ఏమిటో గుర్తు చేసుకోవాలని ఫిల్మ్ నగర్ జనాలు కొందరు వ్యాఖ్యానించడం విశేషం. 


నిజం చెప్పాలంటే... 'ఏజెంట్' విషయంలో అనిల్ సుంకర తప్పు లేదు. NRA (నాన్ రిటర్నబుల్ అడ్వాన్స్) మీద ఆయన సినిమా ఇచ్చారు. అయితే... భారీ డిజాస్టర్లు వచ్చినప్పుడు అగ్రిమెంట్లతో సంబంధం లేకుండా ఎంతో కొంత వెనక్కి ఇవ్వడం అనేది ఆనవాయితీగా వస్తోంది. 'ఏజెంట్', 'భోళా శంకర్' చిత్రాలకు నిర్మాత ఒకరే కనుక... 'భోళా' విడుదల ముందు డబ్బులు రాబట్టుకునే ఆలోచనతో డిస్ట్రిబ్యూటర్ కోర్టును ఆశ్రయించారు. లా పాయింట్స్ కొన్ని తీశారు. అనిల్ సుంకర ఆయన లా పాయింట్స్ ఏవో వినిపించారు. 'ఆచార్య' ఫ్లాప్ తర్వాత చిరు డబ్బులు ఇచ్చినట్లు ఆ హీరో ఇచ్చారా? లేదంటే నిర్మాత చొరవ తీసుకుని ఏమైనా చేశారా?


Also Read : మెగాస్టార్ రీ ఎంట్రీ తర్వాత లోయస్ట్ ప్రీ రిలీజ్ రికార్డ్ 'భోళా శంకర్'దే - బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?


ఇప్పుడు మరో ఘటనకు వద్దాం! సుమారు ఏడాది క్రితం... తెలుగు హీరో, దర్శకుడు కలిసి చేసిన పాన్ ఇండియా సినిమా డిజాస్టర్ అయ్యింది. డిస్ట్రిబ్యూటర్లు ధర్నా చేసే వరకు వెళ్ళింది పరిస్థితి. ఆ చిత్ర నిర్మాతలు రూపాయి వెనక్కి ఇచ్చేది లేదని తెగేసి మరీ చెప్పారు. ఆ హీరో వెనక్కి డబ్బులు ఇచ్చిన దాఖలాలు లేవు. ఆ గొడవలో హీరోని వెనకేసుకు వచ్చిన వాళ్ళు, ఇప్పుడు చిరు మీద విమర్శలు చేయడం గమనార్హం. లెక్క ప్రకారం చూస్తే... 'ఆచార్య' విడుదల తర్వాత చిరంజీవి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని, కానీ డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి అర్థం చేసుకుని చాలా వరకు తిరిగి ఇచ్చారని, 'ఏజెంట్' విడుదల తర్వాత నిర్మాత అనిల్ సుంకర అలా చేయలేదని కొందరు గుర్తు చేస్తున్నారు. 


'ఏజెంట్', అంతకు ముందు పాన్ ఇండియా ఇండియా డిజాస్టర్స్ సంగతి పక్కన పెట్టి... 'భోళా శంకర్' విషయానికి వస్తే ఇల్లు, స్థలాలు తాకట్టు పెట్టుకునే స్థితిలో నిర్మాత అనిల్ సుంకర లేరని, దేశ విదేశాల్లో వ్యాపారాల ద్వారా ఆయన నెలకు సంపాదిస్తున్న మొత్తంతో పోలిస్తే 'భోళా శంకర్' బడ్జెట్ చాలా తక్కువ అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. 


ఫ్లాప్‌ దెబ్బలు చిరంజీవికి కొత్త కాదు.. ఇలాంటి సూటిపోటి మాటలు పడటమూ కొత్త కాదు. అయితే ‘భోళా శంకర్‌’ ఫ్లాప్‌ నష్టం, కష్టం చిరంజీవి మీద రుద్దేయాలని చూస్తున్న వాళ్లు మిగిలిన సినిమాల ఫ్లాప్‌ అయినప్పుడు, డిజాస్టర్‌ అయినప్పుడు కళ్లు తెరవడం లేదేమో అనే కామెంట్లు సోషల్‌ మీడియాలో కనిపిస్తున్నాయి.


Also Read : రికార్డు క్రియేట్ చేసిన 'పుష్ప 2' ఫస్ట్ లుక్ - అది ఏమిటో తెలుసా?