ప్రతి శుక్రవారం థియేటర్లలో చిన్న సినిమాలు వస్తుంటాయి. అయితే, వాటిలో కొన్ని సినిమాలు మాత్రమే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తాయి. ఈ శుక్రవారం అయితే తెలుగు సినిమాలు అరడజనుకు పైగా వస్తున్నాయి. అందులో 'భీమదేవరపల్లి బ్రాంచి' సినిమా ఒకటి. విడుదలకు ముందు చిత్ర నిర్మాత రాజా నరేందర్ చెట్లపల్లి మీడియాతో మాట్లాడారు.


నిర్మాతగా సంతృప్తి ఇచ్చిన చిత్రమిది!
'భీమదేవరపల్లి బ్రాంచి' చిత్రాన్ని రమేష్ చెప్పాలా రచన, దర్శకత్వంలో ఏబీ సినిమాస్, నిహాల్ ప్రొడక్షన్స్ పతాకాలపై రాజా నరేందర్ చెట్లపల్లి, కీర్తి లతా గౌడ్  నిర్మించారు. జూన్ 23న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. 


గ్రామీణ నేపథ్యంలో ప్రేక్షకులు అందరికీ కనెక్ట్ అయ్యే కథాంశంతో ఈ సినిమా తీశామని రాజా నరేందర్ చెట్టపల్లి చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ''ఓ అందమైన పల్లెటూరిలో కథ జరుగుతుంది. ఆ గ్రామంలోని ప్రజల బ్యాంకు ఖాతాల్లో అనుకోకుండా పెద్ద మొత్తంలో డబ్బులు పడతాయి. ప్రభుత్వమే ఆ డబ్బులు వేసిందనుకుని అందరూ ఖర్చు పెట్టేస్తే... ఆ తర్వాత ఏమైంది? అనేది సినిమా. డబ్బులు ఖర్చు పెట్టడం కారణంగా తలెత్తిన పర్యవసానాలు ఏమిటి? అనేది 'భీమదేవరపల్లి బ్రాంచి' అసలు పాయింట్. దర్శకుడు రమేష్ చెప్పాలా సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులు అందరూ పతాక సన్నివేశాలు చూసిన తర్వాత ఓ ఆలోచనతో బయటకు వస్తారు. అంతలా సినిమా ప్రభావం చూపిస్తుంది. ఈ సినిమాతో నేను నిర్మాతగా మారడం సంతోషంగా ఉంది'' అని చెప్పారు. 


పైసలు ఎక్కడ నుంచి వచ్చాయి?
సినిమా మీద బజ్ పెంచడంలో 'భీమదేవరపల్లి బ్రాంచి' ట్రైలర్ సక్సెస్ అయ్యింది. 'ఇంతగనం పైసలు ఏడ నుంచి వచ్చాయ్ అనుకుంటున్నావ్?' అని పెద్దాయన అడగటంతో ట్రైలర్ మొదలైంది. బ్యాంకు అకౌంటులో 17 లక్షలు పడటంతో ఖర్చు పెట్టేస్తాడు. వాటిని మళ్ళీ కట్టమని అడగటంతో ఊరంతా ఏకమైంది. ఇందులో జీడీ లక్ష్మీనారాయణ కూడా కనిపించారు. ప్రభుత్వం అందించే ఉచిత పథకాలపై సినిమాలో చరించారు.


Also Read రామ్ చరణ్‌ ఇంట మాత్రమే కాదు, ఈ స్టార్ హీరోల ఇంట్లోనూ మొదటి సంతానం అమ్మాయే    



'భీమదేవరపల్లి బ్రాంచి'లో ఎవరెవరు ఉన్నారు?
'బలగం'లో తాతగా కనిపించినది కాసేపే అయినప్పటికీ... ప్రేక్షకులకు గుర్తుండే చక్కటి పాత్ర చేసిన సుధాకర్ రెడ్డి, ఈ 'భీమదేవరపల్లి బ్రాంచి' చిత్రంలో ఓ రోల్ చేశారు. ఇంకా అంజి వల్గమాన్, సాయి ప్రసన్న, రాజవ్వ, కీర్తి లత, అభిరామ్, రూప శ్రీనివాస్, బుర్ర శ్రీనివాస్, 'శుభోదయం' సుబ్బారావు, గడ్డం నవీన్, వివ రెడ్డి, సిఎస్ఆర్, నర్సింహ రెడ్డి, పద్మ, మానుకోట ప్రసాద్, తాటి గీత, విద్యా సాగర్, మహి, సత్య ప్రకాష్, 'మిమిక్రీ' మహేష్, తిరుపతి, బైరన్న కటారి, రజిని, సుష్మా తదితరులు కీలక పాత్రలు చేశారు.   


Also Read ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు రమ్మంటే 2 లక్షలు అడుగుతావా? సుమన్‌పై శివనాగు ఫైర్


'భీమదేవరపల్లి బ్రాంచి' చిత్రానికి కె. చిట్టి బాబు ఛాయాగ్రహణం అందించారు. ఈ మధ్య 'విమానం'లో అనసూయ మీద తెరకెక్కించిన 'సుమతి' పాటతో సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ ఫేమస్ అయ్యారు. ఆయన ఈ సినిమాకు సంగీతం అందించగా... సుద్దాల అశోక్ తేజ సాహిత్యం అందించారు.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial