గత కొన్నేళ్లుగా తెలుగు సినీ పరిశ్రమలో నటులుగా తమ సత్తా చాటుకోవాలనుకుంటున్న వారికి మంచి ప్రోత్సాహమే దొరుకుతోంది. కథ బాగుంటే చాలు.. కంటెంట్ బాగుంటే చాలు.. అందులో హీరో ఎవరు అని ప్రేక్షకులు పట్టించుకోవడమే మానేశారు. తాజాగా మరో హీరో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. అతనే సూర్య తేజ ఏలే. సూర్య తేజ, మీనాక్షి గోస్వామి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘భరతనాట్యం’. హీరోహీరోయిన్లు మాత్రమే కాదు.. ఈ సినిమా కోసం పనిచేసిన చాలామంది టెక్నిషియన్లు కొత్తవారే. ఒక కామెడీ కథతో ‘భరతనాట్యం’ తెరకెక్కిందని తాజాగా విడుదలైన టీజర్ చూస్తే తెలుస్తోంది.
క్రైమ్ కామెడీగా..
‘ఇండస్ట్రీలో కష్టపడే మనలాంటి హౌలాగాడి గురించే ఈ కథ’ అనే బ్యాక్‌గ్రౌండ్ వాయిస్‌తో ‘భరతనాట్యం’ టీజర్ ప్రారంభమైంది. ఆ తర్వాత ‘ఓ పేద అమ్మ, ఓ పేద నాన్న, ఒక శాడిస్టిక్ గర్ల్‌ఫ్రెండ్’ అంటూ కంటిన్యూ చేశారు. ఇదంతా రొటీన్‌గానే అనిపించినా.. అసలు కథ ఆ తర్వాతే మొదలవుతుంది. ‘అలాంటి దరిద్రంలో నుంచి బయటపడడానికి ఓ తప్పు చేయడానికి సిద్ధమవుతాడు మన హీరో’ అని ఆ బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ చెప్తుంది. ఇక అప్పటివరకు రొటీన్‌గా, కామెడీగా అనిపించిన టీజర్.. వెంటనే సీరియస్ మోడ్‌లోకి మారుతుంది. ఒక రౌడీషీటర్ పాత్రలో హర్షవర్ధన్ కనిపించాడు. తన ప్రతీ డైలాగ్ ఆకట్టుకునేలా ఉంటుంది.
అప్పుడు ఆనంద్ దేవరకొండ.. ఇప్పుడు సూర్య తేజ..
భరతనాట్యం కావాలి అంటూ టీజర్ అంతా ఆసక్తికరంగా సాగుతుంది. కానీ అసలు భరతనాట్యం ఏంటి అనేది టీజర్‌లో రివీల్ చేయలేదు మేకర్స్. టైటిల్ చూడడానికి క్లాసిక్‌గా ఉన్నా.. ‘భరతనాట్యం’ ఒక క్రైమ్ కామెడీ జోనర్‌కు చెందిన సినిమా అని టీజర్ చూస్తే తెలుస్తోంది. ‘దొరసాని’లాంటి విప్లవాత్మక ప్రేమకథను తెరకెక్కించిన కేవీఆర్ మహేంద్ర.. ‘భరతనాట్యం’తో ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమయ్యాడు. తన మొదటి సినిమాతో ఆనంద్ దేవరకొండను పరిచయం చేసిన మహేంద్ర.. ఈ సినిమాతో సూర్య తేజ ఏలేను హీరోగా టాలీవుడ్‌కు పరిచయం చేస్తున్నాడు. టీజర్ చూసిన తర్వాత సూర్య తేజ.. పక్కింటబ్బాయి పాత్రలో సరిగ్గా సరిపోయాడని ప్రేక్షకులు అనుకునే విధంగా ఉన్నాడు.
హర్షవర్ధన్ పాత్రే హైలెట్..
‘భరతనాట్యం’ టీజర్ లాంచ్ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా సినిమా తెరకెక్కిందని, ఆ విషయంలో సంతోషంగా ఉన్నామని మూవీ టీమ్ బయటపెట్టింది. మూవీలో హర్షవర్ధన్ పాత్ర సినిమాకు హైలెట్ అని తెలిపింది. హర్షవర్ధన్‌తో పాటు అజయ్ ఘోష్, సలీం ఫేకు, గంగవ్వ, కృష్ణుడు, టెంపర్ వంశీ, నాగ మహేష్, టార్జాన్, మాణిక్ రెడ్డి, శివన్నారాయణ, సత్తన్న, సంతోష్ బాలకృష్ణ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. పీఆర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై పాయల్ సరఫ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎన్నో యూత్‌ఫుల్ సినిమాలకు సంగీతాన్ని అందించిన వివేక్ సాగర్.. ‘భరతనాట్యం’కు కూడా మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేశాడు. 'భరతనాట్యం' ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని టీమ్ కాన్ఫిడెంట్‌గా ఉంది.
Also Read: 'యానిమల్'లో రణబీర్, రష్మిక ఫస్ట్ నైట్ అంత వయలెంట్‌గా ఉంటుందా?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial