సరిహద్దు ప్రాంతాల్లో తమ కంట పడ్డ భారతీయులను చైనా ఏం చేసింది? డ్రాగన్ ఆర్మీ ఎటువంటి దురాగతాలకు పాల్పడుతోంది? ముఖ్యంగా గల్వాన్ లోయలో భారతీయ సైనికులపై చైనా సైనికులు ఎటువంటి చర్యలకు పాల్పడ్డారు? అనే కథాంశంతో చైనా దాష్టీకాలను ఎండగడుతూ తీసిన దేశభక్తి సినిమా 'భారతీయన్స్' (Bharateeyans Movie). తెలుగు, హిందీ భాషల్లో ఈ శుక్రవారం సినిమా విడుదల అవుతోంది. 


దర్శకుడిగా పరిచయమవుతున్న దీన్ రాజ్
'ప్రేమించుకుందాం రా', 'ప్రేమంటే ఇదేరా', 'క‌లిసుందాం రా' తదితర హిట్ చిత్రాలకు కథా రచయితగా, ప్ర‌భాస్ హీరోగా పరిచయమైన 'ఈశ్వర్'కి స్టోరీ, స్క్రీన్‌ ప్లే రచయితగా పని చేసిన దీన్ రాజ్... 'భారతీయన్స్'తో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. 'స‌ర్దుకుపోదాం రండి', 'లాహిరి లాహిరి లాహిరిలో' చిత్రాలకు కూడా ఆయన సహ రచయితగా పని చేశారు. 


'భారతీయన్స్' చిత్రాన్ని భారత్ అమెరికన్ క్రియేషన్స్ పతాకంపై ఎన్నారై డాక్టర్ శంకర్ నాయుడు అడుసుమిల్లి నిర్మించారు. ఈ సినిమాలో నీరోజ్ పుచ్చా, సోనమ్ టెండప్, సుభా రంజన్, మహేందర్ బర్కాస్ కథానాయకులుగా... సమైరా సందు, రాజేశ్వరి చక్రవర్తి, పెడెన్ నాంగ్యాల్ కథానాయికలుగా నటించారు.


ప్రీమియర్ షోలకు రెస్పాన్స్ బావుంది - శంకర్ నాయుడు
'భారతీయన్స్' సినిమాను బుధవారం ప్రసాద్ ల్యాబ్ ప్రివ్యూ థియేటర్లో కొంత మంది ప్రేక్షకులకు ప్రత్యేకంగా ప్రదర్శించారు. అంతకు ముందు ఈ సినిమాను మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, త్రివిధ దళాల్లో గతంలో పని చేసిన కొందరు చూశారు.


Also Read : రామ్ చరణ్ సినిమాపై రెహమాన్ రియాక్షన్ ఏమిటంటే?


ప్రీమియర్ షోలకు అద్భుతమైన స్పందన లభించిందని నిర్మాత శంకర్ నాయుడు అడుసుమిల్లి సంతోషం వ్యక్తం చేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ''నేను 30 ఏళ్లుగా అమెరికాలో ఉంటున్నాను. వైద్యవృత్తిలో కొనసాగుతున్నాను. మన దేశం మీద ప్రేమ, అభిమానంతో 'భారతీయన్స్' చిత్రాన్ని నిర్మించా. దేశభక్తి చిత్రానికి సెన్సార్ పరంగా ఇబ్బందులు ఎదురు కావడం కొంచెం బాధ కలిగించినా... సినిమా చూసిన వారందరూ అభినందిచడం, ప్రశంసించడం మా కష్టాలు మర్చిపోయేలా చేసింది" అని అన్నారు.


సినిమాలో అన్ని రకాల భావోద్వేగాలు ఉన్నాయి - దీన్ రాజ్
దేశభక్తి ప్రధానంగా రూపొందిన సినిమా అయినప్పటికీ... 'భారతీయన్స్'లో అన్ని రకాల భావోద్వేగాలు ఉన్నాయని, అన్ని ఎమోషన్స్ ఉండేలా చూసుకున్నామని దర్శకుడు దీన్ రాజ్ తెలిపారు. ఈ సినిమా కచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 'భారతీయన్స్' సినిమాతో హీరోగా పరిచయం అయ్యే అవకాశం రావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు నీరోజ్ పుచ్చా. ఈ చిత్రానికి సంగీతం అందించినందుకు గర్వంగా ఉందన్నారు సత్య కశ్యప్. ఈ కార్యక్రమంలో హీరోయిన్ సమైరా సందు కూడా పాల్గొన్నారు. 


Also Read నితిన్‌ కు హ్యాండ్ ఇచ్చిన రష్మిక - కొత్త హీరోయిన్ వేటలో వెంకీ



మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, క్రికెటర్ ఏబీ డివిలియర్స్, త్రివిధ దళాల్లో పని చేసిన మాజీ సైనికాధికారుల ప్రశంసలను 'భారతీయాన్స్' సినిమా అందుకుంది. చైనా నీచ బుద్ధి ఎండగడుతూ రూపొందిన 'భారతీయన్స్' సంచలన విజయం సాధించాలని గతంలో సినిమా చూసిన మాజీ సైనికాధికారులు శ్రీనేష్ కుమార్ నోరి, కెప్టెన్ సురేష్ రెడ్డి, రాజేందర్ రెడ్డి తదితరులు కోరుకున్నారు. 









ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial