Jaya Janaki Nayaka Khoonkhar: కొన్ని సినిమాలు థియేటర్లలో హిట్‌ను అందుకోలేకపోయినా.. సరిపడా కలెక్షన్స్‌ను సంపాదించలేకపోయినా.. ఓటీటీలో విడుదలయిన తర్వాత మాత్రం సూపర్ హిట్‌ను అందుకుంటాయి. కొన్నేళ్ల క్రితం ఓటీటీలు అనేవి అంతగా ఫేమస్ అవ్వలేదు. అందుకే ఏ సినిమా అయినా యూట్యూబ్‌లో చూడాల్సిందే లేదా టీవీలో వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే. అలా తాజాగా ఒక తెలుగు హీరో నటించిన సినిమా యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. 2017లో విడుదలైన ఈ మూవీ ఇప్పటికీ యూట్యూబ్‌లో రికార్డ్ స్థాయి వ్యూస్‌తో దూసుకుపోతుండడం గురించి నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది.


‘జయ జానకీ నాయక’ రికార్డ్..


ప్రముఖ టాలీవుడ్ నిర్మాత బెల్లంకొండ సురేశ్ వారసుడిగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. తండ్రి ప్రముఖ నిర్మాతే అయినా తను మాత్రం హీరో అవ్వాలనుకున్నాడు. అలా వీవీ వినాయక్ తెరకెక్కించిన ‘అల్లుడు శ్రీను’తో హీరోగా తెలుగు ప్రేక్షకులను మొదటిసారి పలకరించాడు. తన మొదటి సినిమా కాస్త పరవాలేదనిపించి యావరేజ్ హిట్‌గా నిలిచింది. అప్పటినుండి ఏడాదికి ఒక చిత్రంతో థియేటర్లలో సందడి చేస్తూనే ఉన్నాడు. అలా బోయపాటి శ్రీనులాంటి సీనియర్ యాక్షన్ డైరెక్టర్‌తో కలిసి తను చేసిన చిత్రమే ‘జయ జానకీ నాయక’. అప్పట్లో ఈ మూవీ థియేటర్లలో అంతగా సక్సెస్ అవ్వలేదు. కానీ యూట్యూబ్‌లో మాత్రం రికార్డులు బ్రేక్ చేస్తుందంటూ పెన్ మూవీస్ తాజాగా ప్రకటించింది.


డబ్బింగ్ చిత్రాలకు క్రేజ్..


బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన తెలుగు సినిమాలు అన్నీ దాదాపుగా యావరేజ్ హిట్‌గా మాత్రమే నిలిచాయి. కానీ ఈ సినిమాల హిందీ డబ్బింగ్ మాత్రం యూట్యూబ్‌లో సెన్సేషన్‌ను క్రియేట్ చేశాయి. సాయి శ్రీనివాస్ మొదటి సినిమా ‘అల్లుడు శ్రీను’ దగ్గర నుండి ప్రతీ చిత్రం హిందీలో డబ్ అయ్యి.. యూట్యూబ్‌లో విడుదలయ్యాయి. అలాగే ‘జయ జానకీ నాయక’ కూడా విడుదలయ్యింది. ‘జయ జానకీ నాయక ఖూన్‌ఖార్’ టైటిల్‌తో ఈ మూవీ హిందీ డబ్బింగ్ యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ సినిమాకు 800 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయని డబ్బింగ్ రైట్స్‌ను సొంతం చేసుకున్న పెన్ స్టూడియోస్ సంస్థ వెల్లడించింది.






స్ట్రెయిట్ సినిమా వర్కవుట్ అవ్వలేదు..


‘జయ్ జానకీ నాయక ఖూన్‌ఖార్ ఇప్పటికీ 800 మిలియన్ వ్యూస్‌తో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. యూట్యూబ్‌లో ఎక్కువ వ్యూస్ సాధించిన ఇండియన్ సినిమాగా రికార్డును సొంతం చేసుకుంది’ అని పెన్ స్టూడియోస్ సోషల్ మీడియాలో పోస్ట్‌ను షేర్ చేసింది. ఇది చూసి ప్రేక్షకులంతా ఆశ్చర్యపోతున్నారు. యూట్యూబ్‌లో తన హిందీ డబ్బింగ్ చిత్రాలకు వచ్చిన క్రేజ్ చూసి ‘ఛత్రపతి’లాంటి సూపర్ హిట్ మూవీ రీమేక్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. కానీ ఈ సినిమా మినిమమ్ హిట్ కూడా అవ్వలేకపోయింది. భారీ ఎత్తున ‘ఛత్రపతి’ చిత్రాన్ని తెరకెక్కించిన నిర్మాతలు తీవ్రంగా నష్టపోయారు కూడా. తను నేరుగా నటించిన హిందీ సినిమాను ఆదరించకపోయినా.. తెలుగు డబ్బింగ్ సినిమాలకు ఇంకా యూట్యూబ్‌లో క్రేజ్ తగ్గలేదని ప్రేక్షకులు అనుకుంటున్నారు.


Also Read: ‘మ్యాడ్‘ మూవీ హీరోయిన్ వయసెంతో తెలుసా? ఇంత చిన్న వయస్సులో సినిమాల్లోకి వచ్చిందా?