'భీమ్లా నాయక్' సినిమాతో సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ఈ ఏడాది ఫిబ్రవరిలో విజయం అందుకుంది. ఈ నెలలో మరో చిన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలని అనుకుంది. అయితే... ఇప్పుడు ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది.


ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ రెండో కుమారుడు, హీరో సాయి శ్రీనివాస్ తమ్ముడు గణేష్ (Bellamkonda Ganesh Babu) ను హీరోగా పరిచయం చేస్తూ... సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మించిన చిత్రం 'స్వాతిముత్యం' (Swati Mutyam Movie). ఇందులో  వర్ష బొల్లమ్మ కథానాయిక.
 
వాయిదా పడటం రెండోసారి!
తొలుత జూలైలో 'స్వాతిముత్యం' సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు. ఉగాది సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ ఆ విషయం చెప్పింది. ఆ తర్వాత ఆగస్టు 13న విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఇప్పుడు అనివార్య కారణాల వల్ల ఆ రోజున కూడా విడుదల చేయడం లేదని వెల్లడించింది. కొత్త విడుదల తేదీని త్వరలో వెల్లడించనున్నారు.


''వాయిదా వేయడం మాకు ఇష్టం లేనప్పటికీ... మేం సంతోషంగా లేనప్పటికీ... వాయిదా వేయక తప్పడం లేదు. విడుదల తేదీని దృష్టిలో పెట్టుకుని షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి, రిలీజ్ ప్లాన్‌తో ముందుకు వెళ్లాలనుకున్నాం. విడుదల తేదీని ముందుగా ప్రకటించి... రెడీగా ఉన్నప్పటికీ పరిశ్రమ గురించి ఆలోచించి మేం వెనక్కి తగ్గుతున్నాం. కరోనా తర్వాత తెలుగు చలన చిత్ర పరిశ్రమ పరిస్థితి అంత గొప్పగా లేదు. ఇంతకు ముందులా ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు. మా సినిమా విడుదలకు సరైన సమయం కుదిరినప్పటికీ... ఇతర చిత్రాల నిర్మాతల పరిస్థితి చూసి మా సినిమాను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాం. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తాం. ఇంతకు ముందులా ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమాలను ఆదరిస్తారని ఆశిస్తున్నాం'' అని సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పేర్కొంది. 


Also Read : అభిమానికి డైరెక్షన్ ఛాన్స్ ఇస్తున్న అక్కినేని నాగార్జున
 
లక్ష్మణ్ కె కృష్ణ దర్శకుడిగా పరిచయం చేస్తూ... పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తోన్న చిత్రమిది. బాలమురళి పాత్రలో బెల్లంకొండ గణేష్, భాగ్యలక్ష్మి పాత్రలో వర్ష బొల్లమ్మ నటించారు. సీనియర్ నటుడు నరేష్ వీకే, రావు రమేష్, సుబ్బరాజు, 'వెన్నెల' కిషోర్, సునయన, దివ్య శ్రీపాద తదితరులు నటించిన ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు.


Also Read  : నాగ చైతన్య నవ్వితే డేటింగ్‌లో ఉన్నట్టేనా? ఆమెతో ప్రేమ నిజమేనా?