Aditya 369: ‘ఆదిత్య 369’ చిత్రంలో బాలయ్య సరసన మోహిని అనే అమ్మాయి నటించిన విషయం తెలిసిందే. అయితే ఆ అమ్మాయి కంటే ముందు ఓ స్టార్ హీరోయిన్‌ని బాలయ్య ఆ పాత్ర కోసం సజెస్ట్ చేశారట. ఈ విషయం స్వయంగా చిత్ర దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు. ‘ఆదిత్య 369’ డిజిటలైజ్ అయ్యి 4కె వెర్షన్‌లో ఏప్రిల్ 4న రీ రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఈ చిత్ర విశేషాలను మీడియాతో పంచుకుంటూ.. ఈ సినిమా క్యాస్టింగ్‌కు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను రివీల్ చేశారు. ఈ చిత్ర క్యాస్టింగ్ గురించి ఆయన మాట్లాడుతూ.. 

‘‘నేను స్క్రిప్ట్ మొత్తం రెడీ చేశాను. ప్రస్తుత రోజుల్లో ఒక సైంటిస్ట్ టైం ట్రావెల్ మెషిన్ కనిపెట్టి.. అందులో పాస్ట్‌లోకి, అలాగే ఫ్యూచర్లోకి వెళ్తారు. పాస్ట్‌కి వెళ్ళినప్పుడు చరిత్రకు సంబంధించి మనకు తెలిసిందిగా ఉండాలి. మరీ పురాణాల్లోకి, త్రేతాయుగంలోకి, మహాభారతంలోకి వెళ్లాలన్నది నా మైండ్‌లో లేదు. మొట్టమొదటిగా నేను అనుకున్నది ఏమిటంటే.. ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చిన రోజుకు వెళ్లాలని. కానీ ఆ సిచ్యుయేషన్‌లో హీరో ఇన్వాల్వ్ అవ్వడానికి స్కోప్ లేదు. ఎక్కడికి వెళ్ళినా హీరో కథలో ఇన్వాల్వ్ అవ్వాలని నా మైండ్‌లో ఉంది. అలా ఆలోచిస్తున్నప్పుడు నాకు రెండే రెండు చరిత్రకు సంబంధించిన ఘట్టాలు దొరికాయి. ఒకటి రాయలవారు భువన విజయం.. మరొకటి అక్బర్. అక్బ‌ర్ - బీర్బ‌ల్‌కు సంబంధించి ఆల్రెడీ తీశారు, ఈ కథకు అది నాకంత న‌చ్చ‌లేదు. అందుకే కృష్ణదేవరాయల కాలాన్ని ఎంచుకున్నాం. అప్ప‌టికే ఎన్టీ రామారావు శ్రీ‌కృష్ణదేవరాయలుగా కనిపించారు. అలాగే ‘మహామంత్రి తిమ్మ‌రుసు‘కు నేను ప‌ని చేశాను కూడా. పింగళి నాగేంద్రరావుకు ఒక వెర్షన్ స్క్రిప్ట్ కూడా నేనే రాశాను. ఆ రోజుల్లో నాచేత స్క్రిప్ట్ ఫ‌స్ట్ వెర్షన్ రాయించేవారు. ఆ విధంగా తిమ్మ‌రుసు స్క్రిప్ట్‌లో నేను బాగా ఇన్వాల్వ్ అయ్యాను. అలాగే శ్రీ‌కృష్ణదేవరాయల పాత్ర నాకు చాలా ఇష్టం. ఇక ఆ పాత్ర ఎవ‌రు చేయాల‌ని ఆలోచిస్తున్న‌ప్పుడు.. నాకు ఒకే ఒక వ్య‌క్తి మదిలో వ‌చ్చారు. నాడు రామారావు వేసిన శ్రీ‌కృష్ణదేవరాయల పాత్ర‌లో నేడు అంతే అద్భుతంగా రాణించాలంటే బాల‌కృష్ణకు మాత్ర‌మే సాధ్య‌మవుతుంద‌ని మేము నిర్ణ‌యించుకున్నాం. ఆ త‌ర్వాత ఆయ‌న్ను సంప్ర‌దించ‌డం, క‌థ చెప్ప‌డం, ఆయనకు స్టోరీ బాగా న‌చ్చి సినిమా చేద్దామ‌ని వెంట‌నే ఒప్పుకోవ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. శ్రీకృష్ణదేవరాయలు పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ బాల‌కృష్ణే. మ‌రెవ్వ‌రిని మేము అనుకోలేదు. ఇప్ప‌టికీ ఆ పాత్ర‌లో బాల‌కృష్ణని త‌ప్ప మ‌రొక‌రిని ఊహించ‌లేను.

Also Readమధుశాల రివ్యూ: ETV Winలో పొలిటికల్ క్రైమ్ డ్రామా... వరలక్ష్మి శరత్‌ కుమార్ సినిమా బావుందా? లేదా?

అయితే ఇక్క‌డ‌ పాస్ట్‌తో పాటు ఫ్యూచ‌ర్ స్టోరీ కూడా చాలా ప్రాముఖ్యం‌. కృష్ణదేవరాయల క‌థ అంద‌రికీ తెలిసిందే. భ‌విష్య‌త్తులోకి వెళితే ఏ ర‌కంగా ఉంటుంద‌నేది పూర్తి ఊహా ఆలోచ‌న‌. అప్పుడే అమెరికన్ లైబ్రరీకి వెళ్లాను. అక్కడ ‘ఫ్యూచరాలజీ’ అని ఒక కంప్లీట్ సెక్షన్ ఉంది. ‘ఫ్యూచరాలజీ’ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. ఉదాహరణకు ఒక ఏరియాలో ఒక యూనివర్సిటీనో లేదా కాలేజీనో కట్టాలంటే.. 50, 70 సంవత్సరాల తర్వాత ఆ ఏరియా ఎలా ఉంటుంది? అనే దాన్ని స్టాటిస్టిక్స్‌తో అంచనా వేయడమే ఫ్యూచరాలజీ. ఎన్నెన్ని రోడ్లు వస్తాయి? ఎంతమంది జనాభా పెరుగుతారు? ప్రజలకు ఎలా ఉంటుంది? ఇవన్నీ అంచనా వేయాల్సి ఉంటుంది. అది అస‌లైన‌ మెయిన్ ఫ్యూచరాలజీ. కానీ ఫ్యూచరాలజీలో నాకు కావాల్సింది కట్టు కథలు. కాబట్టి నేను, జంధ్యాల కూర్చుని ఊహించుకుని ఫ్యూచర్‌కి సంబంధించిన సన్నివేశాలను అల్లుకున్నాము.

బాల‌కృష్ణని ముందు ఫిక్స్ చేశాం. ఆ త‌ర్వాత కృష్ణ‌ప్ర‌సాదే ఆర్టిస్ట్‌ల సెల‌క్ష‌న్ బాధ్య‌త‌ తీసుకున్నారు. హీరోయిన్‌గా విజ‌య‌శాంతి ఉంటే బాగుంటుంద‌ని కృష్ణ‌ప్ర‌సాద్, బాల‌కృష్ణ‌ భావించారు. వారిద్దరిదీ అప్పటికే సక్సెస్‌ఫుల్ పెయిర్ కావడంతో, ఆమెను సంప్రదించాం. ఆమె కూడా ఈ కథ విని ఎగ్జయిట్ అయింది. తీరా చిత్రీకరణ సమయానికి కాల్షీట్లు అడ్జస్ట్ అవడం లేదు. ఈ సబ్జెక్టుకు ఆర్టిస్ట్‌ల టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడంటే అప్పుడు ఆర్టిస్టులు అందుబాటులో ఉండ‌టం ఎంతో అవ‌స‌రం. ఇక విజయశాంతి ప్లేస్‌లోకి మోహిని ఎలా వ‌చ్చిందంటే.. ‘మైఖేల్ మదన కామ రాజన్’ సినిమాకు వ‌ర్క్ చేస్తున్న స‌మ‌యంలో ఒక రోజు ద‌ర్శ‌క‌ర‌చ‌యిత పంజు అరుణాచలంతో మాట్లాడుతున్నాను. ఆయ‌నకు హార్స్ రేసులంటే చాలా ఇష్టం‌. ఎప్పుడూ హార్స్ రేసుల‌కు సంబంధించి పుస్తకాలు ప‌ట్టుకుని కనిపించేవారు. మేమిద్ద‌రం మాట్లాడుకుంటూ ఉండ‌గా, మోహని గురించి ఆయ‌న చెప్పారు. త‌మ‌ హార్స్ క్ల‌బ్‌లో ఉన్న సెక్రటరీ కూతురు చూడ‌చ‌క్క‌గా ఉంటుందంటూ మోహినిని ప‌రిచ‌యం చేశారు. అప్ప‌టికే త‌మిళ్‌లో ఆమె రెండు సినిమాలు చేసింది. దాంతో ఆమెను ఆడిష‌న్ చేశాం. యాక్టింగ్, డ్యాన్స్ అన్నీ చ‌క్క‌గా చేసింది. పైగా అడిగిన‌న్ని కాల్షీట్స్ ఇచ్చేందుకు కూడా ఆమె ఎటువంటి అభ్య‌త‌రం చెప్ప‌లేదు. కెమెరామ్యాన్ పీసీ శ్రీరామ్ కూడా మోహినిని రికమండ్ చేశారు. అలాగే టినూ ఆనంద్‌తో నాకు ముందు నుంచి ప‌రిచ‌యం ఉంది. ప్రొఫెసర్ పాత్ర‌కు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతాడని ఆయ‌నను తీసుకున్నాము. ఇక రెగ్యుల‌ర్ సినిమాల్లో మాదిరిగా భ‌య‌పెట్టే విల‌న్‌ కాకుండా.. పిల్ల‌ల‌కు కూడా ఎంట‌ర్టైనింగ్‌గా అనిపించే విల‌న్ కావాల‌ని అమ్రీష్‌పురిని సెలక్ట్ చేశాం. ఆయ‌న‌ పాత్ర కూడా కొంచెం ఫ‌న్నీగా డిజైన్ చేశాము..’’ అని సింగీతం చెప్పుకొచ్చారు.

Also Read'దిల్' రాజు సినిమాకూ టైమ్ ఇవ్వలేదు... హిందీ కోసం సౌత్ వదిలేసింది... ఇప్పుడు కామెంట్స్ ఏంటమ్మా?