ఒకప్పుడు తాము తెరకెక్కించిన సినిమాలు సూపర్ హిట్‌ను సాధిస్తే.. డైరెక్టర్స్‌ను ప్రత్యేకంగా ప్రశంసించేవారు నిర్మాతలు. కానీ ఈరోజుల్లో ట్రెండ్ మారిపోయింది. ఒక డైరెక్టర్.. ఒక నిర్మాతగా బ్లాక్‌బస్టర్ సినిమాను అందించి.. దానివల్ల నిర్మాతలకు లాభాలు తెచ్చిపెడితే.. ఆ డైరెక్టర్‌కు గిఫ్ట్‌లు ఇవ్వడం ఆనవాయితీగా మారిపోయింది. అది కూడా మామూలు గిఫ్ట్‌లు కాదు, చాలా కాస్ట్‌లీ గిఫ్ట్‌లు. ఇలా నిర్మాతలు.. డైరెక్టర్లకు కార్లు, వాచ్‌లు, గోల్డ్ గిఫ్ట్ ఇస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, దానిని చూసి ఇతర నిర్మాతలు కూడా ఇదే ఫార్ములా ఫాలో అయిపోతున్నారు. తాజాగా ‘బేబి’ మూవీ నిర్మాత కూడా అదే పనిచేశారు. దర్శకుడికి ఒక బ్రాండ్ న్యూ కారును గిఫ్ట్‌గా ఇచ్చారు.


‘బేబి’ సినిమా ఎంత సెన్సేషన్‌ను క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా యూత్ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ మూవీని తెరకెక్కించాడు దర్శకుడు సాయి రాజేష్. ఇందులో నటించిన నటీనటులు కూడా టైర్ 1కు చెందిన వారు కాకపోయినా.. సినిమాకు సరైన రేంజ్‌లో ప్రమోషన్స్ చేసి.. ఈ సినిమా వారికోసమే అని యూత్‌కు తెలిసేలా చేశారు. దీంతో ‘బేబీ’ రిలీజ్ అయిన ఫస్ట్ డే నుండే కలెక్షన్స్ ఒక రేంజ్‌లో మొదలయ్యాయి. ఈ మూవీ కథపై, ఇందులో నటించిన నటీనటులపై నెగిటివిటీ వచ్చినా.. అది కూడా వారికి ప్లస్‌గానే మారింది. ఇంత ట్రోల్ అవ్వడానికి ఈ సినిమాలో ఏముంది అని తెలుసుకోవడానికి కూడా కొందరు ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడం మొదలుపెట్టారు. దీంతో చాలారోజుల వరకు ‘బేబీ’ కోసం థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య ఏ మాత్రం తగ్గలేదు. దీంతో నిర్మాత ఎస్‌కేఎన్ ఫుల్ ఖుష్ అయ్యాడు.


‘బేబీ’ రిలీజ్ అయిన మొదటిరోజే బ్లాక్‌బస్టర్ టాక్ అందుకోవడంతో ట్రోలింగ్స్ అన్నింటిని దాటి.. హిట్ అందుకుంది అని ఎస్‌కేఎన్ ‘కల్ట్ బొమ్మ ఇచ్చాం’ అంటూ మైక్ విసిరేసి మరీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ వీడియో వైరల్‌గా కూడా మారింది. దీంతో ఎస్‌కేఎన్‌పై మీమ్స్, రీల్స్ కూడా వచ్చాయి. అయినా కూడా అవేవి పట్టించుకోకుండా ఇన్ని రోజులు ‘బేబీ’ సక్సెస్‌లో మునిగిపోయి ఉన్నారు ఈ నిర్మాత. ఓటీటీలో విడుదలయిన తర్వాత కూడా ఈ మూవీకి విపరీతమైన క్రేజ్ లభించింది. దీంతో నిర్మాత సంతోషానికి హద్దులు లేవు. అందుకే సంతోషంతో దర్శకుడికి మెర్సిడీజ్ బెంజ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు ఎస్‌కేఎన్.


తాజాగా ఎస్‌కేఎన్.. దర్శకుడు సాయి రాజేశ్‌ను తీసుకొని బెంజ్ షోరూమ్‌కు వెళ్లాడు. అక్కడ తనకు నచ్చిన కారును గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఈ వీడియో అంతా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఓవైపు దర్శకుడు ఇలా గిఫ్ట్స్ అందుకుంటూ సంతోషంగా ఉంటే.. ‘బేబీ’లో నటించిన నటీనటులు బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉన్నారు. హీరోగా నటించిన ఆనంద్ దేవరకొండ.. ‘బేబీ’తో తన కెరీర్‌లోని అతిపెద్ద హిట్‌ను అందుకున్నాడు. తెలుగమ్మాయి వైష్ణవి చైతన్యకు హీరోయిన్‌గా ఛాన్సులు ఇవ్వడానికి మేకర్స్ ముందుకొస్తున్నారు. ఇక సెకండ్ హీరోగా నటించిన విరాజ్ అశ్విన్‌కు కూడా బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు వస్తున్నాయి.






Also Read: ‘సప్త సాగరాలు దాటి’ సినిమాకు సీక్వెల్ - తెలుగు, కన్నడలో ఒకేసారి రిలీజ్


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial