తెలుగు సినిమా పరిశ్రమలో నటీనటులు ఓవర్ నైట్ లో స్టార్లుగా మారిన వాళ్లు చాలా మంది ఉన్నారు. ఒకే ఒక్క సాలిడ్ హిట్ తో టాలీవుడ్ ను ఏలుతున్న హీరోయిన్లు ఉన్నారు. 2021లో అరంగేట్రం చేసిన శ్రీలీల, కృతి శెట్టి లాంటి హీరోయిన్లు ఇలాంటి కోవకు చెందినవాళ్లే. ప్రస్తుతం స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతున్నారు. శ్రీలీల టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. ఏకంగా డజన్ చిత్రాల్లో నటిస్తోంది. వాటిలో సగానికి పైగా స్టార్ హీరోల సినిమాలే ఉన్నాయి. ‘పెళ్లి సందడి’ తర్వాత, ‘ధమాకా’లో కనిపించిన ఈ క్యూట్ బ్యూటీ, ప్రస్తుతం ‘గుంటూరు కారం’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘స్కంధ’, ‘భగవంత్ కేసరి’తో పాటు విజయ్ దేవరకొండ, వైష్ణవ్ తేజ్, నితిన్ చిత్రాల్లో నటిస్తోంది. ‘ఉప్పెన’ తర్వాత కృతిశెట్టికి సైతం ఆఫర్లు క్యూ కట్టాయి. ‘ఉప్పెన’ తర్వాత ‘శ్యామ్ సింగ రాయ్’, ‘ది వారియర్’, ’ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, ‘మాచర్ల నియోజకవర్గం’, ‘కస్టడీ’తో పాటు ‘బంగార్రాజు’ చిత్రాలను గ్యాప్ లేకుండా చేసింది.
‘బేబీ’ బ్లాక్ బస్టర్ అయినా అవకాశాలు రాలే!
తెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్య పరిస్థితి పూర్తి విరుద్ధంగా ఉంది. ‘బేబీ’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నా, ఇప్పటికీ ఒక్క కొత్త ఆఫర్ రాలేదు. పెద్ద సినిమా అవకాశాల మాట అటుంచితే, కనీసం చిన్ని, మధ్యతరహా బడ్జెట్ సినిమాల్లోనూ అవకాశాలు దక్కలేదు. ‘బేబీ’లో డ్యాన్స్, ఎమోషన్స్, ఎక్స్ ప్రెషన్స్, కామిక్ టైమింగ్‌తో వైష్ణవి పర్ఫెక్ట్ గా కనిపించింది. కానీ, అదృష్టం ఇంకా ఆమె తలుపు తట్టడం లేదు. తెలుగు హీరోయిన్లు ఎంత అద్భుతంగా నటించినా, అవకాశాలు రావు అనే మాట అప్పుడప్పుడు వినిపిస్తోంది. తాజాగా వైష్ణవికి అవకాశాలు రాకపోవడం చూస్తుంటే ఈ వాదనను కొట్టి పారేయలేం అనిపిస్తుంది. ఒక వేళ వైష్ణవి తెలుగు అమ్మాయి కాకపోయి ఉంటే, ఇప్పటికే వరుస అవకాశాలు వచ్చేవని మరికొందరు అంటున్నారు.
వైష్ణవి చైతన్య గురించి..
షార్ట్ ఫిలిమ్స్ తో కెరియర్ స్టార్ట్ చేసి కేవలం ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది వైష్ణవి చైతన్య. యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ తో ఈమె నటించిన 'బేబీ' సినిమా ఓ రేంజ్ లో సక్సెస్ అయ్యింది. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.90 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ముఖ్యంగా సినిమాలో వైష్ణవి తన యాక్టింగ్ తో అందరి చేత ప్రశంసలు అందుకుంది. ఓవైపు డీగ్లామర్ గా కనిపిస్తూనే, మరోవైపు గ్లామరస్ గా అందంగా కనిపించింది. యూత్ ఫుల్ కంటెంట్ తో వచ్చిన 'బేబీ' చిత్రం ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అయ్యింది. చిరంజీవి, అల్లు అర్జున్ లాంటి అగ్ర తారలు వైష్ణవి నటనకి ఫిదా అయిపోయారు. డైరెక్టర్ మారుతి సమర్పణలో మాస్ మూవీ మేకర్స్ పతాకంపై యువనిర్మాత SKN నిర్మించిన ఈ చిత్రం జూలై 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇవాళ్టి నుంచి ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ‘ఆహా’లో ప్రేక్షకులకు అందుబాటులో ఉంటుంది.
Read Also: ‘ఉప్పెన’ కథ వినగానే చిరంజీవి అలా అన్నారు - నేషనల్ ఫిల్మ్ అవార్డుపై దర్శకుడు బుచ్చిబాబు
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial