Makers Clarifies On Baahubali The Epic Runtime: తెలుగు సినిమా స్థాయిని ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన మూవీ అంటే మనకు గుర్తొచ్చేది 'బాహుబలి'. ఈ మూవీ రిలీజై పదేళ్లు పూర్తైన సందర్భంగా దర్శక ధీరుడు రాజమౌళి బిగినింగ్, కంక్లూజన్ రెండు సినిమాలను ఒకే పార్ట్‌గా 'బాహుబలి: ది ఎపిక్' పేరుతో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
రన్ టైం... మీమ్స్ వైరల్
రాజమౌళి ఆ ప్రకటన చేసిన వెంటనే సోషల్ మీడియా వేదికగా చర్చ సాగింది. రెండు పార్టులు కలిపి ఒకే పార్టుగా తీసుకువస్తున్నారంటే ఏ సీన్స్ ఉంచుతారు? ఏ సీన్స్ కట్ చేస్తారో అనే దానిపై నెట్టింట ప్రశ్నలు తలెత్తాయి. నిజానికి బాహుబలి ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయిన తర్వాత 'కట్టప్ప... బాహుబలిని ఎందుకు చంపాడు?' అనే ఓ క్వశ్చన్‌తోనే రెండో పార్ట్‌పై భారీ హైప్ క్రియేట్ చేశారు జక్కన్న. ఇప్పుడు రెండు పార్టులు కలిపి ఒక్కటి చేయడం వల్ల ఏ పాటలు ఉంచుతారు? ఏ సీన్స్ హైలైట్ చేస్తారు అనే దానిపై ఆడియన్స్‌లో ఉత్కంఠ నెలకొంది.
రాజమౌళి నుంచి 'బాహుబలి: ది ఎపిక్' అనౌన్స్‌మెంట్ రాగానే... ప్రముఖ టికెటింగ్ ప్లాట్ ఫాం 'బుక్ మై షో' మూవీ రన్ టైం 5 గంటల 27 నిమిషాలు అంటూ పేర్కొంది. దీంతో సోషల్ మీడియా వేదికగా మీమ్స్ వైరల్ అయ్యాయి. ఆ తర్వాత 'బుక్ మై షో' ఆ రన్ టైంను తీసేసినా... దాన్ని స్క్రీన్ షాట్ తీసిన కొందరు నెటిజన్లు రెండు పార్టులను కలిపి ఉంచినా అదే రన్ టైం వస్తుందని ట్రోల్ చేశారు. '3 గంటలే ఎక్కువ అనుకుంటే 5 గంటలా?', '5 గంటల 27 నిమిషాల రన్ టైం అంటేనే మరణం', 'రెండు పార్టులను అక్షరాలా కలిపేశారా?' అంటూ ఫన్నీ మీమ్స్‌తో హల్చల్ చేశారు.
ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన మేకర్స్
'బాహుబలి: ది ఎపిక్' రన్ టైం నెట్టింట మీమ్స్‌పై మూవీ మేకర్స్ తాజాగా రియాక్ట్ అయ్యారు. మీ రోజంతా మేము తీసుకోమని చెప్తూనే ఐపీఎల్ మ్యాచ్‌కు రన్ టైంకు లింక్ పెట్టారు. 'హ హ... పర్వాలేదు. మేం మీ రోజంతా తీసుకోం. బాహుబలి: ది ఎపిక్ ఓ థ్రిల్లింగ్ ఐపీఎల్ మ్యాచ్ రన్ టైంలానే ఉంటుంది.' అంటూ 'X'లో రాసుకొచ్చారు.
కొందరు నెటిజన్లు మాత్రం రెండు సినిమాలు అలానే ఉంచేయాలని... బాహుబలి వీరత్వం నుంచి కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?, భళ్లాల దేవున్ని శివుడు చంపడం వరకూ అలానే ఉంచేసినా బాగుంటుందని కామెంట్ చేశారు. 'సినిమా ట్రిమ్ చెయ్యొద్దు. అలా చేస్తే ఎపిక్ ఎక్స్‌పీరియన్స్ కోల్పోతాం.' అంటూ పేర్కొన్నారు.
Also Read: మహేష్ బాబు మేనల్లుడి కొత్త మూవీ 'VISA వింటారా సరదాగా' - ఫస్ట్ లుక్ అదుర్స్... టీజర్ ఎప్పుడంటే?
అక్టోబర్ 31న రిలీజ్
రెండు పార్టులను ఒకే సినిమాగా 'బాహుబలి: ది ఎపిక్'ను అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు రాజమౌళి ప్రకటించారు. దీన్ని రీ రిలీజ్ అనొద్దని... ఓ కొత్త సినిమాగా తీసుకువస్తున్నట్లు చెప్పారు. ఈ మూవీలో ప్రభాస్, రానాతో పాటు అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్, సుబ్బరాజు, ప్రభాకర్, రోహిణి, తనికెళ్ల భరణి తదితరులు కీలక పాత్రలు పోషించారు.