Ayesha Takia Reply to Trolls: కొందరు నటీనటులు సినిమాల వల్ల స్టార్‌డమ్ సంపాదించుకున్న తర్వాత కూడా హఠాత్తుగా వెండితెరకు దూరమయిపోతారు. దానికి అనేక కారణాల ఉండవచ్చు. ముఖ్యంగా నటీనటులు తమ పర్సనల్ లైఫ్, ఫ్యామిలీపై ఫోకస్ చేయడం కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. అలాంటి వారిలో బాలీవుడ్ బ్యూటీ ఆయేషా టాకియా కూడా ఒకరు. ఎన్నో ఏళ్లుగా సినీ పరిశ్రమకు, పబ్లిసిటీకి దూరంగా ఉన్న ఆయేషా.. ఇటీవల ముంబాయ్ ఎయిర్‌పోర్టులో ఫోటోగ్రాఫర్ల కంటపడింది. వారు తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా తన లుక్స్‌పై విమర్శలు వచ్చాయి. దీంతో ఆయేషా ఆ ట్రోల్స్‌కు స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇచ్చింది.






ఫ్యామిలీ ఎమర్జెన్సీ..


సినిమాల నుండి దూరమయిన తర్వాత హీరోయిన్స్ లుక్స్ చాలావరకు మారిపోతుంటాయి. ఆయేషా కూడా అలాగే మారింది. దీంతో తనపై ట్రోల్స్ మొదలయ్యాయి. వాటన్నింటిని చూస్తూ సైలెంట్‌గా ఉండాలని అనుకోలేదు ఈ భామ. అందుకే ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌తో వారందరికీ ఘాటుగా రిప్లై ఇచ్చింది. ‘ఇది మీకు చెప్పాల్సిందే. రెండు రోజుల క్రితం ఫ్యామిలీలో ఒక మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా ఉన్నపళంగా గోవా వెళ్లాల్సి వచ్చింది. వీటన్నింటి మధ్యలో ఫ్లైట్‌కు ఇంకా కాసేపు ఉంది అన్నప్పుడే ప్యాప్స్ నన్ను ఆపి పోజులు ఇవ్వమని అడిగారు’ అంటూ అసలు తను ఎయిర్‌పోర్టుకు ఎందుకు వచ్చిందో, ఎక్కడికి వెళ్తుందో ముందుగా చెప్పుకొచ్చింది ఆయేషా టాకియా.


ఏ మాత్రం ఆసక్తి లేదు..


‘దేశంలో నా లుక్స్ గురించి చర్చించుకోవడం కంటే వేరే ముఖ్యమైన పనులు ఏం లేనట్టు నాకు అనిపిస్తోంది. నా లుక్స్ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని జనాల అభిప్రాయాలు తెగ వైరల్ అవ్వడం చూస్తున్నాను. నన్ను వదిలేయండి. అందరూ చెప్తున్నట్టుగా నాకు సినిమాలు చేయడంలో, కమ్ బ్యాక్ ఇవ్వడంలో ఏ మాత్రం ఆసక్తి లేదు. నేను నా జీవితాన్ని చాలా సంతోషంగా గడుపుతున్నాను. లైమ్‌లైట్‌లో ఉండాలని అస్సలు అనుకోవడం లేదు. నాకు ఏ ఫేమ్ అవసరం లేదు. ఏ సినిమా అవసరం లేదు. కాబట్టి చిల్ అవ్వండి. నా గురించి అస్సలు పట్టించుకోకుండా ఉండడానికి మీకు హక్కు ఉంది’ అంటూ ఇక సినిమాలపై తనకు అస్సలు ఆసక్తి లేదనే విషయాన్ని బయటపెట్టింది ఆయేషా టాకియా.






అది చాలా దారుణం..


‘ఒక అమ్మాయి తన టీనేజ్‌లో ఉన్నప్పుడు తన లుక్స్ ఎలా ఉన్నాయో.. ఇప్పటికీ అలాగే ఉండాలి అని అనుకోవడం ఎంత దారుణం. మంచిగా కనిపించే అమ్మాయిలను చూడడం కంటే మీ సమయాన్ని ఇంకా ఏ ఇతర విషయాలపైన అయినా కేటాయించండి. నాకు చాలా అందమైన జీవితం దొరికింది. మీ అభిప్రాయాలు నాకు అవసరం లేదు. అవసరం ఉన్న వారికోసం వాటిని దాచిపెట్టండి’ అంటూ నెటిజన్లకు ఘాటుగా రిప్లై ఇచ్చింది ఆయేషా టాకియా. ఈ భామ ఇచ్చిన స్టేట్‌మెంట్స్‌ను చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. ఒకప్పుడు సినిమాల్లో చేస్తే ఇప్పటికీ లైమ్‌లైట్ ఉండాలని అందరూ కోరుకోరు అని, అలా అన్నింటికి దూరంగా ఉండాలి అనుకునేవారిని వదిలేయాలని చర్చించుకుంటున్నారు. చిన్నప్పుడు షహీద్ కపూర్‌తో కలిసి కాంప్లాన్ యాడ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయెషా.. తెలుగులో ‘సూపర్’ మూవీలో నటించింది. ఆ తర్వాత మళ్లీ ఆమెకు ఎలాంటి అవకాశాలు రాలేదు. అయితే, బాలీవుడ్‌లో మాత్రం 20 పైగా సినిమాల్లో నటించింది. పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైంది.


Also Read: నటుడు అలీ సీటుపై జగన్ సమాలోచనలు, వచ్చే వారంలో క్లారిటీ!