బాలీవుడ్ లో కంటే సౌత్ లోనే నెపోటిజం ఎక్కువగా ఉంటుందని నటి అవికా గోర్ సంచలన వ్యాఖ్యలు చేసింది. త్వరలో తను నటించిన ‘1920: హారర్స్ ఆఫ్ ది హార్ట్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ బిజీగా ఉంటోంది. తాజా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. దక్షిణాది చిత్రాలపై తన అభిప్రాయం గురించి ఆమె మాట్లాడుతూ నెపోటిజం గురించి కూడా మాట్లాడింది.
“స్టార్ పవర్ అంటే సౌత్. స్టార్ పవర్ మీదే సౌత్ మొత్తం నడుస్తోంది. ఇక నెపోటిజం విషయానికి వస్తే ఆ మాట విని విని విసిగిపోయాం. సౌత్ లో ఇది చాలా ఎక్కువ. కానీ ఇక్కడ ప్రేక్షకులు చూస్తున్నట్టు అక్కడి వాళ్ళు చూడరు. బాలీవుడ్, హిందీ చిత్రాల గురించి కాలక్రమేణా పక్షపాతం జరుగుతుంది. సౌత్ సినిమాలు చాలా రీమేక్ అవుతున్నాయి. వాటిని బాలీవుడ్ కాపీ కొడుతుందని అందరూ అనుకుంటున్నారు. తెలుగు ఇండస్ట్రీ మొత్తం బంధుప్రీతితో నిండి ఉంది. ప్రజలు కూడా దీనికి హైప్ క్రియేట్ చేస్తున్నారు. కొంతకాలానికి ఇది తగ్గుతుందని ఆశిస్తున్నా” అని ఆమె చెప్పుకొచ్చారు. నిజానికి అవికా ఇప్పుడే బాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. తెలుగులోనే ఆమె సినిమాలు ఎక్కువ చేసింది. అటువంటి తెలుగు ఇండస్ట్రీ గురించి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్ ద్వారా తెలుగు ప్రేకక్షలకు బాల నటిగా అవికా గోర్ పరిచయం అయ్యింది. తర్వాత రాజ్ తరుణ్ సరసన 'ఉయ్యాల జంపాల' సినిమాతో వెండి తెర మీద హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తెలుగులో 'లక్ష్మీ రావే మా ఇంటికి', 'సినిమా చూపిస్త మావ', 'ఎక్కడికి పోతావు చిన్నవాడా', 'రాజు గారి గది 3' సినిమాలతో హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. రీసెంట్ గా పాప్ కార్న్ సినిమాతో పలకరించింది కానీ ఆ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. తాజాగా హారర్ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది.
2008 లో వచ్చిన 1920 హారర్ సినిమాకు కొనసాగింపుగా తీసిన ‘1920 హారర్స్ ఆఫ్ ది హార్ట్’ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమా తెలుగు, తమిళ భాషలలొ కూడా విడుదల కాబోతోంది. ఈ సినిమాలో అవికా గోర్ లీడ్ రోల్ పోషించింది. విక్రమ్ భట్ కుమార్తె కృష్ణ భట్ దర్శకత్వం వహించింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ మంచి రెస్పాన్స్ వస్తోంది. వెన్నులో వణుకు పుట్టించే విధంగా బ్యాగ్ రౌండ్ స్కోర్, విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి.
Read Also: నిర్మాత బెల్లంకొండ సురేష్ కారులో మందు బాటిళ్లు కొట్టేసిన దొంగలు