మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన 'అష్టాచమ్మా' సినిమాతో తెలుగు వెండితెరకు నటుడిగా పరిచయమయ్యాడు అవసరాల శ్రీనివాస్. సినిమాపై ఉన్న ఆసక్తితో అమెరికాలో సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసి మరీ ఇండస్ట్రీకి వచ్చాడు. ముందు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఆ తర్వాత నటుడిగా మారాడు. అక్కడితో ఆగకుండా హీరోగా, దర్శకుడిగా, రచయితగా ఇలా తన మల్టీ టాలెంట్ తో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక 'ఊహలు గుసగుసలాడే' అనే సినిమాతో దర్శకుడిగా మారి మొదటి విజయాన్ని అందుకున్నాడు. దర్శకుడిగానే కాదు ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కూడా పోషించాడు. ఇక ఆ తర్వాత కమెడియన్ గా కూడా మెప్పించాడు. ముఖ్యంగా 'అమితుమీ' అనే సినిమాలో అవసరాల శ్రీనివాస్ కామెడీ టైమింగ్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. ఇక రీసెంట్ గా 'ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి' అనే సినిమాకి దర్శకత్వం వహించగా.. ఈ సినిమా ఇటీవల విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ ని కనబరిచింది.


యంగ్ హీరో నాగ శౌర్య, మాళవిక హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా కమర్షియల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఈ సినిమాలో కూడా ఓ కీలక పాత్ర పోషించాడు అవసరాల శ్రీనివాస్. ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు అవసరాల శ్రీనివాస్. తనకు స్టార్ బిరుదులు, అవార్డులు అసలు నచ్చవని, తాను తెరకెక్కించిన సినిమాని ఆడియో ని చూసి అది వాళ్లకు నచ్చితే అదే తనకు సంతోషమని చెప్పాడు. అంతేకాదు తనకు సక్సెస్ అంటే తన సినిమాని జనాలు చూసి హ్యాపీగా ఫీల్ అయితే అదే సక్సెస్ గా భావిస్తానని చెప్పాడు. నాకు మంచి నటుడిగా రచయితగా దర్శకుడిగా పేరు పొందాలని ఉంది. కానీ స్టార్ గా పేరు రావాలనేది తాను ఎప్పుడు కోరుకొనని.. అది తనకు అసలు నచ్చదని చెప్పాడు. ఇక ఈ క్రమంలోనే తన తోటి నటుడు విజయ్ సాయి మరణం పై స్పందిస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విజయ్ సాయి తెలుగులో ఎన్నో సినిమాల్లో కామెడీ పాత్రలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.


అవసరాల శ్రీనివాస్ తో కలిసి 'వరప్రసాద్ పొట్టి ప్రసాద్' అనే సినిమా చేశాడు విజయ్. అయితే కుటుంబ కలహాల నేపథ్యంలో 2017 డిసెంబర్ 11న విజయ్ సాయి తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా విజయ్ సాయి మరణం గురించి శ్రీనివాస్ మాట్లాడుతూ.. "విజయ్ సాయి సూసైడ్ చేసుకున్నప్పుడు నేను ఇండస్ట్రీకి చాలా కొత్త. అప్పటికి నేను రెండే సినిమాలు చేశాను. విజయ్ గురించి నాకు అప్పటికి పూర్తిగా తెలియదు. కానీ ఏవో అతనికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్లున్నాయి. సూసైడ్ చేసుకున్న సమయంలో నాతో ఉన్న విజయ్ నేను న్యూస్ లో చూసిన విజయ్ ఒకరేనా అని అనిపించింది. నాకేం అర్థం కాలేదు. విజయ్ ఎప్పుడూ నేను ఇది ఎలాగైనా చేస్తాను, ఎలాగోలా మేనేజ్ చేస్తాను, ఇది అలా చేద్దాం, ఇలా చేద్దాం అని చెబుతుండేవాడు. చాలా ఇన్ కంట్రోల్ గా ఉండేవాడు. అతని లైఫ్ అతని కంట్రోల్లో ఉండేది కాదు. కానీ విజయ్ సూసైడ్ న్యూస్ విని నేను షాక్ అయ్యా. అంతేకాదు ఆ ఘటనతో నేను చాలా నేర్చుకున్నా. సినిమా రంగంలో కొంతమంది పైకి కనిపించినంత జాలీగా, సంతోషంగా ఉండరని.. వాటి వెనక ఎంతో స్ట్రగుల్స్ ఉంటాయని అప్పుడు నాకు అనిపించింది" అంటూ చెప్పుకొచ్చాడు.


Also Read: ఆ కారణంతోనే రమేష్ బాబు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారు: కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు