Avantika Vandanapu Responds On Trolls: టాలీవుడ్‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన ఒక అమ్మాయి.. ఏకంగా హాలీవుడ్ వరకు వెళ్లిపోతుందని ఎవరూ ఊహించి ఉండరు. అలాంటి అసాధ్యమైన విషయాన్ని చేసి చూపించింది అవంతిక వందనపు. తెలుగమ్మాయి అయినా, హైదరాబాద్‌కు చెందిన కుటుంబమే అయినా అవంతిక పుట్టి పెరిగింది అంతా అమెరికాలోనే. హైదరాబాద్‌కు చెందిన కుటుంబం కావడంతో అవంతిక తెలుగు కూడా చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. ఈ విషయం తన మొదటి తెలుగు ఇంటర్వ్యూ చూసేవరకు చాలామందికి తెలియదు. తాజాగా అవంతిక పాల్గొన్న ఇంటర్వ్యూలో తనపై వస్తున్న ట్రోల్స్‌పై స్పందించింది ఈ భామ.


కోడ్ స్విచింగ్..


ముందుగా ఒక ఈవెంట్‌లో అమెరికన్ యాసలో సింపుల్‌గా ఇంగ్లీష్ మాట్లాడేసింది. ఆ వీడియో వైరల్ అవ్వడం వల్ల అవంతిక గురించి మరోసారి తెలుగు ప్రేక్షకులకు తెలిసింది. ఆ వీడియో చూసి చాలామంది షాక్ అయితే మరికొందరు మాత్రం తనను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. తాజాగా తనపై వచ్చిన ట్రోల్స్ వీడియోలను చూసి వాటిపై స్పందించింది అవంతిక. ‘‘నాకే అర్థం కావడం లేదు. నేను అమెరికాలో పుట్టి పెరిగాను. నాకు అమెరికన్ యాస నేచురల్‌గా వచ్చేస్తుంది. అమెరికాకు వలస వెళ్లిన కుటుంబాలు భాష విషయంలో కోడ్ స్విచింగ్ అనేదాన్ని ఫాలో అవుతారు. నేను, నా ఫ్రెండ్స్ కూడా స్కూల్‌కు వెళ్లినప్పుడు అమెరికన్ యాసలోనే ఇంగ్లీష్ మాట్లాడతాం. ఇంట్లో మాత్రం అదే ఇంగ్లీష్‌ను ఇండియన్ యాసలో మాట్లాడతాం. స్కూల్‌లో మాత్రం అలా అమెరికన్ యాస వచ్చేస్తుంది’’ అంటూ తన భాష అలా ఉండడానికి కారణాన్ని చెప్పుకొచ్చింది అవంతిక.


బాధగా అనిపిస్తుంది..


‘‘దానిని కోడ్ స్విచింగ్ అంటారని, దాని గురించి తెలుగు ప్రేక్షకులకు ఎక్కువగా తెలియదని నాకు అర్థమయ్యింది. యాక్సెంట్ ఫేక్ చేస్తుంది అని ట్రోల్ చేయడం చూశాను. అది నా నేచురల్ యాక్సెంటే. నేను హీరోయిన్స్‌పై కూడా ట్రోల్స్ చూస్తుంటాను. ఒక తెలుగమ్మయి హాలీవుడ్‌లో ట్రై చేస్తుంది, సక్సెస్ అవుతుంది అంటే తనకు సపోర్ట్ చూపించాలి కానీ ఇలా ట్రోల్ చేయడం అదే కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ట్రోల్స్‌ను మనం కంట్రోల్ చేయలేం కానీ నా ఐడెంటిటీకి సంబంధించిన విషయం కాబట్టి బాధగా అనిపిస్తుంది. వాళ్లు అనేది అంటారు కాబట్టి నా పని నేను చూసుకుంటాను. ‘మీన్ గర్ల్స్’ గురించి ఇండియాలో తెలిసిన తర్వాత గౌరవంగా ఫీల్ అవుతున్నారని అనుకున్నాను కానీ ఇలా ఉంటుందని అనుకోలేదు. నా తల్లిదండ్రులు దీని వల్ల గర్వంగా ఫీలవుతున్నారు, సంతోషంగా ఉన్నారు అది చాలు’’ అంటూ తనపై వస్తున్న ట్రోల్స్ గురించి మాట్లాడుతూ బాధపడింది అవంతిక.


నెపోటిజం ఉండదు..


హాలీవుడ్‌లోకి ఎంటర్ అవ్వడం కోసం యాక్టింగ్ కోర్స్ నేర్చుకున్నానని, ఇప్పటికీ వారానికి ఒకసారి యాక్టింగ్ క్లాస్‌ను వెళ్తానని బయటపెట్టింది అవంతిక. అక్కడ ఉన్న పోటీని తట్టుకోవాలంటే ఇది తప్పనిసరి అని చెప్పింది. హాలీవుడ్‌లో నెపోటిజంలాంటిది ఉండదని, టాలెంట్ ఉంటే సినీ పరిశ్రమలో పోటీని తట్టుకొని అడుగుపెట్టాలని స్టేట్‌మెంట్ ఇచ్చింది. తన తల్లి ఒకప్పుడు చార్టెడ్ అకౌంటెంట్ అయినా.. కూతురు యాక్టింగ్ కెరీర్ కోసం ఉద్యోగం మానేసిందని తెలిపింది. ప్రస్తుతం తను నటించిన ‘బిగ్ గర్ల్స్ డోంట్ క్రై’ అనే వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుండగా.. దాని ప్రమోషన్స్ కోసమే ఇండియా వచ్చానని చెప్పింది అవంతిక.


Also Read: అది తట్టుకోలేక అమెరికా వెళ్లిపోయా, అదే నా లక్ష్యం - ‘బ్రహ్మోత్సవం’ నటి అవంతిక వందనపు