Shah Rukh Khan: అవార్డ్స్ ఫంక్షన్స్‌లో జరిగే కొన్ని సంఘటనలు మనసుకు హత్తుకునేలా ఉంటాయి. కొందరికి అవార్డ్ వచ్చినప్పుడు వారి సంతోషానికి హద్దులు ఉండవు. తాజాగా దర్శకుడు అట్లీ విషయంలో కూడా అదే జరిగింది. షారుఖ్ ఖాన్‌తో కలిసి అట్లీ తెరకెక్కించిన ‘జవాన్’ సినిమాకు జీ సినీ అవార్డ్ దక్కింది. బెస్ట్ డైరెక్టర్‌గా తను అవార్డ్ అందుకోవడానికి లేచినప్పుడు పక్కనే ఉన్న షారుఖ్ ఖాన్ కాళ్లు మొక్కి మరీ స్టేజ్‌పైకి వెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మామూలుగా దర్శకులు.. అలా అందరి ముందు హీరో కాళ్లను మొక్కే సందర్భాలు చాలా అరుదుగా వస్తుంటాయని, అందులో ఇదొకటి అని షారుఖ్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు.


బెస్ట్ డైరెక్టర్..


తాజాగా 2024 జీ సినీ అవార్డ్స్ వేడుక చాలా ఘనంగా జరిగింది. దీనికి ఎందరో బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. షారుఖ్ ఖాన్ స్టేజ్ పర్ఫార్మెన్స్.. ఈవెంట్‌కే హైలెట్‌గా నిలిచింది. ఇక 2023లో షారుఖ్ హీరోగా నటించిన ‘జవాన్’ చిత్రం అవార్డుల వర్షం కురిపించింది. మిగతా చిత్రాలన్నింటిని పక్కకు తోసి అత్యధిక కేటగిరిల్లో ‘జవాన్‌’కు అవార్డులు దక్కాయి. అలాగే బెస్ట్ డైరెక్టర్ కేటగిరిలో కూడా ఈ సినిమాకు అవార్డ్ దక్కింది. దీంతో ఈవెంట్‌లో షారుఖ్ పక్కనే కూర్చున్న అట్లీ.. తన అవార్డును అందుకోవడానికి లేచాడు. అనూహ్యంగా ఉన్నట్టుండి షారుఖ్ కాళ్లకు నమస్కరించాడు. వెంటనే షారుఖ్.. తనను పైకి లేపి హగ్ చేసుకొని స్టేజ్‌పైకి పంపించాడు.






‘జవాన్’తో డెబ్యూ..


సీనియర్ నటి రాణి ముఖర్జీ చేతుల మీదుగా బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ అందుకున్నాడు అట్లీ. ఈ అవార్డుల వేడుక సందర్భంగా మరోసారి ‘జవాన్’ చిత్రాన్ని గుర్తుచేసుకుంటున్నారు షారుఖ్ ఫ్యాన్స్. గతేడాది సెప్టెంబర్ 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంలో పలు హిట్ చిత్రాలను డైరెక్ట్ చేసిన అట్లీ.. ‘జవాన్’తో మొదటిసారి బాలీవుడ్‌లో అడుగుపెట్టాడు. అది కూడా తన డెబ్యూ కోసం షారుఖ్ లాంటి సీనియర్ హీరోను ఒప్పించగలిగాడు. ఇక అప్పటివరకు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్‌తో సతమతమవుతున్న షారుఖ్‌ను ‘పఠాన్’, ‘జవాన్’ ఊపిరి పీల్చుకునేలా చేశాయి. ముఖ్యంగా ‘జవాన్’ అయితే నార్త్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకొని అట్లీకి బాలీవుడ్‌లో మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది.


కలెక్షన్స్‌లో రికార్డ్..


‘జవాన్’తో అట్లీ మాత్రమే కాదు.. నయనతార కూడా బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. మొదటిసారి హీరోహీరోయిన్‌గా నటించినా కూడా షారుఖ్, నయన్ కెమిస్ట్రీ బాగుందంటూ ప్రేక్షకులు పాజిటివ్ రివ్యూ ఇచ్చారు. వీరితో పాటు గిరిజ, సాన్య మల్హోత్రా, రిధి డోగ్రా, ప్రియమణి, లెహర్ ఖాన్, సంజీత భట్టాచార్య కూడా ఇందులో కీలక పాత్రల్లో కనిపించారు. విజయ్ సేతుపతి.. షారుఖ్ ఖాన్‌ను ఢీ కొట్టే ధీటైన విలన్ పాత్రను పోషించాడు. ఇక ఈ చిత్రం బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయంలో కూడా రికార్డులను తిరగరాసింది. ప్రపంచవ్యాప్తంగా ‘జవాన్’.. రూ.1160 కోట్లను కలెక్ట్ చేసింది. దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్‌లో కూడా ‘జవాన్’ సినిమాకు బెస్ట్ యాక్టర్‌గా అవార్డ్ గెలుచుకున్నాడు షారుఖ్ ఖాన్.


Also Read: సూర్య, జ్యోతిక ఆస్తులు అన్ని కోట్లా? భార్యాభర్తలు బాగానే సంపాదిస్తున్నారుగా!