Jaundice Symptoms and Treatment: పచ్చ కామెర్ల గురించి చిన్నప్పటి నుంచి వినే ఉంటాం. కానీ అవి ఎంత ప్రమాదకరం అని, వాటి వల్ల ప్రాణాలు పోతాయని ఇంకా చాలామందికి తెలియదు. ఇప్పటికే ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీలో ఎంతోమంది పచ్చ కామెర్లతో మృతిచెందారు. గత వారం ప్రముఖ బాలీవుడ్ నటి అమన్‌దీప్ సోహి.. ఈ వ్యాధి వల్ల మృతిచెందగా.. తాజాగా సౌత్ డైరెక్టర్ సూర్య కిరణ్ కూడా పచ్చ కామెర్లతోనే మృతి చెందారని ఆయన కుటుంబ సభ్యులు ప్రకటించారు. అసలు పచ్చ కామెర్ల లక్షణాలు ఏంటి, దీనికి ఎలాంటి చికిత్స పొందాలి? పచ్చ కామెర్లు ముదిరితే మరణం తప్పదా?
ఎక్కువగా పసికందుల్లో..
లివర్ ఆరోగ్యంగా లేకపోవడం వల్ల పచ్చ కామెర్లు అటాక్ అవుతాయని డాక్టర్లు చెప్తున్నారు. దీని వల్ల ముందుగా చర్మం, గోళ్లు, కళ్లతో పాటు ఇతర శరీర భాగాలు కూడా పచ్చగా అవుతాయి. రక్తంలో ఎర్ర రక్తకణాలు చనిపోతూ ఆ స్థానంలోకి బిలిరుబిన్ అనే ఎల్లో పిగ్మెంట్ చేరుతుంది. దాని వల్ల శరీర భాగాలు పచ్చగా అవ్వడం మొదలవుతుంది. మామూలుగా అప్పుడే పుట్టిన పిల్లలకు పచ్చ కామెర్లు ఎక్కువగా అటాక్ అవుతాయి. కానీ పసికందులకు వీటి వల్ల ఎక్కువగా సమస్య ఉండదు. వాటంతట అవే తగ్గిపోతాయి. కానీ కొన్ని అరుదైన సందర్భాల్లో అలా జరగదు. గణాంకాల ప్రకారం.. 1000 మంది అప్పుడే పుట్టిన పిల్లల్లో 2.4 శాతం మందికి అమ్మ గర్బంలో ఉన్నప్పుడే పచ్చ కామెర్లు అటాక్ అవుతాయి. అందులో 187.1 మరణాలు కూడా సంభవిస్తున్నాయి.
చిక్కుల్లో పడేసే మద్యం అలవాటు..
ముందు నుంచి పలు అనారోగ్య సమస్యలు ఎదుర్కుంటున్న వారు మాత్రమే కాదు.. ఏ సమస్య లేనివారికి కూడా ఈ పచ్చ కామెర్లు అటాక్ అయ్యే అవకాశం ఉంది. ఇది మద్యపానం వల్ల కూడా వస్తుందని డాక్టర్లు చెప్తున్నారు. ఎక్కువ మద్యం అలవాటు ఉన్నవారికి మాత్రమే కాదు.. ఉన్నట్టుండి మానేసిన వారికి కూడా పచ్చ కామెర్లు అటాక్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. పచ్చ కామెర్లు సోకినవారి కళ్లు చాలా పచ్చగా మారుతాయి. అంతే కాకుండా మూత్రం కూడా పచ్చగా మారి వాసన వస్తుంది. అలాంటప్పుడు వెంటనే వారు డాక్టర్లను సంప్రదించాలి.
చికిత్స తీసుకోవాల్సిందే..
పై చెప్పిన లక్షణాలు ఎవరిలో అయినా కనిపిస్తే వారు వెంటనే డాక్టర్లను సంప్రదించి దానికి తగిన చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. చాలావరకు కేసుల్లో మందుల వల్ల పచ్చ కామెర్లు తగ్గిపోతాయి. ఆటో ఇమ్యూన్ లివర్ వ్యాధుల్లో ఉపయోగించే మందులను పచ్చ కామెర్ల కోసం ఉపయోగించాలని సూచిస్తారు డాక్టర్లు. మందులు ఉపయోగిస్తున్నా కూడా అదే సమయంలో పేషెంట్ ఇతర జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉండడం, జ్యూసీ పండ్లను తినడం, తాగడం లాంటివి చేస్తూ ఉండాలి. అంతే కాకుండా లివర్‌పై ఎక్కువగా ఒత్తిడి తీసుకురాని ఆహారాలను తినాలి. మద్యంపై కంట్రోల్ ఉండాలి. అంతే కాకుండా పచ్చ కామెర్లను ఎంత త్వరగా గుర్తిస్తే.. పేషెంట్‌కు అంత మంచిదని డాక్టర్లు చెప్తున్నారు.
Also Read: టాలీవుడ్‌లో విషాదం - 'సత్యం' దర్శకుడు సూర్య కిరణ్ మృతి